రెవెన్యూ తర్వాత పోలీస్‌..?

ABN , First Publish Date - 2020-09-24T08:57:37+05:30 IST

ప్రజారక్షణలో పోలీసు శాఖ పాత్ర మహోన్నతమైనది. అంతటి మహోన్నత శాఖ ప్రతిష్ఠ కొందరి అధికారుల తీరుతో

రెవెన్యూ తర్వాత పోలీస్‌..?

పెరుగుతున్న అవినీతి అధికారుల లిస్టు

పోలీస్‌ శాఖపై ఏసీబీ దృష్టి

క్రమశిక్షణా రాహిత్యంతో మరి కొందరు... 

శాఖ పరువు తీస్తున్నారనే అపవాదు... 


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి) : ప్రజారక్షణలో పోలీసు శాఖ పాత్ర మహోన్నతమైనది. అంతటి మహోన్నత శాఖ ప్రతిష్ఠ కొందరి అధికారుల తీరుతో మసకబారుతోంది. ఒకరి తర్వాత ఒకరు పోలీసు అధికారుల క్రమశిక్షణా రాహిత్యం, అవినీతి వెలుగు చూస్తుండటంతో ఆ శాఖలో పని చేస్తున్న నిజాయితీ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. కొంతమంది అవినీతిపరుల తీరు ఉన్నతాధికారులను సైతం ఇబ్బంది కలిగిస్తోంది. ఇటీవల రెవెన్యూ శాఖలో అవినీతి జలగలను ఏరి పారేసే ప్రయత్నం చేసిన అవినీతి నిరోధక శాఖాధికారులు ఇప్పుడు పోలీస్‌ శాఖపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజాగా మల్కాజిగిరి ఏసీపీపై వెలుగు చూసిన అక్రమాస్తుల కేసు దీనికి నిదర్శనం. ఇటీవల పలువురు అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.


షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏఎస్‌ఐ

ఈ ఏడాది జూలై 9న షాబాద్‌ పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శంకరయ్య, ఏఎస్‌ఐ కె.రాజేందర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు  చేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఓ ఫిర్యాదుదారుడి వద్ద రూ. 1.2 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఆయా అధికారుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించగా... రూ. 5 కోట్ల అక్రమాస్తులు వెలుగు చూశాయి. 


బంజారాహిల్స్‌ ఎస్‌ఐ

ఈ ఏడాది జూన్‌ 6న షేక్‌పేట్‌ మండల కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కగా... విచారణలో బంజారాహిల్స్‌ ఎస్‌ఐ ఏ. రవీందర్‌ పాత్ర కూడా ఉందని గుర్తించి అతన్ని అరెస్టు చేశారు.


మహిళ పట్ల అసభ్య ప్రవర్తనతో

సరిగ్గా నెల రోజుల క్రితం ఆగస్టు 18న వనస్థలిపురం ఏసీపీ జయరాం సస్పెన్షన్‌కు గురయ్యారు. ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆయనను సస్పెండ్‌ చేస్తూ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ చర్యలు తీసుకున్నారు. 


అవే ఆరోపణలతో

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రకుమార్‌ను కూడా సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అదే రోజు ఉత్తర్వులు జారీ చేశారు.  


పోలీసు వర్గాల్లో కలవరం

ఏసీబీ చర్యలతో నిజాయితీ పరులైన అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా అవినీతి అధికారులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అవినీతి అధికారుల వల్ల శాఖ ప్రతిష్ఠకు మచ్చ ఏర్పడుతోందని వివిధ సందర్భాల్లో ఉన్నతాధికారులు ప్రస్తావించారు. ప్రస్తుతం మల్కాజిగిరి ఏసీపీపై జరిగిన ఏసీబీ చర్యతో ఇదే విధంగా అక్రమాస్తులు కూడబెట్టిన ఇతర అధికారులు టెన్షన్‌కు గురవుతున్నారు. 

Updated Date - 2020-09-24T08:57:37+05:30 IST