వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలి : మోదీ

ABN , First Publish Date - 2021-12-16T21:46:30+05:30 IST

మెరుగైన వ్యవసాయోత్పత్తులను సాధించేందుకు, నేల తల్లి

వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలి : మోదీ

న్యూఢిల్లీ : మెరుగైన వ్యవసాయోత్పత్తులను సాధించేందుకు, నేల తల్లి జీవిత కాలాన్ని పెంచేందుకు ప్రకృతి సహజ సాగు విధానాలను అవలంబించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కి వక్కాణించారు. ఎరువులు హరిత విప్లవానికి దారి తీశాయనడంలో సందేహం లేదని, అయితే ప్రత్యామ్నాయాల కోసం కృషిని కొనసాగించాలన్నది కూడా యథార్థమని చెప్పారు. దీనికి ప్రధాన కారణం ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి రావడమేనని తెలిపారు. జాతీయ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ సదస్సులో ఆయన గురువారం మాట్లాడారు. 


తన నేతృత్వంలోని ప్రభుత్వం ఏడేళ్ళ నుంచి అమలు చేస్తున్న వివిధ పథకాలను మోదీ వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం చేపడుతున్న చర్యలను తెలిపారు. వీటన్నిటి వల్ల వ్యవసాయ రంగంలో మార్పులు వస్తాయన్నారు. విదేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవలసి వస్తోందని, దీనివల్ల సాగు ఖర్చులు పెరుగుతున్నాయని, అందువల్ల ప్రకృతి సహజ సాగు విధానాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సాగును రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలని, ప్రకృతికిగల సొంత ప్రయోగశాలకు అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. ఎరువులకు ఎలాంటి శక్తి ఉందో, దానిని ప్రకృతి నుంచి కూడా పొందవచ్చునని చెప్పారు. మనం దానిని తెలుసుకోవాలని చెప్పారు. 


గత కొన్ని సంవత్సరాల్లో రైతులు ప్రకృతి సహజ సాగు విధానాలను అవలంబించడం వల్ల వ్యవసాయోత్పత్తులు ఏ విధంగా పెరిగాయో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ చెప్పారని మోదీ తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి ఆధారం సైన్సేనని చెప్పారు. ప్రపంచం సాంకేతికంగా ప్రగతి సాధించినప్పటికీ, ఇది తన మూలాలకు కూడా అనుసంధానమైందన్నారు. దీనిని సాగు రంగంలో కూడా అమలు చేయాలని పిలుపునిచ్చారు. 


విత్తనం నుంచి నేల వరకు ప్రతిదాన్నీ సహజమైన రీతిలో చూడవచ్చునని తెలిపారు. ప్రకృతి సహజమైన సాగు విధానంలో ఎరువులు, పురుగు మందుల కోసం ఖర్చు చేయవలసిన అవసరం ఉండదని చెప్పారు. ఈ విధానంలో సాగునీటి అవసరం కూడా తగ్గుతుందన్నారు. వరదలు, కరువుకాటకాలు వంటి విపత్తులను కూడా ఎదుర్కొనే సత్తా లభిస్తుందని చెప్పారు. భారతీయ రైతులు స్వయం సమృద్ధమయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుందని వివరించారు. 


అంతకుముందు గవర్నర్ ఆచార్య దేవవ్రత్ మాట్లాడుతూ, వానపాములు, పశువుల పేడ, బెల్లం వంటి సహజ వనరులు ఏ విధంగా భూసారాన్ని పెంచగలవో వివరించారు. భూమిలో పోషక విలువలు పెరగడం వల్ల వ్యవసాయోత్పత్తులు పెరుగుతాయని తెలిపారు. 


Updated Date - 2021-12-16T21:46:30+05:30 IST