ప్లీనరీలు పేలవం

ABN , First Publish Date - 2022-06-27T05:21:45+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం గత మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు నిర్వహిస్తోంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో రాష్ట్రస్ధాయి ప్లీనరీలు నిర్వహించాలని అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది. తదనుగుణంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీల ఏర్పాటుకు కార్యక్రమం ప్రకటించింది. అందులో భాగంగా జిల్లాలో నియోజకవర్గ స్ధాయి ప్లీనరీ సమావేశాలన్నీ 29 వతేదీకి పూర్తి చేయాలని, ఆ తర్వాత జిల్లా ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని సూచించింది.

ప్లీనరీలు పేలవం
దర్శి ప్లీనరీలో మాట్లాడుతున్న ఎంపీ మాగుంట, వేదికపై నేతలు

జిందాబాద్‌లు కొట్టే వారికే ఆహ్వానాలు

ప్రశ్నించే వారికి నోఛాన్స్‌ 

ఊకదంపుడు ఉపన్యాసాలు

పొగడ్తలకే ప్రాధాన్యం 

కార్యకర్తలకు మాట్లాడే అవకాశం నిల్‌

దర్శిలో జడ్పీచైర్‌పర్సన్‌కు అందని ఆహ్వానం 

కందుకూరులో ఎమ్మెల్యే పిలిచినా వెళ్లని ఎమ్మెల్సీ

ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ ప్లీనరీల తీరుతెన్ను 

ఆంధ్రజ్యోతి, ఒంగోలు 

పాలనా వ్యవహారాలు, పార్టీ పరిస్థితులపై కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేందుకు వైసీపీ ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఆపార్టీ నిర్వహిస్తున్న నియోజకవర్గస్థాయి ప్లీనరీల తీరును పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇవి పేలవంగా జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు దూరంగా ఉంటుండగా, ఎక్కువచోట్ల వారికి ఆహ్వానాలు కూడా అందడం లేదు. సమావేశానికి వచ్చిన కిందిస్థాయి నేతలు, ముఖ్య కార్యకర్తలకు నొరిప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు. దీంతో అయిన వారికి ఆహ్వానాలు, ఊకదంపుడు ఉపన్యాసాలకే ప్లీనరీలు పరిమితమయ్యాయని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి. దర్శిలో జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మకే ఆహ్వానం అందకపోగా, కందుకూరులో ఎమ్మెల్యే పిలిచినా ఎమ్మెల్సీ ప్లీనరీకి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.   


వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం గత మూడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు నిర్వహిస్తోంది. వచ్చే నెల 8, 9 తేదీల్లో రాష్ట్రస్ధాయి ప్లీనరీలు నిర్వహించాలని అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది. తదనుగుణంగా గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీల ఏర్పాటుకు కార్యక్రమం ప్రకటించింది. అందులో భాగంగా జిల్లాలో నియోజకవర్గ స్ధాయి ప్లీనరీ సమావేశాలన్నీ 29 వతేదీకి పూర్తి చేయాలని, ఆ తర్వాత జిల్లా ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఆ ప్రకారం ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎనిమిది నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశాలు పూర్తయ్యాయి. 29న ప్రకాశం, 30న నెల్లూరు, 1న బాపట్ల జిల్లా స్థాయి ప్లీనరీలు  నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన నియోజకవర్గాల ప్లీనరీలను పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి. 

భజనపరులకే ఆహ్వానం

వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ప్లీనరీ సమావేశాలకు నియోజకవర్గంలో తన వెంట నడుస్తూ జిందాబాద్‌ కొట్టేవారికే ఆహ్వానాలు పంపుతున్నారు. పార్టీ, ప్రజల పరంగా జరిగే ఇబ్బందులను ఎత్తిచూపే వారిని దూరంగా ఉంచుతున్నారు. పైగా ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతిగా ఉన్న, లేక వారికి పోటీగా ఉన్న నాయకులను సమావేశాలకు పిలవడం లేదు. కొన్నిచోట్ల వారు ఆహ్వానించినా అసమ్మతి నేతలు దూరంగా ఉంటున్నారు. దర్శి ప్లీనరీకి ఆ నియోజకవర్గంలో కీలకమైన జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, ఆమె కుమారుడు శివప్రసాద్‌రెడ్డికి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే నుంచి ఆహ్వానం రాలేదని తెలిసింది. వెంకాయమ్మ దర్శి జడ్పీటీసీ కూడా కావడం గమనార్హం. వారిద్దరితోపాటు నియోజకవర్గంలోని బూచేపల్లి కుటుంబ ముఖ్య అనుచరులు, ముఖ్య నాయకులంతా ప్లీనరీకి గైర్హజరయ్యారు. 


మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ముఖ్యనేతలు దూరం

కనిగిరి ప్లీనరీకి ఆ నియోజకవర్గానికి చెందిన రెడ్డి కార్పొరేషన్‌ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే బాబూరావుకు కూడా ఆహ్వానం అందలేదని తెలిసింది. ఇటీవల ఎమ్మెల్యే పోకడపై తిరుగుబాటు చేసిన హెచ్‌ఎం పాడు జడ్పీటీసీ నారాయణయాదవ్‌ కూడా సమావేశంలో కనిపించ లేదు. కందుకూరు ప్లీనరీకి ఎమ్మెల్యే మహీధర్‌ర్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించినా అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ తూమాటి మాధవ్‌ గైర్హాజరయ్యారు.  ఆదివారం జరిగిన కొండపి నియోజకవర్గ ప్లీనరీలో నిన్నమొన్నటి వరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న పీడీసీసీబీ చైర్మన్‌ డాక్టర్‌ వెంకయ్య, అతని అనుచరులు కొందరు  కనిపించలేదు. వారంతా కావాలనే గైర్హాజరైనట్లు చెప్తున్నారు. చీరాల ప్లీనరీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తోపాటు ఆయన అనుచరులు గైర్హాజరయ్యారు. ఆమంచి అనుచరుల్లో కొందరికి ఆహ్వానాలు అందినా ఆవైపు కన్నెత్తి చూడలేదు. పర్చూరు నియోజకవర్గ ప్లీనరీకి ఇన్‌చార్జి రామనాథంబాబు పట్ల అసమ్మతితో ఉన్న అత్యధిక మంది నాయకులు, కిందిస్థాయి ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. ఆదివారం జరిగిన ఎర్రగొండపాలెం, అద్దంకి నియోజకవర్గాల ప్లీనరీ సభలు మాత్రం నిండుగా కనిపించాయి. అయితే బాపట్ల జిల్లా నుంచి మంత్రిగా ఉన్న నాగార్జున, మరో మంత్రి ప్రాతినిథ్యం వహించే ఎర్రగొండపాలెం ప్లీనరీకి వెళ్లి సొంత జిల్లాలోని అద్దంకి ప్లీనరీకి గైర్హాజరవడంపై విమర్శలు వచ్చాయి. 


ఊకదంపుడు ఉపన్యాసాలే 

ప్లీనరీ సమావేశాలన్నింట్లో నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప కిందిస్థాయి, ద్వితీయ స్థాయి నాయకులు, ముఖ్యకార్యకర్తలు మాట్లాడేందుకు అవకాశాలు ఇవ్వలేదు. నిజానికి ఏరాజకీయ పార్టీ అయినా పార్టీ ప్లీనరీల్లో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందకు ప్రాధాన్యం ఇస్తాయి. ఇక్కడ అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పర్చూరు ప్లీనరీలో ఒక మహిళా కార్యకర్త పాలనా, పార్టీ పరమైనలోపాలను ప్రస్తావించగా సభలో ఉన్న రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ కలుగజేసుకొని ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కనిగిరి ప్లీనరీలో ఒక ద్వితీయ శ్రేణి నాయకుడి ప్రసంగాన్ని ఎమ్మెల్యే మదుసూధన్‌యాదవ్‌అడ్డుకున్నారు. కొన్నిచోట్ల ఏరికోరి ఎమ్మెల్యేలు, లేక ఇన్‌చార్జిలను పొగడ్తలతో ముంచెత్తే వారికే మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో అయిన వారికి ఆహ్వానాలు పంపి కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేయని ఈ ప్లీనరీ వలన ఉపయోగం ఏమిటనే ప్రశ్న ఆ పార్టీ శ్రేణుల నుంచి ఉత్పన్నమతోంది. 



Updated Date - 2022-06-27T05:21:45+05:30 IST