‘ఆయుష్మాన్ భారత్’ మిషన్ ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-25T20:19:01+05:30 IST

ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను

‘ఆయుష్మాన్ భారత్’ మిషన్ ప్రారంభం

వారణాసి : ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ పథకం భారత దేశ ఆరోగ్య రంగంలో ఆత్మవిశ్వాసాన్ని, స్వయంసమృద్ధిని నింపుతుందన్నారు. దేశ ఆరోగ్య సదుపాయాలకు నూతన జవసత్వాలు వస్తాయన్నారు. ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అతి పెద్ద, అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటి ఆరోగ్య రంగంలో పెట్టుబడులని మనం ఎప్పుడూ విశ్వసిస్తామని చెప్పారు. 


కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ మైలురాయిని దాటినందుకు భారత దేశాన్ని మోదీ అభినందించారు.  కాశీ విశ్వనాథుడు, గంగమ్మ తల్లి, కాశీ ప్రజల ఆశీర్వాదాల వల్ల ‘అందరికీ టీకా, ఉచిత టీకా’ కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు. దీపావళి, ఛాత్ తదితర పండుగలను దేశమంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలిపారు.


అంతకుముందు మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థ నగర్ నుంచి తొమ్మిది వైద్య కళాశాలలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. పీఎం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను వారణాసి నుంచి ప్రారంభించినందుకు మోదీకి యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు. మోదీ వారణాసి నుంచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.



Updated Date - 2021-10-25T20:19:01+05:30 IST