ఆ 8 రాష్ట్రాలు పెట్రోలుపై వ్యాట్ తగ్గించాలి : మోదీ

ABN , First Publish Date - 2022-04-27T21:22:15+05:30 IST

పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని

ఆ 8 రాష్ట్రాలు పెట్రోలుపై వ్యాట్ తగ్గించాలి : మోదీ

న్యూఢిల్లీ : పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని, ఆ ప్రయోజనాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు బదిలీ చేయడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను కొన్ని రాష్ట్రాలు తగ్గించలేదని, దీనివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.


దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి గురించి ముఖ్యమంత్రులతో బుధవారం జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ళకు సంబంధించిన వేరొక అంశం గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ, యుద్ధం జరుగుతోందని, ఈ పరిస్థితి సరఫరాల వ్యవస్థపై ప్రభావం చూపుతోందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో సవాళ్ళు రోజు రోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. ఈ అంతర్జాతీయ సంక్షోభం అనేక సవాళ్ళను తీసుకొస్తోందన్నారు. ఇటువంటి పరిస్థితిలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్యతత్వం, సమన్వయ స్ఫూర్తి మరింత పెరగడం అత్యవసరమని చెప్పారు. 


గత ఏడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించిందని, ప్రజలపై భారం తగ్గాలనే లక్ష్యంతో ఈ చర్య తీసుకుందని చెప్పారు. పన్నులను తగ్గించడం ద్వారా ఈ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేయాలని రాష్ట్రాలను కోరిందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాలు తమ పన్నులను తగ్గించుకున్నాయని, కానీ కొన్ని రాష్ట్రాలు ఈ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయలేదని చెప్పారు. దీనివల్ల ఈ రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు అత్యధికంగా కొనసాగుతున్నాయన్నారు. ఓ విధంగా చెప్పాలంటే, ఇది ఆయా రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగడం మాత్రమే కాకుండా, దీని ప్రభావం వాటి పొరుగు రాష్ట్రాలపై కూడా పడిందన్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, జార్ఖండ్, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఏదో కారణం చేత కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటను వినలేదని,  ఫలితంగా ఆ రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులకు గురికావడం కొనసాగుతోందని తెలిపారు. ‘‘నవంబరులో మీరు చేసి ఉండవలసినదానిని, వ్యాట్‌ను తగ్గించడం ద్వారా ప్రజలకు ప్రయోజనాన్ని అందజేయాలని కోరుతున్నాను’’ అన్నారు. 


గత ఏడాది నవంబరులో కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోలుపై ఎక్సయిజ్ సుంకాన్ని రూ.5, లీటరు డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకాన్ని రూ.10 చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-04-27T21:22:15+05:30 IST