‘పొంగల్‌’ కానుక పంపిణీ

ABN , First Publish Date - 2022-01-05T14:58:13+05:30 IST

రాష్ట్రంలోని బియ్యం రేషన్‌కార్డు దారులకు, శ్రీలంక తమిళుల పునరావాస కేంద్రాల్లో ఉంటున్న శ్రీలంక తమిళులకు ఉచిత ‘పొంగల్‌’ కానుక పంపిణీ పథకం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం సచివాలయంలో

‘పొంగల్‌’ కానుక పంపిణీ

                   - ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై: రాష్ట్రంలోని బియ్యం రేషన్‌కార్డు దారులకు, శ్రీలంక తమిళుల పునరావాస కేంద్రాల్లో ఉంటున్న శ్రీలంక తమిళులకు ఉచిత ‘పొంగల్‌’ కానుక పంపిణీ పథకం ప్రారంభమైంది. మంగళవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. పసుపు, మిరప పొడి, ధనియాల పొడి, ఆవాలు, మిరియాలు, జిలకర, నెయ్యి, చింతపండు, శెనగపిండి, మినుమలు, పెసర పప్పు, రవ్వ, ఉప్పు, గోధుమ పిండి, బెల్లం, పచ్చిబియ్యం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఏలకులు, చెరకుగడతో కూడిన ఈ కానుక పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో అర్హులైన 2.15లక్షల కుటుంబాలకు రూ.1296. 99 కోట్లతో ఈ సరకులను పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి  ప్రకటించారు. ఈ ఉచిత పొంగల్‌ కానుక సరుకుల సంచులను బుధవారం నుంచి రేషన్‌షాపుల్లో టోకెన్ల పద్ధతిలో కొవిడ్‌ నిబంధనలతో పంపిణీ చేస్తారని తెలిపారు. కార్డుదారులకు గత నాలుగు రోజులుగా వారిళ్ళ వద్దే ఈ టోకెన్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ టోకెన్లలో నిర్దేశించిన సమయంలో కార్డు దారులు రేషన్‌షాపులకు వెళ్లి ఈ ఉచిత పొంగల్‌ సరకుల సంచులను పొందవచ్చునని ఆయన తెలిపారు.  కార్యక్రమంలో మంత్రులు పెరియసామి, ఆర్‌.చక్రపాణి, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరై అన్బు, సహకార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ నజీముద్దీన్‌, ఆహార వస్తువుల పంపిణీ శాఖ కమిషనర్‌ వి.రాజారామన్‌, రాష్ట్ర ప్రజా పంపిణీ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.ప్రభాకర్‌, సహకార సంఘాల రిజిస్ట్రార్‌ ఎ.షణ్ముగ సుందరం తదితర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఆలయ అర్చకులకు యూనిఫాం ...

సచివాలయంలో బుధవారం ఉదయం హిందూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పూజారులు, భట్టా చార్యులు, ఓదువార్లు (దైవకీర్తనలను ఆలాపించేవారు), ఆలయ సిబ్బందికి కొత్త యూనిఫాంను ముఖ్యమంత్రి స్టాలిన్‌ పంపిణీ చేశారు. ఆలయ అర్చకులు, భట్టాచార్యులు, పూజారులకు నెమలి కంటి రంగు అంచుకలిగిన ధోవతి, పూజారులు, ఆలయ సిబ్బందిగా పనిచేసే మహిళలకు లక్క రంగుతో పసుపు అంచు కలిగిన చీర, పురుషులకు గోధుమరంగు ఫ్యాంట్‌, చందనం రంగు చొక్కా గుడ్డను పంపిణీ చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఆ మేరకు సచివాలయంలో పదిమందికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ కొత్త యూనిఫాంలను అందజే శారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 36,684 ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, పూజారులు, భట్టా చార్యులు, ఓదువార్లకు కొత్త యూనిఫాం అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంక్రాంతి నుంచి వీరంతా కొత్త యూనిఫాంతో విధులకు హాజరవుతారని ఆయన చెప్పారు. కార్యక్రమంలో దేవాదా శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-05T14:58:13+05:30 IST