ధనం మూలం.. ఇంధనం జగత్‌

ABN , First Publish Date - 2021-06-20T05:08:33+05:30 IST

ధనం మూలం.. ఇంధనం జగత్‌

ధనం మూలం.. ఇంధనం జగత్‌

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో మారిన జీవనశైలి

జిల్లాలో 70 శాతం పడిపోయిన ఇంధన వినియోగం

ధరల పెరుగుదల, కర్ఫ్యూ  ప్రభావమే ప్రధాన కారణం

పొదుపుగా వాడుతున్న వాహనదారులు 

జిల్లాపై ఇంధన ధరల పెరుగుదల భారం రూ.642.17 కోట్లు

పెట్రోల్‌పై రూ.412.13 కోట్లు, డీజిల్‌పై రూ.230.04 కోట్ల వడ్డన 

మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. అసలే కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత పెనుభారంగా మారాయి. సెంచరీని దాటి పైపైకి ఎగబాకుతున్న ఇంధన ధరలతో వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. చేసేదేమీ లేక ఇంధన వినియోగాన్ని భారీగా తగ్గించేశారు. కరోనా మొదటి దశ, రెండో దశ గణాంకాలను పరిశీలిస్తే.. జిల్లాలో 70 శాతం మేర వినియోగం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం.

విజయవాడ, ఆంధ్రజ్యోతి : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో వాహనదారులు విలవిల్లాడిపోతున్నారు. మూడు నెలలుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా జిల్లావాసులపై ఏటా రూ.642.17 కోట్ల మేర భారం పడుతోంది. పెట్రోల్‌పై రూ.412.13 కోట్లు, డీజిల్‌పై రూ.230.04 కోట్ల భారం పడుతోంది. ఈ నెలలో పెట్రోల్‌ ధర సెంచరీ చేరుకోగా, రెండు వారాల్లోనే మరింత పైపైకి ఎగబాకుతోంది. డీజిల్‌ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్న ఈ రోజుల్లో ఇంధన ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  

దారుణంగా పడిపోయిన వినియోగం

కరోనాకు ముందు ఒక్కో ఆయిల్‌ బంకు సగటున 6వేల లీటర్ల పెట్రోల్‌, 3వేల లీటర్ల డీజిల్‌ను విక్రయించేవి. ప్రస్తుతం పెట్రోల్‌ 1,500 లీటర్లు, డీజిల్‌ 1,000 లీటర్ల చొప్పున మాత్రమే విక్రయిస్తున్నారు. జిల్లాలో మొత్తం 300 ఆయిల్‌ బంకులు ఉన్నాయి. వీటి పరిధిలో కరోనా మొదటి దశకు ముందు.. రోజూ సగటున 18 లక్షల లీటర్ల పెట్రోల్‌, 9 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగం జరిగేది. మొదటి దశ నేపథ్యంలో ఆ వినియోగంలో 35 శాతం తగ్గిపోయింది. రెండో దశ నాటికి 70 శాతానికి పైగా వినియోగం పడిపోయింది. ప్రస్తుతం జిల్లాలో రోజూ సగటున పెట్రోల్‌ 4.50 లక్షల లీటర్లు, డీజిల్‌ 3 లక్షల లీటర్ల చొప్పున మాత్రమే వినియోగం జరుగుతోంది. పెట్రోల్‌ వినియోగించే వాహనదారుడికి సగటున నెలకు రూ.4వేల నుంచి రూ.5వేలు ఖర్చవుతుంది. జిల్లాలో 13 లక్షల మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. ఈ లెక్కన ఒక్క ద్విచక్ర వాహనదారులపైనే నెలకు రూ.650 కోట్ల మేర భారం పడుతోంది. పెట్రోల్‌తో నడిచే కార్లకు అదనపు భారం. 

రవాణా రంగం అతలాకుతలం

కరోనా సంక్షోభ వేళ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటున్న రవాణా రంగంపై ఇంధన ధరల పెరుగుదల తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా లారీ రవాణా రంగం సంక్షోభం అంచున ఉంది. 25 శాతానికి పైగా లారీలు తిరగడం లేదు. పన్నులు, ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో గడువులు కోరుతున్నారు. ఇలాంటి దశలో డీజిల్‌ ధరలు దారుణంగా పెరిగిపోవటంతో అదనపు భారాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.1 రోడ్డు సెస్సును విధిస్తోంది. అదనపు వ్యాట్‌ కూడా రవాణా రంగానికి ఇబ్బందిగా మారింది. ఆటోవాలాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 

జూన్‌లో సెంచరీ..

ఈ నెలలో పెట్రోల్‌ ధర లీటర్‌ వందకు చేరింది. ఏప్రిల్‌ 1వ తేదీన రూ.96.33గా ఉన్న పెట్రోల్‌ ధర ఐదు రాష్ర్టాల ఎన్నికల నేపథ్యంలో నెలాఖరుకు రూ.96.17కు చేరింది. ఎన్నికల అనంతరం మే రెండో వారం నుంచి పెట్రోల్‌ ధరలు పెరుగుతూ వచ్చాయి. రూ.97 నుంచి మే నెలాఖరుకు రూ.99.98కు చేరుకుంది. ఈనెల ఒకటో తేదీకే రూ.100.24కు చేరింది. ఇక 4వ తేదీకి రూ.100.51, 6న రూ.100.78, 7న రూ.101.06,  9న రూ.101.32, 11న 101.67, 12న రూ.101.88, 14న రూ.102.17, 16న రూ.102.42, 19న రూ.102.69కు చేరింది. ఇక ఈ నెలాఖరు నాటికి రూ.105కు చేరుకునే అవకాశముంది. 

సెంచరీకి చేరువగా డీజిల్‌ ధరలు

డీజిల్‌ ధరలు కూడా సెంచరీకి చేరువయ్యాయి. ఏప్రిల్‌ 1వ తేదీన రూ.89.87గా ఉన్న డీజిల్‌ ధర మే నెలాఖరుకు రూ.94.31కు చేరింది. ఈనెల 19వ తేదీ నాటికి లీటర్‌ డీజిల్‌ ధర రూ.96.97గా ఉంది. ఈ నెలాఖరు నాటికి సెంచరీ కొట్టే అవకాశం కనిపిస్తోంది. 








Updated Date - 2021-06-20T05:08:33+05:30 IST