సీఎం గెహ్లాట్, డిప్యూటీ సీఎం పైలెట్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2020-07-11T21:40:43+05:30 IST

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌కు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు.

సీఎం గెహ్లాట్, డిప్యూటీ సీఎం పైలెట్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

జైపూర్ : ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్‌కు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. తమ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టాలని చూస్తోందంటూ ముఖ్యమంత్రి గెహ్లాట్ తరచూ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోనే పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందులో తమ వాదనను రికార్డు చేయాలని పోలీసులు పేర్కొన్నారు.


వీరిద్దరికే కాకుండా చీఫ్ విప్ మహేశ్ జోషికి కూడా నోటీసులు జారీ చేశారు. ‘‘ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు చీఫ్ విప్‌కు నోటీసులిచ్చాం. వారి ప్రకటనను రికార్డు చేయడానికి.’’ అని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. అంతేకాకుండా మరో 12 ఎమ్మెల్యేలకు కూడా త్వరలోనే నోటీసులు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు. 

ముఖ్యమంత్రి గెహ్లాట్ ఏమన్నారంటే...

తమ ఎమ్మెల్యేలకు 15 కోట్ల మేర ఆశ చూపి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తోందని గెహ్లాట్ తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని కరోనా మహమ్మారి కుదిపేస్తున్న సమయంలో కూడా బీజేపీ ఇలాంటి ప్రయత్నాలను చేస్తోందని దుయ్యబట్టారు. ఓ వైపు తాము కరోనా నుంచి ప్రజలను బయటపడేయడానికి ప్రయత్నిస్తుంటే, రాష్ట్రంలో బీజేపీ లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతోందని ఆయన మండిపడ్డారు.


కొంత మందికి 15 కోట్లిస్తామని వాగ్దానం చేశారని, మరికొంత మందికి ఇతర సహాయ సహకారాలు చేస్తామని బీజేపీ వాగ్దానం చేసిందని, ఇది నిరంతర ప్రక్రియలా కొనసాగుతోందని ఆయన ధ్వజమెత్తారు. 2014 లో బీజేపీ విజయం సాధించినప్పటి నుంచీ వారి నిజ స్వరూపం బయటపడిందని, మొదట్లో రహస్యంగా చేసే పనులను, ఇప్పుడు బహిరంగంగా చేసేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-11T21:40:43+05:30 IST