పోలింగ్‌ గుబులు

ABN , First Publish Date - 2022-06-24T06:01:29+05:30 IST

ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం తగ్గింది. దీంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది.

పోలింగ్‌  గుబులు
సంగంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు

 

1312  : వృద్ధులను తీసుకొస్తున్న పోలీసులు

 

తగ్గిన శాతంపై తర్జనభర్జనలు

2019లో 82.44 శాతం ఓటింగ్‌.. ఇప్పుడు 64.17

గతంలోకంటే 18 శాతం తగ్గుదల

లక్ష ఓట్ల మెజారిటీ అనుమానమే!


ఆత్మకూరు, జూన్‌ 23 : ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం తగ్గింది. దీంతో అధికార పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి, లక్ష ఓట్ల మెజారిటీ చూపించి ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటి చెప్పాలని వైసీపీ  అధిష్ఠానం భావించింది. ఆ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా మోహరించి, స్థానిక నాయకులకు దిశానిర్ధేశం చేయడంతోపాటు ఓటర్లకు భారీగానే తాయిలాలు అందజేశారు. ఆ మేర ఓటింగ్‌ శాతం పెంచేందుకు శతవిధాలా ప్రయత్నించారు. గురువారం సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి  64.17 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో ఈ నియోజకర్గంలో 82 శాతం పోలింగ్‌ జరిగింది. అంటే 18 శాతం పోలింగ్‌  తగ్గడంతో లక్ష ఓట్ల మెజారిటీ అసాధ్యమని అధికార పార్టీ నేతలు కూడికలు తీసివేతల్లో నిమగ్నమై ఉన్నారు. అనుకున్న మెజారిటీ రాకపోతే తమ అధినాయకుడికి ఏం సమాధానం చెప్పాలా.. అనే ఆలోచనలో పడ్డారు. 


 64.17 శాతం పోలింగ్‌

ఆత్మకూరు నియోజకవర్గంలో గురువారం ఉదయం పోలింగ్‌ మందకొడిగా సాగింది. 11 గంటలు తరువాత అనూహ్యంగా పోలింగ్‌ శాతం పెరిగింది. నియోజకవర్గంలో 2,13,338 మంది ఓటర్లు ఉండగా 1,37,038 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 493 మంది పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటు వేశారు. మొత్తం మీద ఓటింగ్‌ శాతం 64.17 నమోదైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11.56 శాతం పోలింగ్‌ నమోదవగా, 11 గంటలకు 24.92 శాతం, మధ్యాహ్నం 1 గంటకు 44.14 శాతం, 3 గంటలకు 54.66 శాతం, సాయంత్రం 6గంటలకు 64.17 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా, వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌ రెడ్డి బ్రాహ్మణపల్లిలో, బీఎస్పీ అభ్యర్ధి నందా ఓబులేశు ఆత్మకూరు మండలం గండ్లవీడులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూటూరు మురళీకన్నబాబు కరటంపాడులో ఓటు వేశారు.


ఉన్నతాధికారుల పరిశీలన

ఉప ఎన్నికల పోలింగ్‌ సరళిని పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆత్మకూరు మండలం కరటంపాడులో ఏర్పాటు చేసిన 98, 99 పోలింగ్‌ కేంద్రాలను కలెక్టర్‌, ఎన్నికల అఽధికారి చక్రధర్‌బాబు, గుంటూరు రేంజి డీఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ విజయరావు, అదనపు ఎస్పీ చౌడేశ్వరి సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. ముందుగా సంగంలో ఏర్పాటు చేసిన 199 నుండి 210 నెంబరు పోలింగ్‌ కేంద్రాలను, మెడికల్‌ క్యాంపులను, పోలింగ్‌ ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. 


దౌర్జన్యాలు... ఘర్షణలు

వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి సొంత మండలం మర్రిపాడులో స్వల్పఘర్షణలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి. పడమటినాయుడుపల్లిలో వైసీపీ వర్గీయులు రిగ్గింగ్‌కు ప్రయత్నిస్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ అడ్డుగోవడంతో ఆయనపై గొడవకు దిగి దురుసుగా ప్రవర్తించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేశారు. అదే క్రమంలో  కృష్ణాపురం నాల్గవ నెంబరు బూత్‌లో బీజేపీ ఏజెంట్‌ విష్ణువర్ధన్‌రెడ్డిని వైసీపీ నాయకులు  కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.   బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ తమ ఏజెంట్‌ను వైసీపీ నేతల నుంచి విడిపించి కృష్ణాపురం తీసుకొచ్చారు. తిమ్మానాయుడుపేట పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ, బీజేపీ వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. అభ్యర్థి విక్రమ్‌రెడ్డి బంధువు రాజారెడ్డి పోలింగ్‌ బూత్‌లోకి రావడంతో బీజేపీ  నేతలు అడ్డుకుని, అధికారులను ప్రశ్నించారు. డీసీపల్లి పోలింగ్‌స్టేషన్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ బీజేపీ అభ్యర్థి ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పోలింగ్‌బూత్‌లో ఎందుకున్నారంటూ భరత్‌కుమార్‌ అధికారులను ప్రశ్నించడంతో వాగ్వివాదం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఆత్మకూరు మండలం అప్పారావుపాళెంలో వైసీపీ, స్వతంత్ర అభ్యర్థి వర్గ్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.


అధికారుల కృషి... తగ్గిన హింస 

ఆత్మకూరు నియోజకవర్గంలో స్వల్ప సంఘనలు మినహా ప్రశాంతంగా జరగడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాన రాజకీయపార్టీలైన వైసీపీ,  బీజేపీ అభ్యర్థులు పోటీని ప్రతిష్టాత్మకంగా భావించటంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొన్ని గ్రామాల్లో రిగ్గింగులకు పాల్పడతారనే ఊహాగానాల మధ్య ఓటర్లకు దిగులు పుట్టించింది. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు పెద్దఎత్తున బందోబస్తు చేపట్టి ముందస్తు చర్యలు తీసుకుని హింసాత్మక ఘటనలు లేకుండా నివారించగలిగారు. గతంలో హింసాత్మక పోలింగ్‌ జరిగిన ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని బందోబస్తును కట్టుదిట్టం చేశారు. 


రెడ్‌క్రా్‌సకు చెందిన సుమారు 200 మంది వలంటీర్లు దివ్యాంగులు, వృద్ధులను ఆయా బూత్‌లకు తీసుకెళ్లడంలో సహాయ పడ్డారు. వీరిని కలెక్టర్‌ చక్రధర్‌బాబు అభినందించారు.


స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగం: కలెక్టర్‌ చక్రధర్‌బాబు

ఆత్మకూరు : ఆత్మకూరు ఉప ఎన్నికలలో ప్రజలు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ లైవ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు సూక్ష్మపరిశీలకులను కూడా నియమించడం జరిగిందన్నారు. ఈ నెల 26వ తేదీన ఓట్లు లెక్కింపు ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు తెలిపారు.


పక్కా కార్యాచరణతో ప్రశాంతం : ఎస్పీ

నెల్లూరు(క్రైం) : పోలీసుల పక్కా కార్యచరణ ప్రణాళికలతో ఉప ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసాయని ఎస్పీ సీహెచ్‌ విజయరావు ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి అత్యాధునిక సాంకేతిక పరికరాలు ద్వారా ఎప్పటికప్పుడు ఎన్నికల పరిస్థితులను సమీక్షించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసిన  ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. 





Updated Date - 2022-06-24T06:01:29+05:30 IST