ప్రీపెయిడ్‌గా దోపిడీ

ABN , First Publish Date - 2021-10-14T06:28:35+05:30 IST

అనంతలో ప్రీపెయిడ్‌ ఆటోబూత విధానం పడకేసింది. బస్సు, రైలు దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరేందుకు ఆటోలను ఆశ్రయిస్తే ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా అధిక బాడుగలు వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువు దోపి డీ చేస్తున్నారు.

ప్రీపెయిడ్‌గా దోపిడీ

మూతపడిన ప్రీపెయిడ్‌ ఆటోబూత విధానం..   

అధిక బాడుగలతో చెలరేగిపోతున్న ఆటోవాలాలు.. 

ప్రయాణికుల బేజారు

అనంతపురం టౌన, అక్టోబరు 13:  అనంతలో ప్రీపెయిడ్‌ ఆటోబూత విధానం పడకేసింది. బస్సు, రైలు దిగిన ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరేందుకు ఆటోలను ఆశ్రయిస్తే ఆటోవాలాలు  ఇష్టారాజ్యంగా అధిక బాడుగలు వసూలు చేస్తూ ప్రయాణికులను నిలువు దోపి డీ చేస్తున్నారు. ప్రశ్నిస్తే రాత్రిపూట మేము వసూలు చేసే బాడుగలు ఇంతే... ఇష్టమైతే ఆటో ఎక్కు... లేదంటే వెళ్లు అని తెగేసి చెబుతున్నారు. దీంతో గత్యంతరంలేక వారు అడిగినంత చెల్లించి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇక వర్షం వచ్చిన సందర్భాల్లో సాధారణ బాడుగలకంటే పదిరెట్లు అదనంగా వసూలు చేస్తా రు. ఇంత జరుగుతున్నా పోలీసుశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదనే విమర్శలొస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి బ స్టాండు, రైల్వేస్టేషనకు వచ్చిన ప్రయాణికుల సౌకర్యార్థం గత టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వే స్టేషనలలో ప్రీపెయిడ్‌  ఆటోబూతలను ఏర్పాటు చేసింది. ఐదు నెలలుగా ప్రీపెయిడ్‌ ఆటోబూతల నిర్వహణ శూన్యంగా మారింది. దీంతో ఆటోవాలాలు అధిక ధరల్లో బాడుగల వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆటో బాడుగల ధరలు పక్క న పెడితే అర్ధరాత్రి సమయాల్లో బస్టాండుకు చేరుకున్న మహిళలు తమ ఇళ్లకు చేరుకునే క్రమంలో ఏదైనా జరగకూడని ఘటన జరిగితే ఎవరు బాధ్యులు..? అన్న సందేహం ప్రయాణికుల నుంచి వ్యక్తమవుతోంది. కొత్త ఎస్పీ అయినా ప్రీపెయిడ్‌ ఆటోబూత నిర్వహణను మెరుగుపరచాలని ప్రయాణికులు కోరుతున్నారు.


ప్రీపెయిడ్‌ ఆటోబూత లక్ష్యమిదే...

గతంలో రాత్రి 10 గంటలు దాటిన తర్వాత స్వల్ప దూరానికి కూడా ఆటోడ్రైవర్లు ఇష్టారాజ్యంగా బాడుగలు వసూలు చేసేవారు. మరికొన్ని సందర్భాల్లో జులాయిగా వ్యవహరించే కొందరు ఆటో డ్రైవర్లు రాత్రి సమయాల్లో ఆటోలో ప్రయాణించే ఒంటరి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడం, లేదా వారివద్దనున్న నగదు, ఆభరణాలు లాక్కుని వెళ్లిన సంఘటనలున్నాయి. ఇలాంటివాటికి స్వస్తి పలుకుతూ ప్రయాణికుల క్షేమం కోసం టీడీపీ హయాంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లలో పోలీసుల సహకారంతో ప్రీపెయిడ్‌ ఆటోబూత విధానాన్ని ప్రవేశపెట్టారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలోని ప్రీపెయిడ్‌ ఆటోబూతల పరిధిలో అనుమతి పొందిన ఆటోలు మాత్రమే ప్రయాణికులను తీసుకెళ్లాల్సుంటుంది. ప్రీపెయిడ్‌ ఆటోబూత కౌంటర్‌లో ప్రతిరోజూ షిఫ్టుల వారీగా పోలీసు సిబ్బంది ఎవరో ఒకరు ఉండాలి. దూరాన్ని బట్టి పగలు, రాత్రి వేళల్లో నిర్దేశించిన చార్జీని మాత్రమే ఆటో డ్రైవర్లు వసూలు చేసేలా పోలీసు సిబ్బంది రిసిప్టు రాసి ఇవ్వడంతోపాటు, మధ్యలో ఏదైనా సమస్య వస్తే తమకు తెలిపేలా పోలీసు సిబ్బంది ఫోన నెంబర్‌ను సైతం అందులో రాసి పంపుతారు. దీంతో డ్రైవర్లు అధిక చార్జీలు వసూలు చేయడానికి ఆస్కారం లేకపోగా ప్రయాణికులతో అసభ్యంగా వ్యవహరించేందుకూ డ్రైవర్లు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. 


నిలువు దోపిడీ చేస్తున్నారు 

కొందరు డ్రైవర్లు మూకుమ్మడిగా ఏర్పడి, రాత్రివేళ  అధికమొత్తంలో బాడుగ వసూలు చేస్తున్నారు. వారిని కాద ని వేరే ఆటోను సంప్రదించాలనుకున్నా వీరు అడ్డు కుం టూ, తమ స్టాండు ఆటోలు తప్ప వేరే ఆటోలకు అనుమతిలేదంటూ పంపేస్తున్నారు. గత్యంతరం లేక వీరి ఆ టోలనే ఎక్కి అధిక బాడుగలు చెల్లించి జేబులు గుల్ల చేసుకోవాల్సొస్తోంది. పగటివేళ రూ.30 ఉండే ధరను రాత్రి వేళల్లో రూ.200కిపైగా బాడుగలు అడుగుతున్నా రు. ఈ దోపిడీని పోలీసులు అరికట్టాలి.

- రాధాకృష్ణ, ప్రయాణికుడు


ఇష్టారాజ్యంగా బాడుగలు దండుకుంటున్నారు...

ప్రీపెయిడ్‌ ఆటోబూతలో రాత్రివేళల్లో పోలీసు సిబ్బంది లేకుండటంవల్ల ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి మా ఊరి నుంచి రైలులో ప్రయాణించి తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం రైల్వే స్టేషనకు చేరుకున్నా. ఆ సమయంలో బయట వర్షం పడుతోంది. రామ్‌నగర్‌లోని ఇంటికి వెళ్లేందుకు ఆటో డ్రైవర్‌ను సంప్రదించగా రూ.500 అడిగాడు. ఇంత అధిక చార్జీనా అని ఆలోచిస్తుండగా... మా పక్కనే ఉన్న ఓ వ్యక్తి నుంచి కమలానగర్‌లోని రఘువీరా టవర్స్‌కు రూ.500, మరో వ్యక్తి నుంచి భైరవనగర్‌కు రూ.900 ఆటోడ్రైవర్లు వసూలు చేశారు. వర్షంలో ఎటుపోవాలో తెలియక పోవటం, కుటుంబ స భ్యులతో ఉండడం, పైగా వర్షం పడుతుండడంతో గత్యంతరం లేక రూ.500 ఇచ్చి రామ్‌నగర్‌కు ఆటోలో వచ్చాం.  

 -  సురేంద్ర, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌


సిబ్బంది కొరత ఉంది...

ఇటీవల జరిగిన బదిలీల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. అందుకే ప్రీపెయిడ్‌ ఆటోబూతకు సిబ్బందిని కేటాయించలేకపోయాం. కొన్ని రోజుల తర్వాత 24 గంటలూ పో లీసు సిబ్బంది ప్రీపెయిడ్‌ బూతలో ఉం డేలా చర్యలు చేపడతాం. ఆటో డ్రైవర్లనూ సమావేశపరిచి, నిబంధనలు తూచా త ప్పకుండా పాటించేలా ఆదేశాలు జారీ చేస్తాం.

           -  ప్రసాద్‌రెడ్డి, ట్రాఫిక్‌ డీఎస్పీ

Updated Date - 2021-10-14T06:28:35+05:30 IST