గతి తప్పుతున్న లాఠీ

ABN , First Publish Date - 2022-05-17T05:42:35+05:30 IST

కొందరు పోలీసు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమౌతోంది. వారి వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతి తప్పుతున్న లాఠీ

బాధితులపైనే ప్రతాపం

వ్యవస్థ పట్ల సన్నగిల్లుతున్న నమ్మకం

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు తూట్లు..

కొందరు పోలీసు అధికారుల తీరు తీవ్ర వివాదాస్పదమౌతోంది. వారి వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరస్థులు, తప్పుచేసిన వారిని దం డించి, బాధితులకు రక్షణ కల్పించాల్సిన వారు.. అం దుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బాధితులపైనే ప్రతాపం చూపుతుండడం శోచనీయం. వాళ్లు నేరస్థులా, తప్పు చేశారా అని పూర్తిస్థాయిలో విచారించకుండానే లాఠీ ఝుళిపిస్తున్నారు. స్టేషనకు వచ్చీరాగానే బాదేస్తున్నారు. దీంతో పోలీసు స్టేషనకు వె ళ్లాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయేలా ఉంది ఇటీవల కొందరు పోలీసు అధికారులు ప్రదర్శించిన తీరు. బాధితులు ధైర్యంగా పోలీసు స్టేషనకు వచ్చి, తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసుకునే ది శగా పోలీసు అధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టినా క్షేత్రస్థాయిలో మాత్రం అ మ లు కావడం లేదు. కొన్నిచోట్ల మరీ దారుణం. పో లీ సు స్టేషనకు వెళ్తే ఎక్కడ తిట్ల దండకం వినాల్సి వ స్తుందో.. ఎక్కడ లాఠీ దెబ్బలు కొడతారోనని భ యపడి, బయటే పంచాయితీలు చేయించుకుంటున్న ట్లు పలువురు బాధితులు ఆవేదన చెందుతున్నారు.


స్టేషనకు వెళ్తే బాదుడే..

ఖాకీ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఉన్నతాధికారులు ఓవైపు చర్యలు చేపడుతుండగా.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది పోలీసు అధికారుల అసంబద్ద తీరుతో ఆ శాఖ అప్రతిష్టను మూటకట్టుకోవాల్సి వస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పోలీసు అధికారులకు రాజకీయ నేతల అండదండలుండటం, వారి బదిలీల్లో జోక్యం పెరగడంతో ప్రజాప్రతినిధుల చేతుల్లో పోలీసులు కీలుబొమ్మల్లా మారారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇటీవల పలు పోలీసు స్టేషన్లకు న్యా యం కోసం వచ్చిన బాధితులను నేరస్థుల్లా చితకబాదడం, వారిపట్ల అనుచితంగా మాట్లాడటం, వ్య వహరించిన తీరు, ఆ శాఖ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. సాధారణంగా పోలీసులు తప్పుచేసిన వారినే స్టేషనకు తీసుకొచ్చి, కౌన్సెలింగ్‌ ఇ స్తారు. కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు చెబితే చాలు.. బాధితులను సైతం భయపెట్టేందుకు లాఠీకి పనిచెబుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్టేషనకు ఫిర్యాదు చేసేందుకెళ్లిన బాధితులపైనే పోలీసులు తిరగబడుతుండడంతో వారు విస్తుపోతున్నారు.


పేరుకే ఫ్రెండ్లీ పోలీస్‌

పోలీసులు.. ప్రజల పట్ల కఠినంగా వ్యవహరిస్తేనో, లాఠీలతో కొడితేనో నేరాలు అదుపుచేయలేమని భావించిన ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెంచడం దీని ఉద్దేశం. నేరాలు, అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు ప్రజలు సహకరిస్తూ సమాచారం ఇస్తారని దీనిని తీసుకొచ్చారు. ఇది ఎక్కడా అమలు కావడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల పలువురు పోలీసులు.. బాధితుల పట్ల వ్యవహరించిన తీరే నిదర్శనం. స్టేషనకు వెళ్తే పోలీసులు దాడులు చేస్తారని భయపడి స్టేషన మొఖం చూడాలంటేనే జంకే పరిస్థితి నెలకొంది. కొంతమంది బాధితులు కూడా స్టేషనకు వెళ్తే ఓ వైపు లాఠీ దెబ్బలు, మరోవైపు జేబులకు చిల్లు పడుతుందని భయపడి, బయటే పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారిన కొంతమంది ఖాకీలు సివిల్‌ పంచాయితీల్లో కూడా తలదూర్చుతున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు చెప్పారంటూ స్టేషనకు పిలిపించి, బాదేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పట్టణ పరిధిలో ఓ స్థలం విషయంలో సీఐ రాత్రిపూట ఓ వ్యక్తి ఇంటికెళ్లి స్థలానికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలనీ, లేదంటే అరెస్టు చేస్తానంటూ బెదిరింపులతో సోదాలు చేశారు. దీంతో చేసేదిలేక సదరు వ్యక్తి ఆ పత్రాలను పోలీసు అధికారికి ఇచ్చినట్లు వాపోయాడు. ఇలాంటివి పట్టణంలో కోకొల్లలు. ఏది ఏమైనా ఇటీవలి పరిణామాలు పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి రాజకీయ నాయకులకు తలొగ్గకుండా పనిచేయిస్తేనే వ్యవస్థ పట్ల ప్రజల్లో గౌరవం పెరుగుతుంది.


ఇవీ ఘటనలు.. 

ఇటీవల జిల్లాతోపాటు హిందూపురం సర్కిల్‌ పరిధిలో కొందరు పోలీసులు అవలంబిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏప్రిల్‌లో చిలమత్తూరు పోలీసు స్టేషనకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన యువకుడిని ఎస్‌ఐ చితకబాది పత్రికలో రాయలేని భాషలో దుర్భాషలాడటం, ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దీనిపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దీనిపై మానవహక్కుల సంఘానికి టీడీపీ నేత లేఖ రాశారు. దీంతో చేసేదిలేక ఆ ఎస్‌ఐను వీఆర్‌కు పంపారు.

వారం క్రితం హిందూపురం మండలంలోని రామచంద్రాపురం పాఠశాలలో వస్తువులు ధ్వంసం చేశారని హెచఎం ఫిర్యాదు చేయనప్పటికీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను స్టేషనకు పిలిపించి, కొట్టడం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. 

గత నెలలో పెనుకొండ సబ్‌డివిజన పరిధిలో ఓ ఎస్‌ఐ.. నిందితుడి స్నేహితుడిని తీసుకొచ్చి స్టేషనలో బంధించి బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పెనుకొండ సబ్‌డివిజనలో నిందితులు, వారి స్నేహితులను పిలిపించి, కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వారిలో తప్పుచేయని వ్యక్తిని కూడా కొట్టడంతో తీవ్ర మనస్తాపం చెంది, ఆత్మహత్యకు యత్నించాడు.

పెనుకొండ సర్కిల్‌ పరిధిలోని ఓ స్టేషనలో పోలీసులు మందలించడంతో యువకుడు ఆత్మహత్య చేసుకోవడం పెద్దదుమారం రేపింది.


Updated Date - 2022-05-17T05:42:35+05:30 IST