పోడు భూమి.. సమస్య తీరదేమీ?

ABN , First Publish Date - 2021-03-05T05:29:17+05:30 IST

నియోజకవర్గంలో పోడు సాగు చేసుకునే గిరిజనులే అధికం. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా 20వేలకు పైగా ఎకరాల్లో పోడు సాగు భూమి ఉన్న ట్టు అంచనా. గత మూడు ఎన్నికలలోను పోడు సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రతి పార్టీ తరుపున నిలబడిన అభ్యర్థులు హామీలు ఇచ్చారు.

పోడు భూమి.. సమస్య తీరదేమీ?
పండువారిగూడెంలో గిరిజనులు, అటవీశాఖల మద్య ఘర్షణ(ఫైల్‌)

తరుచూ అటవీశాఖ, గిరిజనుల మధ్య ఘర్షణలు

ఎన్నికల హామీగానే మిగిలిన భూ పట్టాల పంపిణీ

అశ్వారావుపేట, మార్చి 4: నియోజకవర్గంలో పోడు సాగు చేసుకునే గిరిజనులే అధికం. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా 20వేలకు పైగా ఎకరాల్లో పోడు సాగు భూమి ఉన్న ట్టు అంచనా. గత మూడు ఎన్నికలలోను పోడు సమస్యను పరిష్కరిస్తామంటూ ప్రతి పార్టీ తరుపున నిలబడిన అభ్యర్థులు హామీలు ఇచ్చారు. తర్వాత దానిని విస్మరిస్తు న్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో హరితహారం మొక్కలు నాటే పేరుతో అటవీశాఖాధికారులు పోడు భూముల్లోకి ప్రవేశించి కందకాలు తీయడం ప్రారంభించారు. అటవీశాఖకు పై అధికారుల ఆదేశాల మేరకు వారి పని వారు చేసుకొని పోతున్నారు. నియోజకవర్గంలోని అశ్వారావుపేట, ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో ఈ పోడు సమస్య ఎక్కువగా ఉంది. అనేక చోట్ల గిరిజనులు, అటవీశాఖల మధ్య మొక్కలు నాటే సమయంలో ఘర్షణలు, కొట్లాటలు జరిగాయి.

సమస్య పరిష్కారం ఎప్పుడు?

పోడు భూముల సమస్యలపై గిరిజనులకు అండగా ఉంటామని జిల్లాలోని పలువురు గిరిజన ఎమ్మెల్యేలు ప్రకటించారు. కొందరు పోడు సమస్య పరిష్కారం కాకపోతే రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. మరి కొందరు పోడు భూముల సమస్య పరిష్కారంకోసమే అధికార పార్టీలోకి వెళ్లామని ప్రకటనలు చేశారు. ఇటీవల కాలంలో పలువురు పోడు సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందంటూ అధికార పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు పోడు సాగుదారుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. అధికారపార్టీ ఎమ్మెల్యేకు ప్రభుత్వం నుంచి పరోక్షంగా వచ్చిన అనుకూల సందేశాలతోనే ధరఖాస్తులు తీసుకుంటున్నారని, త్వరలోనే దీనికో పరిష్కారం దొరకుతుందని గిరిజనుల్లో ఆశలు రేకెత్తాయి. కానీ నెలలు గడిచినా దీనిపై సరైన స్పందన లేదు. ఇటీవల అశ్వారావుపేట మండలంలో కూడా పలుచోట్ల పోడు విషయమై అటవీశాఖ, గిరిజనుల మద్య వాగ్వాదాలు జరిగాయి. మండలంలోని ఊట్లపల్లి, పండువారిగూడెం వద్ద కొన్ని రోజులుగా అటవీశాఖ మొక్కలు నాటడం, కందకం పనులను గిరిజనులు అడ్డుకున్నారు. ఈ వివాదాలు జరిగిన ప్రదేశాలకు మాజీ ఎమ్మె ల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వెళ్లి గిరిజనులకు అండగా ఉం టామని ప్రకటించారు. పోడుకు హక్కు పత్రాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఒకడుగు ముందుకు వేసి పండువారిగూడెంలో గిరిజనుడిపై దాడి చేసిన అటవీశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈ పరిస్థితులను చూస్తున్న గిరిజనులు పోడు సమస్యపై ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా లేకపోయినప్పటికి తమకు అనుకూలంగా వారికున్న శక్తి యుక్తులను ఉపయోగించడం లే దనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అటవీశాఖ మొక్కలు నాటడంలో వే గం పెంచడంతో పలు గ్రామాలలో గిరిజనులు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగింది. 


Updated Date - 2021-03-05T05:29:17+05:30 IST