తలలు బద్దలు
ABN , First Publish Date - 2021-08-29T06:53:13+05:30 IST
హరియాణాలో అన్నదాతలపై పోలీసులు దమనకాండకు దిగారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్నాల్ జిల్లాలో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులపై అత్యంత పాశవికంగా లాఠీచార్జి చేశారు...
- హరియాణాలో అన్నదాతలపై పోలీసుల లాఠీచార్జి
- పదిమందికి తీవ్ర గాయాలు.. నిరసనగా రహదారులను దిగ్బంధించిన రైతులు
- మళ్లీ రక్తం చిందించారు: రాహుల్.. తలలు పగలగొట్టాలని కలెక్టర్ ఆదేశం
- ఆ వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్.. చర్యను ఖండించిన వరుణ్ గాంధీ
చండీగఢ్, ఆగస్టు 28: హరియాణాలో అన్నదాతలపై పోలీసులు దమనకాండకు దిగారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కర్నాల్ జిల్లాలో నిరసన ప్రదర్శన చేస్తున్న రైతులపై అత్యంత పాశవికంగా లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పది మంది రైతుల తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కర్నాల్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ ధన్కర్, పార్టీ సీనియర్ నేతలు ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రైతులు వేదిక ప్రాంతానికి చేరుకుని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. కార్యక్రమాన్ని అడ్డుకునే యత్నం చేయడంతో పోలీసులు ఒక్కసారిగా రైతులపై లాఠీలు ఝళిపించారు. దీంతో కొందరి రైతుల తలలు పగిలి వారి శరీరమంతా రక్తం కారింది. పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై సంయుక్త కిసాన్ మోర్చా తీవ్రంగా మండిపడింది. లాఠీచార్జిని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. దీంతో రైతు సంఘాల ఆధ్వర్యంలో వేల మంది అన్నదాతలు హరియాణాలోని జాతీయ రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. టోల్‌ప్లాజాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. దీంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ముఖ్యంగా ఫతేబాద్-చండీగఢ్, జింద్-పటియాలా, అంబాలా-కురుక్షేత్ర, హిసార్-చండీగఢ్, ఢిల్లీకి వెళ్లే పలు జాతీయ రహదారులపై రైతులు బైఠాయించి పోలీసుల తీరును ఎండగట్టారు. అరెస్టయిన రైతులను విడుదల చేసే వరకు రోడ్లను దిగ్బంధిస్తామని భీష్మించుకుని కూర్చారు. అయితే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించే రైతుల తలలు పగులగొట్టాలని కర్నాల్ జిల్లా కలెక్టర్ ఆయుష్ సిన్హా.. పోలీసులను ఆదేశిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు రైతులపై అతి దారుణంగా లాఠీచార్జి చేశారని హరియాణా భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ గుర్నమ్ సింగ్ ఆరోపించారు. మరోవైపు లాఠీచార్జీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. కేంద్ర ప్రభుత్వం మళ్లీ రైతుల రక్తాన్ని చిందించిందని, భారత్‌కు ఈ పరిణామం సిగ్గుచేటని ఆయన ట్వీట్ చేశారు. ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై ఖట్టర్ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ హరియాణా యూనిట్ చీఫ్ కుమారీ సెల్జా ధ్వజమెత్తారు. ఆందోళన చేస్తున్న రైతుల తలలు పగలగొట్టాలని కర్నాల్ జిల్లా కలెక్టర్ ఆయుష్ సిన్హా.. పోలీసులకు చెబుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు.
జనరల్ డయ్యర్ హయాంను తలపిస్తోంది
రైతులపై పోలీసుల లాఠీచార్జిని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఖండించారు. హరియాణాలో బీజేపీ ప్రభుత్వ తీరు బ్రిటిష్ కాలంనాటి జనరల్ డయ్యర్ హయాంను తలపిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ దాడిని భవిష్యత్తు తరాలు ఎప్పటికీ మరిచిపోవని పేర్కొన్నారు. పోలీసుల చర్యను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా ఖండించారు. పోలీసులను నిజంగా అలా ఆదేశించి ఉంటే ఖండిస్తున్నానని ఆయన అన్నారు.