Advertisement
Advertisement
Abn logo
Advertisement

అప్పుడు అర్హులం..ఇప్పుడు అనర్హులమా?

పోలవరం నిర్వాసితుల ఆందోళన
ధవళేశ్వరం, నవంబరు 26: పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీ కల్పించడంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో బాధితులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. గతంలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి అర్హులుగా గుర్తించిన వారిని ఇప్పుడు  అనర్హులంటూ పేర్కొనడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు శుక్రవారం ధవళేశ్వరంలో పోలవరం భూసేకరణ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేవీపట్నం మండలం పూడిపల్లిలో 318 కుటుంబాలను 2005లో లబ్ధికి అర్హులుగా గుర్తించిన అధికారులు 2016 నాటికి వారిలో 171 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. అప్పట్లో బాధితుల ఆందోళనతో మరో 51 మందిని అర్హులుగా గుర్తిస్తూ రెండో జాబితా విడుదల చేశారు. అప్పటి నుంచి సుమారు 100 మంది తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల సూచనలతో ఆరు నెలల క్రితం అన్ని ఆధారాలతో ఈ 100 మంది ఆర్డీవోకు దరఖాస్తులు సమర్పించారు. కొద్దిరోజుల క్రితం వీరిని అనర్హులుగా గుర్తిస్తూ దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలపడంతో వారు శుక్రవారం ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషన్‌ అధికారి ఆనంద్‌ను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఆనంద్‌ వారితో మాట్లాడుతూ అన్ని ఆధారాలతో తనకు అప్పీలు చేసుకుంటే వారి దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పగా ఎన్నిసార్లు ఎంత మంది అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని బాధితులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎటువంటి ఆధారాలతో 222 మందిని అర్హులుగా గుర్తించారో చెప్పాలని పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆందోళనలో జె.భాస్కరరావు, పి.ధర్మరాజు, జి.లింగరాజు, దేవిశెట్టి బాబి, వి.శివకుమార్‌, డి.సుబ్బలక్ష్మి, పి.సత్యవతి పాల్గొన్నారు

Advertisement
Advertisement