Advertisement
Advertisement
Abn logo
Advertisement

మార్కెట్‌ యార్డుల్లో పెట్రోలు బంకులు

సింగరాయకొండలో పెట్రోలు బంకు ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న మార్కెటింగ్‌శాఖ అధికారులు (ఫైల్‌)

జిల్లాలో 13 ప్రాంతాలు గుర్తింపు

నేడు  ప్రభుత్వానికి ప్రతిపాదనలు

రాబడే లక్ష్యంగా అడుగులు

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 23: జిల్లావ్యాప్తంగా ఉన్న మార్కెట్‌ యార్డుల్లో ఖాళీస్థలాలు అందుబాటులో ఉండటంతో వాటి ద్వారా ఆదాయం పెంచుకునే ఆలోచనలపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. అందులో భాగంగా యార్డు ఆవరణల్లో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. జిల్లావ్యాప్తంగా 15 ఏఎంసీలు ప్రధానంగా ఉండగా, సబ్‌ మార్కెట్‌ యార్డులు మరో 12 ఉన్నాయి. వాటిలో 13చోట్ల పెట్రోలు బంకుల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితి ఉందని ఇప్పటికే మార్కెటింగ్‌ శాఖ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఐవోసీ, హెచ్‌పీసీ కంపెనీల ప్రతినిధులు ఆయా యార్డుల్లో ఉన్న ఖాళీస్థలాలను పరిశీలించి తమకు అనువైన వాటిని గుర్తించారు. పూర్తి వివరాలతో ఈనెల 24న మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆవెంటనే ఆయా కంపెనీలతో ప్రభుత్వం లీజు ఒప్పందాలు కుదుర్చుకోనుంది.


13 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదన

ఒంగోలులోని మార్కెట్‌యార్డుతోపాటు మద్దిపాడు మండలంలోని ఏడుగుండ్లపాడు, కొండపి, సింగరాయకొండ, కందుకూరు పరిధిలోని సబ్‌మార్కెట్‌ యార్డులలో పెట్రోలు బంకులు ఏర్పాటు చేయాలని అధికారులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. మిగతా వాటి విషయంలో కూడా నేడోరేపో స్పష్టత రానుందని మొత్తంగా 13 చోట్ల ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామని మార్కెటింగ్‌ ఏడీ ఉపేంద్ర తెలిపారు.


ఆదాయమే లక్ష్యంగా అడుగులు

తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం రాబడి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఆదాయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగానే మార్కెట్‌ యార్డుల్లో ఖాళీగా ఉన్న జాగాలను ఆయిల్‌ కంపెనీలకు లీజుకివ్వాలని యోచిస్తోంది. ఇప్పటికే ఆర్థిక కష్టాలతో ఏఎంసీలు కునారిల్లుతున్నాయి. ఇలా వచ్చే ఆదాయంలో కొంతభాగాన్ని ఏఎంసీల నిర్వహణకు కేటాయించినట్లయితే ఉపయుక్తంగా ఉంటుందని పాలకవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement
Advertisement