కాలుష్య కాసారాలు

ABN , First Publish Date - 2022-04-29T06:19:12+05:30 IST

విజయవాడ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న కాల్వలు కాలుష్య కాసారాలుగా మారాయి.

కాలుష్య కాసారాలు
వ్యర్థాలతో నిండిపోయిన ఏలూరు కాల్వ

డేంజర్‌ జోన్‌లో బందరు, ఏలూరు, రైవస్‌ కాల్వలు

బ్యారేజీ దిగువ నుంచి నిండా వ్యర్థాలే 

సాగు, తాగు నీటి అవసరాలు తీర్చేది ఈ కాల్వలే

కాలుష్యం లెక్క తేల్చేందుకు సిద్ధమవుతున్న పీసీబీ


విజయవాడ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న కాల్వలు కాలుష్య కాసారాలుగా మారాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు తాగు, సాగు నీటిని అందించే ఈ కాల్వలు నీటికి బదులు వ్యర్థాలతో నిండి ఉంటున్నాయి. బ్యారేజీ నుంచి నీరు వదిలినపుడు ఈ వ్యర్థాలను, మురుగును దిగువకు సరఫరా చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే స్వచ్ఛత విషయంలో కృష్ణానది ‘ఎ’ కేటగిరీ నుంచి ‘సీ’ కేటగిరీకి పడిపోయింది. ఈ నేపథ్యంలో కాల్వల్లో ఉన్న కాలుష్య పరిమాణాల లెక్క తేల్చాలని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నిర్ణయించింది. ఈ కాల్వల్లో కాలుష్యం ఎంత స్థాయిలో ఉంది? ఇది ఎంత నుంచి ఎంతకు పెరుగుతోంది? కాల్వలను స్వచ్ఛంగా ఉంచే అవకాశం ఉందా? లేదా? అని పరిశీలిస్తుంది. త్వరలోనే పీసీబీ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ప్రకాశం బ్యారేజీ వరకు నిండుకుండలా కనిపించే కృష్ణానది రెండు చానళ్ల ద్వారా దిగువ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలను తీర్చుతోంది. తూర్పు వైపున ఉన్న కేఈ (కృష్ణా తూర్పు) ప్రధాన కాల్వ ఏడు కిలోమీటర్ల వరకు ప్రవహించి, అక్కడి నుంచి నాలుగు కాల్వలుగా చీలుతోంది. ఇవే బందరు, ఏలూరు, రైవస్‌, కేఈబీ (కృష్ణా తూర్పు బ్రాంచ్‌) కాల్వలు. బందరు, ఏలూరు, రైవస్‌ కాల్వలు నగరం మధ్య నుంచి ప్రవహిస్తుండగా, కేఈబీ కెనాల్‌ యనమలకుదురు వద్ద బందరు కాల్వ నుంచి విడిపోయి ప్రత్యేకంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజి నుంచి ప్రారంభమయ్యే కేఈ ప్రధాన కాల్వ కొద్ది దూరమే శుభ్రంగా కనిపిస్తుంది. తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్ద నుంచి కాల్వల్లో అంతా అపరిశుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. ఈ కాల్వలకు ఇరువైపులా ఉన్న గట్లను సుందరీకరించినా, ఈ అందాలు కొంతదూరమే కనిపిస్తాయి. ఆ తర్వాత నుంచి కాల్వల్లోకి నివాస ప్రాంతాల మురికినీరు నేరుగా చేరుతోంది. వాటికి చుట్టుపక్కల నివసించే ప్రజలు చెత్తాచెదారాన్ని కాల్వల్లోనే వేస్తారు. కాల్వ గట్ల వెంబడి ఇళ్లను నిర్మించుకున్న వారు ఏకంగా మరుగుదొడ్ల నుంచి డ్రెయినేజీ పైపులను నేరుగా కాల్వల్లోకి పెట్టేశారు. 


ప్రక్షాళన మాటలకే పరిమితం

కాల్వల ప్రక్షాళన మాటలకే పరిమితమైంది. బందరు, ఏలూరు కాల్వలు మురికి కూపాలుగా మారిపోయాయి. రైవస్‌ కాల్వలో దుర్గాపురం వద్ద నిర్మించిన లాకుల వద్ద టన్నుల కొద్దీ చెత్త నీటిపై తేలుతూ కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో చెత్తను నీటిలోనే వదిలేసి ఇరువైపులా గట్లపై సుందరీకరణ పేరుతో పచ్చదనాన్ని పరిచేస్తున్నారు. వర్షాకాలంలో ఈ కాల్వలు నిండుగా ప్రవహిస్తాయి. ఆ ప్రవాహ ఉధృతితో చెత్తాచెదారం దిగవకు కొట్టుకుపోతుంది. మిగిలిన కాలాల్లో చెత్త అలాగే ఉంటుంది. ఈ కాల్వలు జలవనరుల శాఖ పరిధిలోకి వచ్చినా పట్టించుకునే నాథుడే లేడు.


అసలే కలుషిత నీరు..

ఇప్పటికే కృష్ణానది నీటిలో పెరుగుతున్న కాలుష్యం ఆందోళన కలిగిస్తుండగా, ఇప్పుడిక ఈ నీటిని దిగువకు సరఫరా చేసే కాలువలు సైతం దారిపొడవునా మరింత కాలుష్యాన్ని నింపుకుంటూ ప్రవహిస్తున్నాయి. ఒకప్పుడు ‘ఎ’ కేటగిరీలో ఉన్న కృష్ణానది నెమ్మదిగా ‘సి’ కేటగిరీలోకి జారిపోయింది. ఈ నీరే కాల్వల్లోకి ప్రవహిస్తోంది. అసలే కలుషతంగా ఉన్న నీటిని కాల్వల్లోకి వచ్చిన తర్వాత మరింత కలుషితంగా మార్చుతున్నారు. ఈ ధోరణి ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది. పీసీబీ త్వరలో తేల్చబోయే గరళం లెక్కలతో అయినా కాల్వల రూపురేఖలు మారతాయో లేదో వేచి చూడాల్సి ఉంది. 


ఆందోళనస్థాయిలో నీటి ప్రమాణాలు

కృష్ణానీటిలో కాలుష్య కారకాలు పెరుగుతున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది. కృష్ణా నీరు ప్రవహిస్తున్న సంగమేశ్వరం, శ్రీశైలం ప్రాజెక్టు, వేదాద్రి, అమరావతి, ప్రకాశం బ్యారేజీ, హంసలదీవి ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కొన్నాళ్ల క్రితం నీటి నమూనాలను సేకరించారు. ఈ నీటిని పరీక్షించిన అధికారులు దీనిలో కోలీఫామ్‌ బ్యాక్టీరియా స్థాయి పెరుగుతోందని నిర్ధారించారు. హంసలదీవి వద్ద కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశంలో ఇది 892 ఎంపీఎన్‌/100 ఎంఎల్‌గా ఉన్నట్టు 2014లో నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఇదిప్పుడు 1,264 ఎంపీఎన్‌/100 ఎంఎల్‌గా ఉందని నిర్ధారణయింది. హంసలదీవి వద్ద 15,765 టీడీఎస్‌ (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) ఉందని తేల్చారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించినప్పుడు ఆందోళన కలిగించే ప్రమాణాలు కనిపిస్తున్నాయి. ఒక లీటరు నీటిలో బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీవోడీ) మూడు మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. 100 ఎంఎల్‌ నీటిలో టోటల్‌ కొలీఫామ్‌ బ్యాక్టీరియా 50 ఎంపీఎన్‌ కంటే తక్కువ ఉండాలి. హైడ్రోజన్‌ ఐయాన్‌ కాన్సన్‌ట్రేషన్‌ 6.5 నుంచి 8.5 వరకు ఉండాలి. ఈ నీరే తాగడానికి అనువైనదని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. 


ఇదీ నీటి కేటగిరి

ఎ - ఈ నీరు స్వచ్ఛమైనది. ఈ నీటిలో కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. కొంత శుద్ధి చేసుకుని తాగొచ్చు. ఇందులో డిసాల్వ్డ్‌ ఆక్సిజన్‌ ఒక లీటరు నీటిలో 5ఎంజీ కంటే ఎక్కువ ఉండాలి.


బి - ఇది స్నానానికి పనికొస్తుంది. 100 ఎంఎల్‌ నీటిలో ఎంపీఎన్‌ 500 కంటే తక్కువ ఉండాలి. ఇందులో డిసాల్వ్డ్‌ ఆక్సిజన్‌ ఒక లీటరు నీటిలో 4 ఎంజీ కంటే ఎక్కువ ఉండాలి.


సి - ఈ నీటిని తాగడానికి ఉపయోగించవచ్చు. 100 ఎంఎల్‌ నీటిలో ఎంపీఎన్‌ 5000 కంటే తక్కువ ఉండాలి. ఈ నీటిని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో సంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి, క్లోరినేషన్‌ చేసిన తర్వాత తాగొచ్చు. డిసాల్వ్డ్‌ ఆక్సిజన్‌ ఒక లీటరు నీటిలో 4 ఎంజీ కంటే ఎక్కువ ఉండాలి.


డి - ఈ నీటిని పశువులు తాగేందుకు, చేపలను పెంచడానికి ఉపయోగించవచ్చు.


ఇ - ఈ కేటగిరిలో ఉన్న నీటిని వ్యవసాయ భూములకు ఉపయోగించుకోవచ్చు. 

Updated Date - 2022-04-29T06:19:12+05:30 IST