గెహ్లాట్‌పై విశ్వాసం వ్యక్తం చేసిన మరో అసమ్మతి ఎమ్మెల్యే!

ABN , First Publish Date - 2021-06-16T02:33:56+05:30 IST

రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్‌ వర్గీయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ తాజాగా సీఎం అశోక్‌ గెహ్లాట్‌...

గెహ్లాట్‌పై విశ్వాసం వ్యక్తం చేసిన మరో అసమ్మతి ఎమ్మెల్యే!

జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్ అసమ్మతి నేత సచిన్ పైలట్‌ వర్గీయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ తాజాగా సీఎం అశోక్‌ గెహ్లాట్‌ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా తమ నియోజక వర్గంలో సీఎం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటూ ప్రశంసించారు. సచిన్ పైలట్ బీజేపీలో చేరే ప్రసక్తే లేదనీ.. కాంగ్రెస్‌లో నెలకొన్న అసమ్మతిని చాలా ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఆయన పేర్కొన్నారు. సచిన్ పైలట్‌ను మీ నాయకుడిగా భావిస్తారా అని మీడియా ప్రశ్నించడంతో ఆయన స్పందిస్తూ... ‘‘అవును.. నాయకుడిగానే భావిస్తాను. అయితే అశోక్ గెహ్లాట్ ఆయనకంటే ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయననే నాయకుడిగా భావించాలి. నేనే కాదు.. సచిన్ కూడా ఆయనను సీఎంను నాయకుడిగానే భావించాలి..’’ అని పేర్కొన్నారు. 


గతేడాది సీఎం గెహ్లాట్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన సందర్భంగా తాము చేసిన డిమాండ్లు ఇప్పటికీ నెరవేరక పోవడంతో.. సచిన్ పైలట్ వర్గంలో లుకలుకలు మొదలైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భన్వర్‌లాల్ శర్మ సీఎం గెహ్లాట్‌కు అనుకూలంగా స్వరం వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా శర్మతో కలిపి ఇటీవల గెహ్లాట్‌కు మద్దతుగా మాట్లాడిన సచిన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. విరాట్ నగర్ ఎమ్మెల్యే ఇంద్రజ్ గుర్జార్, కరౌలీ ఎమ్మెల్యే పీఆర్ మీనా కూడా ఇటీవల సీఎం గెహ్లాట్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-06-16T02:33:56+05:30 IST