దారి దోపిడీ కేసులో పరారైన వారి కోసం పోలీసుల గాలింపు

ABN , First Publish Date - 2022-08-06T07:09:01+05:30 IST

దారి దోపిడి కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జీడీ నెల్లూరు మండలం కాళేపల్లె క్రాస్‌ వద్ద ఈనెల ఒకటో తేది కేసీపీ కన్‌స్ట్రక్షన్స్‌ పీఆర్వో జాన్సన్‌ కారును అటకాయించి రూ.12 లక్షల నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే.

దారి దోపిడీ కేసులో పరారైన వారి కోసం పోలీసుల గాలింపు
నిందితులు సాయి, రూపేష్‌, ధనరాజ్‌, పరంధామనాయుడు


ఆధారాలు దొరికినట్లు సమాచారం


చిత్తూరు, ఆగస్టు 5: దారి దోపిడి కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జీడీ నెల్లూరు మండలం కాళేపల్లె క్రాస్‌ వద్ద ఈనెల ఒకటో తేది కేసీపీ కన్‌స్ట్రక్షన్స్‌ పీఆర్వో జాన్సన్‌ కారును అటకాయించి రూ.12 లక్షల నగదు దోచుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గురువారం 9 మందిని తాలూకా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో కీలక నిందితులైన సాయి, రూపేష్‌, ధనరాజ్‌, పరంధామ నాయుడు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీకి సంబంధించి నగరంలోని ఓ వ్యక్తి నుంచి కీలక సమాచారాన్ని తెలుసుకున్నారు. వీరిని పట్టుకోవడం కోసం ఎస్పీ రిషాంత్‌రెడ్డి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరంధామనాయుడు కోసం ఒక బృందం, సాయి, ధనరాజ్‌కు ఒకటి, రూపే్‌షకు మరో బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో పరంధామనాయుడు ఆర్టీసీ ఉద్యోగి కావడంతో శుక్రవారం చిత్తూరు ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి అతనికి పరిచయం ఉన్న వ్యక్తులతో పాటు బంధువుల ఇళ్లల్లో విచారించారు. సాయి, ధనరాజ్‌ కోసం పోలీసులు బెంగళూరులో గాలిస్తున్నారు. రూపేష్‌ తమిళనాడులోని అంబాల ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. వీరు ముందుగా బెయిల్‌ కోసం దరఖాస్తు ఏమైనా చేసుకున్నారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. గతంలోనూ వీరు పలు నేరాలకు పాల్పడినందున పోలీసులకు దొరకకుండా తలదాచుకోవడం వీరికి అలవాటుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, రెండు మూడు రోజుల్లో నలుగురిని పట్టుకుంటామని ఓ పోలీస్‌ అధికారి చెప్పారు. 

Updated Date - 2022-08-06T07:09:01+05:30 IST