Dmkకు ప్రత్యామ్నాయం బీజేపీ కాదు

ABN , First Publish Date - 2022-06-04T14:45:37+05:30 IST

రాష్ట్రంలో డీఎంకేకు ప్రత్యామ్నాయం బీజేపీ కాదని, పీఎంకే మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ స్పష్టం చేశారు. సేలంలో శుక్రవారం

Dmkకు ప్రత్యామ్నాయం బీజేపీ కాదు

                                 - అన్బుమణి రాందాస్‌ 


చెన్నై, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డీఎంకేకు ప్రత్యామ్నాయం బీజేపీ కాదని, పీఎంకే మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ స్పష్టం చేశారు. సేలంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎంకే ప్రత్యామ్నాయం బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చెప్పడం వింతగా ఉందని, రాష్ట్రంలో జాతీయ పార్టీలకు తావులేదనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలపై బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని, ఉదాహరణకు కావేరి నదిపై మెకెదాటు వద్ద కొత్త ఆనకట్ట నిర్మించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఆ పార్టీ స్పందించడం లేదని, పైగా కర్ణాటక ప్రభుత్వానికి మద్దతిచ్చేలా వ్యవహరిస్తోందన్నారు. బీజేపీ నేత అన్నామలైకి దమ్ముంటే కర్ణాటక వెళ్ళి మెకెదాటు ఆనకట్ట నిర్మాణ పనులను అడ్డుకోగలరా? అని అన్బుమణి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలంతా బీజేపీని మతతత్వ పార్టీగానే భావిస్తున్నారని, ఆ పార్టీ వల్ల తమకు ముప్పువాటిల్లుతుందని భయపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి గవర్నర్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు లేకపోవడం విచారకరమని, ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడాలని ఆయన హితవు పలికారు. ఇక రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని డీఎంకే ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, త్వరలో ఈ విషయమై పార్టీ తరఫున ఆందోళన చేపడతామని అన్బుమణి హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతున్న పీఎంకే మాత్రమే డీఎంకేకు ప్రత్యామ్నాయ పార్టీ అని మరోమారు ఆయన నొక్కి వక్కాణించారు. 

Updated Date - 2022-06-04T14:45:37+05:30 IST