Pmk అధ్యక్షుడిగా అన్బుమణి!

ABN , First Publish Date - 2021-11-28T14:31:06+05:30 IST

పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) అధ్యక్షుడిగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ తనయుడు, ఎంపీ అన్బుమణి ఆరంగేట్రానికి రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్‌లో జరుగనున్న ఆ పార్టీ సర్వసభ్యమండలి సమావేశంలో

Pmk అధ్యక్షుడిగా అన్బుమణి!

- డిసెంబర్‌లో సర్వసభ్య మండలి 

- యువకులకు మరిన్ని పదవులు


చెన్నై: పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) అధ్యక్షుడిగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ తనయుడు, ఎంపీ అన్బుమణి ఆరంగేట్రానికి రంగం సిద్ధమైంది. వచ్చే డిసెంబర్‌లో జరుగనున్న ఆ పార్టీ సర్వసభ్యమండలి సమావేశంలో అన్బుమణిని అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. గత శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన పీఎంకే ఐదు నియోజకవర్గాలలో గెలిచింది. ఆ పార్టీ అధ్యక్షుడు జీకే మణి శాసనసభ్యుడిగా గెలిచి పార్టీ శాసనసభాపక్షనేతగా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో 2026 శాసనసభ ఎన్నికల్లో అన్బుమణిని మరోమారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి పోటీ చేయించాలని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ భావిస్తున్నట్టు తెలిసింది. ఆ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్న డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. అన్బుమణికి పార్టీ అధ్యక్షపదవిని కట్టబెట్టి, ఆయనకు చేదోడువాదోడుగా ఉండేలా పార్టీలో చాలాకాలం సేవలందిస్తున్న యువకులకు పార్టీ పదవులను ఇవ్వాలని రాందాస్‌ నిర్ణయించారు. ఇటీవల పార్టీలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. జిల్లా కార్యదర్శులకు మరిన్ని అధికారాలు అప్పగించారు. తాజాగా కొత్త జిల్లా కార్యదర్శులను ఎంపిక చేశారు. ఈ పదవులలో అన్బుమణికి సన్నిహితులైనవారే అధికంగా ఉండడం గమనార్హం. కొత్త జిల్లా కార్యదర్శుల నియామకం సందర్భంగా నిర్వహించిన పార్టీ సమావేశంలో రాందాస్‌ మాట్లాడుతూ అన్బుమణిని ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు పార్టీ నేతలంతా కలిసికట్టుగా ఇప్పటి నుండే పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగానే పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్‌ అన్బుమణిని నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీఎంకే శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్న జీకే మణి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత జీకే మణికి మరో కీలక పదవి ఇవ్వనున్నట్టు తెలిసింది.

Updated Date - 2021-11-28T14:31:06+05:30 IST