Fact Check: కొంపదీసి ఇది నిజమనుకుని వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో షేర్ చేశారా ఏంటి..!

ABN , First Publish Date - 2022-07-26T02:46:14+05:30 IST

సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక అబద్ధాల ప్రచారానికి మరింత రెక్కలొచ్చాయి. వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో తెలుసుకుని అవగాహన పెంచుకునేందుకు..

Fact Check: కొంపదీసి ఇది నిజమనుకుని వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో షేర్ చేశారా ఏంటి..!

న్యూఢిల్లీ: సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక అబద్ధాల ప్రచారానికి మరింత రెక్కలొచ్చాయి. వాస్తవం ఏదో, అవాస్తవం ఏదో తెలుసుకుని అవగాహన పెంచుకునేందుకు దోహదపడే సోషల్ మీడియాను కొందరు ఫేక్ ప్రచారాలకు వేదికగా మార్చుకుంటున్నారు. అబద్ధాలను అడ్డగోలుగా ప్రచారం చేస్తూ నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోలేని గందరగోళ స్థితిలోకి ప్రజలను నెట్టేస్తున్నారు. అది అబద్ధమని మళ్లీ అదే సోషల్ మీడియా వేదికగా గొంతు చించుకుని చెప్పాల్సిన పరిస్థితులు దాపురించాయి. తాజాగా అలాంటి ఒక ఫేక్ ప్రచారమే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.



అదేంటంటే.. విద్య యొక్క అవసరాన్ని తెలియజేసేందుకు ప్రభుత్వం దేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు (Free Smartphones) పంపిణీ చేయనుందని సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం కోడై కూసింది. ట్విట్టర్‌లో (Twitter), ఫేస్‌బుక్‌లో (Facebook), ఇన్‌స్టాగ్రాంలో (Instagram).. ఇలా పలు సామాజిక మాధ్యమాల్లో ఈ ఫేక్ న్యూస్ (Fake News) చక్కర్లు కొట్టింది. ఈ ప్రచారానికి తెరలేపిన కేటుగాళ్లు ఎంతలా బురిడీ కొట్టించారంటే.. ఫోన్ల ఫొటో వేసి.. పైన కేంద్ర విద్యా శాఖ ఈ ప్రకటనను జారీ చేసినట్టుగా కలరింగ్ ఇచ్చారు. కింద అప్లై ఆన్‌లైన్ నౌ (APPLY ONLINE NOW) అనే ఆప్షన్‌ను కూడా ఇచ్చారు. రిజిస్టర్ చేసుకోవాలని కూడా ఆప్షన్ ఇచ్చారు. ఇది ఫేక్ న్యూస్ అని తెలియక చాలామంది వాట్సాప్‌లో ఈ ఫేక్ ప్రచారాన్ని విస్తృతంగా షేర్ చేశారు.



ఈ ఫేక్ ప్రచారాన్ని PIB Fact Check ట్విట్టర్ సాక్షిగా కొట్టిపారేసింది. ఇది ఫేక్ ప్రచారమని, ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. విద్యా శాఖ ఇలాంటి ఏ స్కీంను తీసుకురాలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నిరాధార వార్తలను, ఇలాంటి అసత్య ప్రచారాలను గుర్తించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు PIB Fact Check పనిచేస్తుందన్న విషయం తెలిసిందే. ఈ విభాగం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఇంటర్నెట్‌లో సత్య దూరమైన ప్రచారాలను తిప్పి కొడుతూ ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే ఈ విభాగం ప్రధాన ఉద్దేశం. పలు ఫేక్ ప్రచారాలపై ప్రజల్లో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలను PIB తిప్పికొడుతుంది.

Updated Date - 2022-07-26T02:46:14+05:30 IST