48 గంటల్లో నిందితుడి అరెస్టు

ABN , First Publish Date - 2022-08-16T06:40:18+05:30 IST

తుమ్మగూడెంలో వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని 48 గంటల్లో అరెస్ట్‌ చేసినట్టు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.

48 గంటల్లో నిందితుడి అరెస్టు

వృద్ధురాలిపై అత్యాచారం కేసు


చాట్రాయి, ఆగస్టు 15: తుమ్మగూడెంలో వృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని 48 గంటల్లో అరెస్ట్‌ చేసినట్టు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. చాట్రాయి పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం నూజివీడు రూరల్‌ సీఐ అంకబాబు, స్థానిక ఎస్‌ఐ ప్రతాపరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. తుమ్మగూడెం గ్రామానికి  కిమీ దూరంలో తన తమ్ముడి మామిడితోటలో ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలు (60) వద్దకు ఈ నెల 12వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో విస్సన్నపేట మండలం నర్సాపురానికి చెందిన నిందితుడు చేవురి శ్రీను వచ్చి డబ్బులు ఇవ్వమని డిమాండ్‌ చేయగా, ఆమె నిరాకరించి గట్టిగా అరుస్తూ  పారిపోయే ప్రయత్నం చేయగా నిందితుడు ఆమెను ఈడ్చుకుంటూ షెడ్డులోకి లాక్కెళ్ళి  నోట్లో గుడ్డలు కుక్కి కర్రతో కొట్టి లైంగిక దాడికి పాల్పడినట్టు  వివరించారు. అనంతరం ఆమె బయటకు వెళ్ళకుండా షెడ్డులో ఉన్న స్తంభానికి కట్టేసి  దిండు కింద దాచుకున్న రూ. 3 వేలు దొంగిలించి పారిపోయినట్టు తెలిపారు. ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆదేశాల మేరకు సీఐ అంకబాబు కేసు దర్యాప్తును వేగంగా పూర్తిచేశారన్నారు.   నిందితుడు చేవురి శ్రీనుని జనార్దనవరంలో ఓబిళ్ళనేని వెంకటేశ్వరావు గుమ్మడితోట వద్ద సోమవారం అరెస్ట్‌ చేశామని, అతను నేరం  అంగీకరించాడన్నారు. నిందితుణ్ని రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరు పర్చినట్లు చెప్పారు.  దాడికి ఉపయోగించిన కర్రను, టీవీయస్‌ ఎక్స్‌ఎల్‌ వాహనం, రూ. 2500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీయస్పీ చెప్పారు. నిందితుణ్ణి అరెస్ట్‌ చేయటంలో కీలకంగా వ్యవహరించిన సీఐ అంకబాబు,  ఎస్‌ఐ ప్రతాపరెడ్డి, ఏఎస్‌ఐ శోభన్‌బాబు, హెడ్‌ కానిస్టేబుల్‌ బాలరమేష్‌, కానిస్టేబుళ్ళు విష్ణుకుమార్‌, రజనీలకు డీఎస్పీ నగదు బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-08-16T06:40:18+05:30 IST