పొలిటికల్‌ హీట్‌

ABN , First Publish Date - 2021-10-19T04:48:24+05:30 IST

ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల వ్యవధి ఉన్నప్పటికీ నాగర్‌క ర్నూల్‌ జిల్లాలో నాయకుల హల్‌చల్‌ మొదలైంది.

పొలిటికల్‌ హీట్‌
నాగర్‌కర్నూల్‌ పట్టణ వ్యూ

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఊపందుకున్న రాజకీయ కార్యకలాపాలు

జనం చుట్టూ నాయకుల ప్రదక్షిణలు

ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తుగడలు

కులాలు, వర్గాల వారీగా గణాంకాల సేకరణ


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల వ్యవధి ఉన్నప్పటికీ నాగర్‌క ర్నూల్‌ జిల్లాలో నాయకుల హల్‌చల్‌ మొదలైంది. ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ఊహాగానాలకు తెర దించుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేసినప్పటికీ ఆరు నెలలుగా అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుతో రాజకీయాలు రక్తి కడుతున్నాయి.


నాయకుల పోటాపోటీ

ఎన్నికల రాజకీయాలకు జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజక వర్గం మారుపేరుగా నిలిచింది. ఇక్కడ పార్టీలు మారడం నాయకులకు నిత్యకృత్యంగా మారడంపై అసహనం వ్యక్తమౌతోంది. ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియక కొల్లాపూర్‌ నియోకజవర్గ ప్రజలు తికమకపడుతుండగా, హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ప్రబుద్ధులు ప్రధాన పార్టీలకు చెందిన వారికి బొకేలందిస్తూ ఫోజులివ్వడం, దీని పర్యవసానంగా అంకిత భావంతో పని చేసే కార్యకర్తలకు మనోవేదన మిగలడం ప్రజాబాహుళ్యంలో పని చేస్తున్న వారికి నిరాశను మిగిలిస్తోంది. కొల్లాపూర్‌ నియోజకవర్గ విశిష్టత ఏంటంటే పార్టీల అధిష్టానాలను మేనేజ్‌ చేసుకొని టికెట్లు తెచ్చుకునే వారందరికీ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం. ఇటీవల కొంగొత్త నాయకులు పుట్టుకు రావడం ప్రధాన చర్చనీయాంశంగా మారింది.


అచ్చంపేటలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దూకుడు

జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్‌ నియోజకవర్గం అచ్చంపేటలో రాజకీయ కార్యకలాపాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇక్కడ ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజుకు దీటుగా మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తన కార్యాచరణను అమలు చేస్తున్నారు. కరోనా నేపథ్యం, ఆ తర్వాత అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఇటీవల క్రియాశీల రాజకీయాల వైపు మొగ్గు చూపుతుండడడం గమనార్హం. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా మర్రి జనార్దన్‌రెడ్డి కార్యాచరణను అమలు చేస్తున్నారు. అయితే నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి అడుగులు ఎటువైపు పడతాయోననే అంశంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు, శాసన మండలిలో ప్రభుత్వ విప్‌ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డిలకు ప్రాతినిధ్యం దక్కకపోతే వారి పరిస్థితి ఏంటనే దానిపై కూడా పలు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


జనం చుట్టూ ప్రదక్షిణలు

జనంలో తిరిగితేనే తమకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని భావిస్తున్న ప్రధాన పార్టీల నాయకులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వారంలో మూడు రోజులు మాత్రమే నియోకవర్గానికి పరిమితమయ్యే వారు ఇప్పుడు కనీసం ఐదు రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల మధ్యన ఉంటున్నారా? లేదా? అనే అంశాన్ని ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్‌ వర్గాల ద్వారా ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ క్రమంలో ప్రతి శుభ, అశుభ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ నేప థ్యంలో ప్రధానంగా పోటీలో ఉండబోయే కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు కూడా ఆ దిశగా తమ మార్గాన్ని ఎంచుకుం టున్నారు. ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు జనం మధ్యలోకి వెళ్తున్న క్రమంలో కులాలు, మతాల వారీగా వస్తున్న డిమాండ్లను తీర్చడం కష్టతరంగా మారింది. ఈ అంశంలో కూడా చాకచక్యంగా వ్యవహరిస్తున్న ప్రధాన పార్టీల నాయకులు కులాలు, వర్గాల వారీగా ప్రభావం చూపే వారి సామాజిక డిమాండ్లను తీర్చడానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తుండటం గమనార్హం. 

Updated Date - 2021-10-19T04:48:24+05:30 IST