కొత్త డ్యూటీ..!

ABN , First Publish Date - 2022-05-31T06:11:32+05:30 IST

పోలీసులు వారి విధులు పక్కన పెట్టేశారు. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ వరకు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో వాహనాలు ఆపి, అన్నివర్గాల వారితో దిశ యాప్‌ను డౌనలోడ్‌ చేయిస్తున్నారు.

కొత్త డ్యూటీ..!

టార్గెట్లతో సతమతం

పోలీసు సిబ్బంది మొత్తం రోడ్లపైకి..

అవగాహన కల్పించకుండానే 

యాప్‌ డౌనలోడ్‌ 

ఫోన నెంబర్లు రాసుకుని 

పంపించేస్తున్న వైనం


పోలీసులు.. నిత్యం రోడ్లపైకి వస్తున్నారు.. బ్యాంకుల వద్దకెళ్లినా.. ప్రభుత్వ కార్యాలయాల వద్దకెళ్లినా.. కనిపిస్తున్నారు.. బైక్‌లు, ఆటోలు ఎక్కడపడితే అక్కడ ఆపేస్తున్నారు.. అత్యవసర పని మీద వెళ్తున్నామన్నా.. వినరు.. ఇంతహడావుడి చేస్తున్నది శాంతిభద్రతల పరిరక్షణకు అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. దిశ యాప్‌ డౌనలోడ్‌ చేయించేందుకు.. వాళ్ల విధులు పక్కనపెట్టి.. యాప్‌ డ్యూటీలోనే తరిస్తున్నారు..


హిందూపురం టౌన 

పోలీసులు వారి విధులు పక్కన పెట్టేశారు. డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌ వరకు రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ప్రధాన కూడళ్లలో వాహనాలు ఆపి, అన్నివర్గాల వారితో దిశ యాప్‌ను డౌనలోడ్‌  చేయిస్తున్నారు. ఈ యాప్‌ను ఎలా వాడుకోవాలో అవగాహన కల్పించకనే రిజిస్ర్టేషన పూర్తి చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ నిర్వహిస్తున్న మెగా రిజిస్ర్టేషన మేళాకు స్టేషన్ల వారీగా టార్గెట్లు ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో స్టేషనకు 3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో 2 వేలకు తగ్గకుండా రిజిస్ర్టేషన టార్గెట్‌ ఇస్తున్నారు. ఆ మేరకు ఒక్కో కానిస్టేబుల్‌ రోజుకు 50కి తగ్గకుండా ఫోన్లలో దిశ యాప్‌ డౌనలోడ్‌ చేయించాలంటూ వారిపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారు.


అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన మేళా...

దిశ యాప్‌ మహిళలకు రక్షణ కల్పిస్తుందని ప్రభుత్వం భావించింది. ఈ యాప్‌ డౌనలోడ్‌ చేసుకునే ముందు అవగాహన కల్పించాలి. అవేమీ చేయకుండా వచ్చిన వాహనాలన్నింటినీ ఆపి, యాప్‌ను డౌనలోడ్‌ చేయిస్తున్నారు. వారికి యాప్‌పై కనీస అవగాహన కూడా కల్పించట్లేదు. టార్గెట్‌ పూర్తి చేసుకోవాలనే తాపత్రయంతో ముందుకెళ్తున్నారు.


పోలీసులంతా రోడ్లపైకి...

దిశ యాప్‌ డౌనలోడ్‌ టార్గెట్‌ చేరుకోవాలని పోలీసులంతా రోడ్లపైకి వస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏదో ఒక కూడలిలో దిశ యాప్‌ డౌనలోడ్‌ చేసుకోవాలంటూ పోలీసులు రోడ్లపైనే ఉంటున్నారు. దీనివల్ల దంపతులు వెళ్లే సమయంలో ఇబ్బందులు పడుతున్నా పోలీసులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువతులు, మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.


పురుషులతో సైతం..

దిశ యాప్‌ ప్రవేశపెట్టింది మహిళల కోసమే. వారిపై అఘాయిత్యాలు జరగకుండా నివారించేందుకు ఈ యాప్‌ను ప్రవేశపెట్టారు. మొదట మహిళలు మాత్రమే యాప్‌ డౌనలోడ్‌ చేసుకోవాలని తెలిపారు. పోలీసులు టార్గెట్లను పూర్తి చేసుకునేందుకు పురుషులతో కూడా డౌనలోడ్‌ చేయిస్తున్నారు. ఈ యాప్‌తో తమకేం పని అని ప్రజలు అడుగుతున్నా పోలీసులు మాత్రం డౌనలోడ్‌ చేసుకోవాల్సిందేనంటున్నారు.


అవగాహన ఎక్కడ?

దిశ యాప్‌ డౌనలోడ్‌ చేయించే వరకు పోలీసులు బాధ్యత తీసుకుంటున్నారు. ఇది ఏ విధంగా మహిళలకు ఉపయోగపడుతుంది, ఏయే సందర్భాల్లో రక్షణ కల్పిస్తుంది అనే విషయాలు మాత్రం చెప్పట్లేదు. మహిళలకు సైతం ఈ యాప్‌ ఎలా ఉపయోగించాలో తెలియని పరిస్థితి నెలకొంది. డౌనలోడ్‌ చేయించడంపై చూపుతున్న శ్రద్ధ, అవగాహన కల్పించడంలో ఎందుకు చూపట్లేదని మహిళలు విమర్శిస్తున్నారు. వలంటీర్లు, మహిళా పోలీసులు ఇంటింటికీ వెళ్లి యాప్‌ను డౌనలోడ్‌ చేయించి, రిజిస్ర్టేషన ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు అవగాహన కల్పిస్తే బాగుంటుందని వారు పేర్కొంటున్నారు.


ఉన్నతాధికారులు చెప్పారని.. 

దిశ యాప్‌ డౌనలోడ్‌ టార్గెట్‌ పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారంటూ హడావుడి చేస్తున్నారు. దీనిపై అవగాహన ఎందుకు కల్పించలేదో వారికే అర్థం కాలేదు.


Updated Date - 2022-05-31T06:11:32+05:30 IST