India and Bangladesh : భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు నూతన శిఖరాలకు : మోదీ

ABN , First Publish Date - 2022-09-06T21:05:39+05:30 IST

రానున్న కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు నూతన శిఖరాలకు

India and Bangladesh : భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు నూతన శిఖరాలకు : మోదీ

న్యూఢిల్లీ : రానున్న కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ ప్రాంతంలో భారత దేశానికి అభివృద్ధి, వ్యాపార రంగాల్లో  బంగ్లాదేశ్ అతి పెద్ద  భాగస్వామి అని తెలిపారు. ఇరు దేశాల ప్రజల మధ్య సహకారం నిరంతరం పెరుగుతోందన్నారు. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడారు. 


షేక్ హసీనా (Sheikh Hasina) భారత్ పర్యటన మంగళవారం ప్రారంభమైంది. ఇరు దేశాల ప్రధాన మంత్రులు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉభయ దేశాల మధ్య సంబంధాలను సమీక్షించి, వీటిని మరింత బలోపేతం చేయడం గురించి మాట్లాడారు. అనంతరం ఇరువురు సంయుక్త ప్రకటన చేశారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మాట్లాడుతూ, బంగ్లాదేశ్ ఎగుమతులకు ఆసియాలో అతి పెద్ద మార్కెట్ భారత దేశమని చెప్పారు. ఈ ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు తాము త్వరలోనే ద్వైపాక్షిక ఆర్థిక సమగ్ర ఒప్పందంపై చర్చలను ప్రారంభిస్తామని తెలిపారు. రానున్న కాలంలో ఇరు దేశాల సంబంధాలు నూతన శిఖరాలకు చేరుకుంటాయని చెప్పారు. ఈ ప్రాంతంలో నేడు భారత దేశానికి అభివృద్ధి, వ్యాపార రంగాల్లో అతి పెద్ద  భాగస్వామి బంగ్లాదేశ్ అని తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), అంతరిక్షం, అణు ఇంధన రంగాల్లో కూడా సహకరించుకోవాలని నిర్ణయించామని చెప్పారు. విద్యుత్తు ట్రాన్స్‌మిషన్ లైన్స్‌ను వేయడంపై చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. 


భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 54 నదులు ప్రవహిస్తున్నాయని, ఇరు దేశాల ప్రజల జీవనోపాధికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కుషియారా నది జల పంపిణీ ఒప్పందంపై తాము ఈ రోజు (మంగళవారం) సంతకాలు చేశామని చెప్పారు. వరదల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు తాము సహకరిస్తున్నామని తెలిపారు. వరదలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్‌కు అందిస్తున్నామన్నారు. ఉగ్రవాద సమస్యపై కూడా ఇరువురం చర్చించామని తెలిపారు. ఉగ్రవాదం వల్ల ఇరు దేశాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. 


బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా (Sheikh Hasina) మాట్లాడుతూ, స్వాతంత్ర్య వజ్రోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు భారత ప్రభుత్వాన్ని అభినందించారు. తమ చర్చల ఫలితాలు ఇరు దేశాల ప్రజలకు లబ్ధి చేకూర్చుతాయని చెప్పారు. తాము సుహృద్భావ వాతావరణంలో స్నేహ భావంతో చర్చలు జరిపామని వివరించారు. 


Updated Date - 2022-09-06T21:05:39+05:30 IST