పేదింట పెద్ద కష్టం

ABN , First Publish Date - 2022-06-29T06:00:41+05:30 IST

భార్య, కుమార్తెతో హాయిగా జీవితం గడిచి పోతున్న తరుణంలో ఆ కుటుంబంలో కుదుపు. భర్తకు కిడ్నీ వ్యాధి సోకి మంచానికే పరిమితం కావడంతో పేదకుటుంబం తల్లడిల్లిపోతోంది.

పేదింట పెద్ద కష్టం
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వివేన్‌


 కిడ్నీవ్యాధి బారినపడిన భర్త

కాపాడేందుకు భార్య పడుతున్న బాధ వర్ణనాతీతం

 సాయం చేసేవారి కోసం ఆశగా ఎదురుచూపు

రణస్థలం, జూన్‌ 28: భార్య, కుమార్తెతో హాయిగా జీవితం గడిచి పోతున్న తరుణంలో ఆ కుటుంబంలో కుదుపు. భర్తకు కిడ్నీ వ్యాధి సోకి మంచానికే పరిమితం కావడంతో పేదకుటుంబం తల్లడిల్లిపోతోంది. వైద్యం చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో సాయం చేసే చేతుల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ నుంచి వివేన్‌ అనే వ్యక్తి ఉపాధి కోసం 2011లో రణస్థలం వచ్చాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లీష్‌ ఉపాధ్యాయుడిగా చేరాడు. ఈయనకు భార్య రూప, కుమార్తె మెరీనా ఉన్నారు. కొన్నాళ్ల పాటు వీరి జీవితం హాయిగా గడిచిపోతున్న తరుణంలో వివెన్‌ అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలు చేయించగా.. ఆయన రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్టు వైద్యులు నిర్థారించారు. కొద్దిరోజులకే మంచానికి పరిమితమయ్యాడు. స్థానికంగా నా అనేవారు లేరు. సొంత ఊరికి వెళ్లాలంటే ఆత్మాభిమానం అడ్డు వస్తోందని వివెన్‌, భార్య రూప కన్నీరుమున్నీరవుతూ చెబుతున్నారు. అటు ఉపాధి లేక.. ఇటు వైద్యానికి చేతిలో చిల్లిగవ్వ లేక కుటుంబం పడుతున్న బాధ వర్ణనాతీతం. కనీసం డయాలసిస్‌ చేసుకోలేని దుర్బర స్థితిలో ఉన్నామని వారు వాపోతున్నారు. ఊరు కాని ఊరు వచ్చామని.. గౌరవంగా బతుకుదామనుకుంటే దేవుడు తమకు అన్యాయం చేశాడంటూ రోదిస్తున్నారు. కనీసం రెండుపుటలా తినే పరిస్థితి లేదని... మందులు లేక తన భర్త పడుతున్న బాధ చూసి గుండె తరుక్కుపోతోందని రూప కన్నీటిపర్యంతమవుతూ చెబుతోంది. స్థానికంగా తమకు నా అనే వారు లేరని.. దాతలు ముందుకొచ్చి నా భర్తను కాపాడాలంటూ ఆమె వేడుకుంటోంది. ఆపన్న హస్తం అందించి ఆర్థిక సాయం చేస్తే మెరుగైన వైద్యం అందించి తన భర్తను కాపాడుకుంటానని రూప వేడుకుంటున్న తీరు స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. సాయం చేయదలచిన వారు 8374965035 సెల్‌ నెంబరుకు ఫోన్‌పే చేయాలని ఆమె వేడుకుంటోంది.  





Updated Date - 2022-06-29T06:00:41+05:30 IST