Pmkకి నూతన సారథి

ABN , First Publish Date - 2022-05-29T13:53:53+05:30 IST

పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) బాధ్యతలు కొత్త సారథి చేపట్టారు. ఇన్నాళ్లూ ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్‌ అన్బుమణి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా

Pmkకి నూతన సారథి

                   - అధ్యక్షుడిగా అన్బుమణి ఏకగ్రీవ ఎన్నిక


చెన్నై: పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) బాధ్యతలు కొత్త సారథి చేపట్టారు. ఇన్నాళ్లూ ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించిన డాక్టర్‌ అన్బుమణి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక తిరువేర్కాడు సమీపంలోని జీపీఎన్‌ ప్యాలెస్‌ మహల్‌లో శనివారం నిర్వహించిన ఆ పార్టీ ప్రత్యేక సర్వసభ్య మండలి సమావేశంలో అన్బుమణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి పార్టీ శాసనసభాపక్ష నేత జీకే మణి అధ్యక్షత వహించారు. పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా అన్బుమణిని ఎంపిక చేయాలని కోరుతూ జీకే మణి ప్రత్యేక తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానికి సర్వసభ్య మండలి సభ్యులు, కార్యాచరణ మండలి సభ్యులంతా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత పార్టీ నూతన అధ్యక్షుడిగా అన్బుమణి రాందాస్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జీకే మణి ప్రకటించగానే సభ్యులంతా హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ మాట్లాడుతూ... పార్టీ శ్రేణులు, సీనియర్‌ నేతల కోరిక మేరకే అన్బుమణిని అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే పార్టీ జిల్లా నేతలు కేఎన్‌ శేఖర్‌, అనంతకృష్ణన్‌, ఇతర నిర్వాహకులు అన్బుమణిని గజమాలతో సత్కరించారు. వివిధ జిల్లాల నేతలకు కూడా వేదికపైకి వెళ్ళి అన్బుమణిని శాలువలతో సత్కరించారు. మాజీ అధ్యక్షుడు జీకే మణి పార్టీ నిర్వాహకుల తరఫున వెండి రాజదండాన్ని ఆయనకు కానుకగా సమర్పించారు. 25 యేళ్ళపాటు పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన జీకే మణిని అభినందిస్తూ మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వడివేల్‌ రావణన్‌, కోశాధికారి తిలకబామా, వన్నియార్ల సంఘం అధ్యక్షులు అరుళ్‌మొళి, ధీరన్‌, ఎన్నికల ఇన్‌ఛార్జి ఏకే మూర్తి, శివప్రకాశం తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన సర్వసభ్య మండలి సభ్యులతోపాటు పుదుచ్చేరికి చెందిన సర్వసభ్య సభ్యులు కూడా హాజరయ్యారు. ఇక పార్టీ సర్వసభ్యమండలి సమావేశం జరిగిన తిరువేర్కాడు తదితర ప్రాంతాల్లోని రహదారుల్లో అన్బుమణిని అభినందిస్తూ ‘2026లో అన్బుమణి నాయకత్వంలో అధికారం మనదే’ అంటూ నినాదాలు రాసిన పోస్టర్లు అధికంగా కనిపించాయి. కొన్ని చోట్ల ‘పీఎంకే 2.0’ అనే నినాదాలతో స్వాగత తోరణాలు కూడా ఏర్పాటు చేశారు.


డాక్టర్‌గా రాజకీయాల్లోకి...

పీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికైన అన్బుమణి రాందాస్‌ వృత్తిరీత్యా వైద్యుడిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్నప్పుడే తండ్రి డాక్టర్‌ రాందాస్‌ పిలుపునందుకుని 1996లో రాజకీయ ప్రవేశం చేశారు. మద్రాసు మెడికల్‌ కాలేజీలో డిగ్రీ పొందారు. ఆ తర్వాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఇంట్రోక్టరీ మేక్రో ఎకనామిక్స్‌ అభ్యసించారు. దిండివనం సమీపం నల్లామ్‌ వద్ద క్లినిక్‌ను ప్రారంభించి గ్రామీణ నిరుపేదలకు వైద్య సేవలందించారు. 1999లో పార్టీకి అనుబంధంగా ఉన్న పసుమై తాయగంకు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2004లో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి ఇప్పటి వరకూ మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షపదవిని చేపట్టేంతవరకూ ఆయన యువజన విభాగం అధ్యక్షుడిగా సేవలందించారు.


రిజర్వేషన్లపై ప్రత్యేక అసెంబ్లీ...

ఈ సమావేశంలో వన్నియార్లకు ఓబీసీల కేటగిరీలో అంతర్గత రిజర్వేషన్లు కల్పించే విషయమైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి ముసాయిదా చట్టాన్ని రూపొందించాలని డీఎంకే ప్రభుత్వాన్ని కోరుతూ ఓ తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ మాట్లాడుతూ మునుపటి అన్నాడీఎంకే ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే ప్రభుత్వం ఆ బిల్లుకు గట్టి మద్దతు ప్రకటించిందని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు రిజర్వేషన్ల బిల్లును రద్దు చేసినందున మళ్ళీ వన్నియార్లకు రిజర్వేషన్‌ కల్పించేలా మరిన్ని సవరణలతో శాసనసభలో ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఇదిలా ఉండగా పీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్‌ అన్బుమణికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2022-05-29T13:53:53+05:30 IST