పోలవరం కాల్వకు గోదావరి నీళ్లు

ABN , First Publish Date - 2022-08-10T06:40:09+05:30 IST

పోలవరం కాల్వకు గోదావరి నీళ్లు

పోలవరం కాల్వకు గోదావరి నీళ్లు

ఫ తాటిపూడి ఎత్తిపోతల నుంచి విడుదల

ఫ సాగునీటి చెరువులు నింపేందుకే

ఫ గన్నవరం నియోజకవర్గంలో సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు


విజయవాడ రూరల్‌, ఆగస్టు 9 : ఎట్టకేలకు పోలవరం కాల్వకు గోదావరి నీళ్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం పంపులను ఆన్‌ చేయకుండా, తాటిపూడి ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నీళ్లను పోలవరం కుడి ప్రధాన కాల్వకు విడుదల చేసింది. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని సాగునీటి చెరువుల కింద ఉన్న సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాలంటే పోలవరం కాల్వకు గోదావరి నీళ్లను విడుదల చేయాలని ఇటీ వల విజయవాడ రూరల్‌ మండల రైతులు జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబును కలిసి వినతిపత్రం సమర్పించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మంత్రి ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అధికారులు తాటిపూడి ఎత్తిపోతల పథకం మోటార్లను ఆన్‌ చేసి పోలవరం కాల్వలోకి సోమవారం రాత్రి నీటిని విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రోజుకు 175 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు మూడు రోజులలో విజయవాడ రూరల్‌ మండలానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  

మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ యర్కారెడ్డి నాగిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు మంత్రి అంబటి రాంబాబును కలవగా, ఆయన జలవనరులశాఖ విజయవాడ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ (ఎస్‌ఈ) శేషం తిరుమలరావుతో మాట్లాడారు. కృష్ణా, ఎన్‌టీఆర్‌ జిల్లాల్లోని సాగునీటి చెరువుల కింద ఉన్న ఆయకట్టు గురించి మంత్రి వాకబు చేశారు. సుమారు 15 వేల ఎకరాలు చెరువుల కింద ఆయకట్టు ఉందని, ఆ మొత్తానికి ఐదేళ్లగా పోలవరం కాల్వ నుంచి గోదావరి నీళ్లను సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఆ మేరకు   యర్కారెడ్డి నాగిరెడ్డి పోలవరం కాల్వను మంగళవారం పరిశీలించారు. తమ వినతిమేరకు మంత్రి అంబటి రాంబాబు పోలవరం కాల్వకు నీటిని విడుదల చేయించడం వల్ల మండలంలోని నున్న, పాతపాడు, కుందావారి కండ్రిక, పీ నైనవరం, కొత్తూరు తాడేపల్లిలోని సాగునీటి చెరువుల నిండుతాయన్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలోని గన్నవరం, బాపులపాడులోనూ చెరువులకు నీరు సరఫరా అవుతుందని, రైతులు సాగు పనులను ముమ్మరం చేసుకోవాలని ఆయన కోరారు.  

Updated Date - 2022-08-10T06:40:09+05:30 IST