దానిమ్మ ధరహాసం

ABN , First Publish Date - 2022-09-24T05:21:46+05:30 IST

దానిమ్మ రైతుల పంట పండుతోంది. ప్రారంభ దశలోనే మంచి ధర పలుకుతోంది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దానిమ్మ ధరహాసం

దానిమ్మ ధరహాసం

తోటల వద్ద టన్నుకు రూ.1.50 లక్షలు

చెన్నై మార్కెట్‌లో రూ.2 లక్షలకుపైగా..

నెల కిందట టన్ను రూ.60 వేలు మాత్రమే..

కర్ణాటక, మహారాష్ట్రలో దెబ్బతిన్న పంట

తాడిపత్రికి వస్తున్న చెన్నై వ్యాపారులు



దానిమ్మ రైతుల పంట పండుతోంది. ప్రారంభ దశలోనే మంచి ధర పలుకుతోంది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పంట సాగుచేసినా నష్టాలపాలైన రైతులకు దానిమ్మ ఊరటనిస్తోంది. మిగిలిన పంటల కంటే పెట్టుబడి ఎక్కువైనా, ఆశించిన స్థాయిలో దిగుబడి, తగిన ధర ఉంటే రైతులకు లాభాల పంట పండుతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. నెల క్రితం తోటల వద్ద టన్ను రూ.60 వేలకు కొనుగోలు చేసిన వ్యాపారులు.. ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర ఇస్తున్నారు. గతంలో పంట దిగుబడిని అమ్మేందుకు దళారులు, వ్యాపారుల వద్దకు రైతులు వెళ్లేవారు. ప్రస్తుతం వ్యాపారులే రైతుల వద్దకు వస్తున్నారు. దీంతో రవాణా, మార్కెటింగ్‌ ఇబ్బందులు కూడా తొలగుతున్నాయి.  - తాడిపత్రి


                  తాడిపత్రి ప్రాంతంలో సాగు చేసిన దానిమ్మ కొనుగోలుకు చెన్నై నుంచి దాదాపు 20 మంది హోల్‌సేల్‌ వ్యాపారులు వస్తున్నారు. ఇక్కడి దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా తోటల వద్దకు వెళుతూ,  కాయ నాణ్యతను బట్టి ధరను ఇస్తున్నారు. కనీసం రూ.లక్ష.. ఆపై రూ.లక్షన్నర రైతుకు ఇస్తున్నారు. ఇప్పటికే పరిచయం ఉన్న రైతులతో నమ్మకాన్నిబట్టి అప్పు రూపంలో కాయలను కొనుగోలు చేస్తున్నారు. వివిధ మార్కెట్లలో విక్రయించిన తర్వాత బకాయిలను చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. కొత్తగా పంట సాగుచేసిన రైతులకు నగదు చెల్లించి కొంటున్నారు. కూలీలు కూడా చెన్నై నుంచే వచ్చి పంట కోత పనులు చేస్తున్నారు. ఒక్కొక్క కూలీకి రూ.300 చొప్పున వ్యాపారులే చెల్లిస్తున్నారు. తోటల వద్ద కాయలను నాణ్యతను, సైజును బట్టి గ్రేడింగ్‌ చేసి బాక్సుల్లో నింపుతున్నారు. ఒక్కొక్క బాక్సులో 10 కిలోల కాయలను ప్యాక్‌ చేస్తున్నారు. అనంతరం వాహనాల్లో చెన్నై మార్కెట్‌కు తరలిస్తున్నారు. చెన్నై మార్కెట్‌లో టన్ను రూ.2 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు ధర పలుకుతోంది.


అక్కడ తగ్గిన దిగుబడి

కర్ణాటక, మహారాష్ట్రలో దానిమ్మ పంటకు తెగులు సోకింది. దీంతో అక్కడ దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఆ రెండు రాషా్ట్రల్లో పంట సాగు ఎక్కువగా ఉంది. చెన్నై, కోయంబత్తూరు, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని పెద్ద మార్కెట్లకు కర్ణాటక, మహారాష్ట్ర దానిమ్మ సరఫరా అయ్యేది. ఈ ఏడాది కురిసిన వర్షాలు, మారిన వాతావరణం కారణంగా తెగుళ్లు సోకి పంట దిగుబడి తగ్గింది. వైరస్‌ కారణంగా ఎకరానికి పది టన్నులు నుంచి 5 టన్నుల వరకు దిగుబడి తగ్గిపోయింది. దీంతో వివిధ మార్కెట్లకు ఆశించిన స్థాయిలో సరుకు వెళ్లడంలేదు. డిమాండ్‌ను తట్టుకొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో సాగుచేస్తున్న దానిమ్మ తోటలపై వ్యాపారులు కన్నేశారు. తాడిపత్రి ప్రాంతంలో కూడా వైరస్‌ సోకినా.. ఇక్కడి రైతులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే వైరస్‌ నివారణకు భారీగా డబ్బు వెచ్చించి.. మందులను పిచికారీ చేయాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్నిచోట్ల తెగులు అదుపులోకి రాలేదు. పంటను కాపాడుకొనేందుకు రైతులు కాయలకు కవర్లు కట్టారు. తెగులును తట్టుకొని, మెరుగైన దిగుబడి వచ్చిన తోటలను వ్యాపారులు ఎంపిక చేసుకుంటున్నారు. వ్యాపారులు ఏపీ, తెలంగాణలోని జిల్లాలను పంచుకొని, దళారుల ద్వారా రైతులతో మాట్లాడి పంటను కొనుగోలు చేస్తున్నారు. 


కర్ణాటక మొక్కలు

     దానిమ్మ మొక్కలను కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ఎక్కువగా తాడిపత్రి ప్రాంత రైతులు కొని తెచ్చుకుంటున్నారు. భగవాన, నంది భగవాన, జైన, గణేష్‌ తదితర రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఒక్కొక్క మొక్క రూ.25 నుంచి రూ.45 ధర పలుకుతోంది. ఎకరాకు 320 మొక్కలు సాగు చేస్తారు. మొదట్లో ఎకరాకు రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చు వస్తుంది. నాలుగు సంవత్సరాల నుంచి కాపు ప్రారంభ మవుతుంది. రెండో ఏడాది నుంచి పెట్టుబడి రూ.50 వేల వరకు ఉంటుంది. 



విస్తరిస్తున్న దానిమ్మ సాగు

తాడిపత్రి ప్రాంతంలో ఏటా దానిమ్మ సాగు విస్తరిస్తోంది. తాడిపత్రి మండలంలో 350 హెక్టార్లు, పుట్లూరు మండలంలో 950 హెక్టార్లు, యల్లనూరులో 500 హెక్టార్లు, పెద్దపప్పూరు 450 హెక్టార్లలో పంట సాగులో ఉంది. ఏటా దానిమ్మ సాగు చేసే  రైతుల సంఖ్య పెరుగుతోంది. పెట్టుబడి కాస్త ఎక్కువైనా, మంచి దిగుబడి, ధర ఉంటే రూ.లక్షల ఆదాయం వస్తుంది. అందుకే దానిమ్మ సాగుకు మొగ్గు చూపుతున్నారు. పుట్లూరు మండలంలోని ఎ.కొండాపురం, బాలాపురం, పుట్లూరు, చింతలపల్లి, గరుగుచింతలపల్లి, కోమటికుంట్ల, అరకటవేముల, చింతకుంట, కందికాపుల, యల్లనూరు మండలంలోని యల్లనూరు, వేములపల్లి, మల్లేపల్లి, కృష్ణాపురం, కూచివారిపల్లి, బుక్కాపురం, తిమ్మంపల్లి, కల్లూరు, పెద్దపప్పూరు మండలంలోని అమ్మలదిన్నె, నారాపురం, ముచ్చుకోట, తిమ్మనచెరువు, జూటూరు, తాడిపత్రి మండలంలోని ఆలూరు, వెంకటరెడ్డిపల్లి, బోడాయిపల్లి తదితర గ్రామాల్లో దానిమ్మ సాగు అవుతోంది. 




ధర నిలకడగా ఉంటే..

రెండెకరాల్లో దానిమ్మను సాగుచేశాను. మొదట్లో రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం ఏడాదికి ఎకరాకు రూ.50 వేలు పెట్టుబడి అవుతోంది. గత ఏడాది వైరస్‌ వల్ల కాయలు పగిలిపోయి, రాలిపోయి తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడాది వైరస్‌ను తట్టుకొని దిగుబడి వచ్చింది. ధర నిలకడగా ఉంటే పెట్టుబడితోపాటు లాభాలు వస్తాయి. 

- శ్రీనివాసులు నాయుడు, బాలాపురం, పుట్లూరు మండలం


రెండేళ్లు నష్టపోయా..

వైరస్‌తోపాటు ఇతర తెగుల్ల వల్ల దానిమ్మపంటను రెండు సంవత్సరాల నుంచి కోల్పోతున్నాను. పెట్టుబడి కూడా సరిగా రాలేదు. ప్రస్తుతం వైరస్‌ సోకినా సకాలంలో మందులను పిచికారీ చేశాను. దీంతో పంట దక్కింది. తెగుళ్ల నుంచి ఎప్పటికప్పుడు కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నాను. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పంట దిగుబడి దెబ్బతింటుంది. ప్రస్తుత ధరల వల్ల గతంలో కోల్పోయిన పెట్టుబడితోపాటు లాభాలు వస్తాయి.   

- ప్రతాప్‌రెడ్డి, వేములపల్లి, యల్లనూరు మండలం

Updated Date - 2022-09-24T05:21:46+05:30 IST