నీరు పుష్కలం.. సాగు ప్రశ్నార్థకం!

ABN , First Publish Date - 2021-10-23T06:16:21+05:30 IST

చెరువు నిండా నీరు ఉన్నా కల్వర్టులు మరమ్మతుల కారణంగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది.

నీరు పుష్కలం.. సాగు ప్రశ్నార్థకం!
సమస్య తెలుపుతున్న చెరువు ఆయకట్టు రైతులు

తైపురంలో 200 ఎకరాలకు అందని సాగునీరు

పూడుకుపోయిన పప్పలబండ చెరువు కల్వర్టులు 

ఆందోళనలో ఆయకట్టు రైతులు


బుచ్చెయ్యపేట, అక్టోబరు 22: చెరువు నిండా నీరు ఉన్నా కల్వర్టులు మరమ్మతుల కారణంగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది. దాదాపు 200 ఎకరాలకు నీరు అందే పరిస్థితి లేకపోతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సి వస్తోంది.

మండలంలోని తైపురం గ్రామంలో నీరు-చెట్టు పథకం కింద పప్పలబంద చెరువును అభివృద్ధి చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు కూడా నిండిపోయింది. నిండుకుండలా జల కళ సంతరించుకుంది. అయితే చెరువుకు ఉన్న మూడు కల్వర్టులు పూడుకుపోవడంతో నీరు ప్రవహించే మార్గం లేకపోతోంది. ఫలితంగా ఆయకట్టు పరిధిలోని సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీంతో పొట్ట దశలో ఉన్న వరి పంట దెబ్బతింటుందని రైతులు లబోదిబోమంటున్నారు. వారం రోజుల్లో కల్వర్టులు మరమ్మతులు చేపట్టి పంటకు నీరు అందించకపోతే తమకు తిండి గింజలు దక్కకుండా పోతాయని రైతులు ఆందోళన  చెందుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పందించి యుద్ధప్రాతిపదికపై కల్వర్టుల మరమ్మతు పనులు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని సర్పంచ్‌ ముచ్ఛకర్ల శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ వియ్యపు తాతబాబు, మాజీ సర్పంచ్‌ డేగల అప్పారావు,  రైతులు వై.అప్పారావు, బోదుపు రాజు, సీతా రమేశ్వరావు, కరణం నాగరత్నం, వియ్యపు బాబులు, ఉల్లింగల నూకరాజు తదితరులు వేడుకుంటున్నారు.


Updated Date - 2021-10-23T06:16:21+05:30 IST