Custodial deaths: పోలీసులు పిచ్చివాళ్లవుతున్నారు : మద్రాస్ హైకోర్టు

ABN , First Publish Date - 2022-06-12T15:50:13+05:30 IST

కస్టడీలో వ్యక్తుల మరణాలనుబట్టి పోలీసు సిబ్బంది పిచ్చితనం వెల్లడవుతోందని

Custodial deaths: పోలీసులు పిచ్చివాళ్లవుతున్నారు : మద్రాస్ హైకోర్టు

చెన్నై : కస్టడీలో వ్యక్తుల మరణాలనుబట్టి పోలీసు సిబ్బంది పిచ్చితనం వెల్లడవుతోందని మద్రాస్ హైకోర్టు (Madrass High Court) వ్యాఖ్యానించింది. రాష్ట్ర పోలీసు కంప్లయింట్స్ అథారిటీ చీఫ్ పదవిలో విశ్రాంత న్యాయమూర్తిని నియమించవలసి అవసరం ఉందని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ, జస్టిస్ ఎన్ మాల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. 


రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ (Police Complaints Authority)లకు చీఫ్‌లుగా విశ్రాంత న్యాయమూర్తులను నియమించాలని కోరుతూ అడ్వకేట్ శరవణన్ దక్షిణామూర్తి, మాజీ ఐపీఎస్ అధికారి ఏజీ మౌర్య దాఖలు చేసిన రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ అథారిటీలకు హోం శాఖ కార్యదర్శి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారని పిటిషనర్లు తెలిపారు. ప్రస్తుతం ఏర్పాటైన పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ తమిళనాడు (Tamil Nadu) పోలీస్ సంస్కరణల చట్టంలోని నిబంధనల ప్రకారం ఏర్పాటైందని, ఈ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం అని ప్రకటించాలని కోరారు.  


ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, ‘‘పోలీసులు పిచ్చివాళ్లవుతున్నారని, వ్యక్తులు మరణించే వరకు వారు కొడుతున్నారని కస్టోడియల్ మరణాలు వెల్లడిస్తున్నాయి. ఈ కేసులతో ప్రమేయం ఉన్న పోలీసుల పిచ్చితనాన్ని తెలియజేస్తున్నాయి. పోలీసుల పేరుతో ముఠాలను నడుపుతున్నారు. పోలీసులు భూ కబ్జాలు, అత్యాచారాలు, కస్టోడియల్ మరణాల కేసుల్లో ఉంటున్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసం ఇలాంటి చర్యలను నిరోధించాలి’’ అని తెలిపింది. పోలీసు కంప్లయింట్స్ అథారిటీ చైర్మన్‌గా ఓ రిటైర్డ్ జడ్జిని నియమించడానికి రాష్ట్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించింది. ప్రస్తుతం ఉన్న అథారిటీకి చీఫ్‌గా హోం సెక్రటరీ వ్యవహరిస్తున్నారని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. కోర్టు జోక్యం చేసుకునే వరకు వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. 


అడ్వకేట్ జనరల్ ఆర్ షణ్ముగసుందరం వాదనలు వినిపిస్తూ, పంజాబ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు రిటైర్డ్ జడ్జిని ఈ అథారిటీ చీఫ్‌గా నియమించలేదని తెలిపారు. హోం సెక్రటరీకి సోలీసు శాఖ విషయంలో స్వతంత్రంగా వ్యవహరించగలరని, ఉన్నత స్థాయి పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులను విచారించగలుగుతారని చెప్పారు. ఇదే అంశంపై వేరొక కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉందని, ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరపడం సరికాదని అన్నారు. 


ఓ పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ సతీశ్ పరాశరన్ వాదనలు వినిపిస్తూ, కస్టడీ మరణాలపై వార్తా కథనాల ప్రకారం 2018లో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 


తదుపరి విచారణ జూన్ 24 జరుగుతుందని హైకోర్టు తెలిపింది. పోలీసు సంస్కరణల చట్టం చెల్లుబాటుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.


Updated Date - 2022-06-12T15:50:13+05:30 IST