పోలీసుకు ఏదీ భద్రత

ABN , First Publish Date - 2022-05-19T06:02:45+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భరోసా ప్రశార్థకంగా తయారైంది. ఉద్యోగి సర్వీస్‌లో చేరినప్పటి నుంచి కూడబెట్టిన డబ్బును రాష్ట్ర ప్రభుతం పక్కదారి పట్టిస్తున్నదని పోలీసు వర్గాల్లో అసంతృప్తి మొదలైంది

పోలీసుకు ఏదీ భద్రత

పోలీసు ‘భద్రతా నిధి’పై ప్రభుత్వ కన్ను 

 ఇప్పటికే జీపీఎఫ్‌ నిధులు ఖాళీ

 ప్రభుత్వ తీరుపై పోలీసుల్లో  అసంతృప్తి


జంగారెడ్డిగూడెం టౌన్‌, మే 18 : ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భరోసా ప్రశార్థకంగా తయారైంది. ఉద్యోగి సర్వీస్‌లో చేరినప్పటి నుంచి కూడబెట్టిన డబ్బును రాష్ట్ర ప్రభుతం పక్కదారి పట్టిస్తున్నదని పోలీసు వర్గాల్లో అసంతృప్తి మొదలైంది. ఖజానాను ఖాళీ చేస్తున్నా మౌనం వహించడమే తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉద్యోగులున్నారు. జీపీఎఫ్‌ (గవర్నమెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌) నిధులను ఖాళీ చేసి ఏడాది గడుస్తున్నా, భవిష్యత్‌లో జమ చేస్తామని మాటలే తప్ప ఇప్పటి వరకు చేసిందేమి లేదు. తాజాగా పోలీస్‌ శాఖకు ప్రత్యేకంగా 20 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడిన భద్రత, ఆరోగ్య భద్రతా నిధులపైనా ప్రభుత్వ కన్ను పడినట్లు శాఖలో చర్చ నడుస్తోంది. భద్రత నిధిని కూడా ఖాళీ చేసేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ  పోలీస్‌ శాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1500 మంది పోలీ సులు విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు చెందిన సుమారు 80 కోట్ల రూపాయల జీపీఎఫ్‌ ఫండ్‌ను ప్రభుత్వం తీసుకున్నది. సర్వీస్‌లో చేరినప్పటి నుంచి ప్రతీ ఉద్యోగికి ప్రభుత్వ రూల్‌ పొజిషన్‌ ప్రకారం, ఉద్యోగి శాలరీ ఆధారంగా కొంతమేర జీపీఎఫ్‌ ఫండ్‌ కింద జమ చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో ఆదా చేసేందుకు దీనిని ఉద్యోగులు కొంత మేరకు పెంచు కునే అవకాశం ఉంది. ఇన్‌సర్వీస్‌లో జీపీఎఫ్‌పై రుణం తీసుకుంటారు. ఏడాది కాలంగా జీపీఎఫ్‌ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా ఉద్యోగులకు ట్రెజరీ అధికారులు మొండిచెయ్యి చూపిస్తున్నారు. పీఎఫ్‌ ఖజానా ఖాళీగా దర్శనమివ్వడమే ఇందుకు కారణం. జీపీఎఫ్‌ నిధిని ఎప్పుడు జమచేస్తారన్న దానిపై సమాచారం లేదు.


భద్రతా నిధులపై ప్రభుత్వం ఆరా...?

2002లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ హెచ్‌జే దొర పోలీసుల వెల్ఫేర్‌ నిమిత్తం ప్రతీ ఉద్యోగి నుంచి కొంత మేర జమ చేసి భద్రతా, ఆరోగ్య భద్రతా నిధి ఖజానా ఏర్పాటు చేశారు. ఆరోగ్య భద్రత నిధిని పోలీసు, వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమ్చిత్తం, భద్రతా నిధిని హౌసింగ్‌ లోన్‌, ఎడ్యుకేషన్‌ లోన్‌ నిమిత్తం ఇతర అవసరాల నిమిత్తం వినియోగిస్తారు. ఇన్నేళ్ళ కాలంగా భద్రతా, ఆరోగ్య భద్రతా నిధులు భారీగా పోగైనట్లు తెలుస్తున్నది. ఖజానా కనిపిస్తే ఖాళీ చేసేసే ప్రభుత్వం పోలీసుల భద్రత, ఆరోగ్య భద్రత నిధులపై ఆరా తీస్తున్నదని పలువురు పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య భద్రతా హెల్త్‌ కార్డు ద్వారా రూ.10 లక్షల వరకు కవరేజ్‌ ఉంటుంది. ఉద్యోగి, కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుంది, ఎటువంటి వైద్య చికిత్సలైన కార్డు ద్వారా ఉచితంగా నిర్వహిస్తారు. పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతున్న ఈ నిధులు ఖాళీ అయితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-05-19T06:02:45+05:30 IST