‘నైతిక నియమావళి’కి చట్టబద్ధత కల్పించాలి

ABN , First Publish Date - 2020-09-21T08:27:51+05:30 IST

ఎన్‌బీఏ అనుసరిస్తున్న నైతిక నియమావళి (కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌)కి చట్టబద్ధత కల్పిస్తూ.. దాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కేబుల్‌ టీవీ నిబంధనల్లో భాగంగా చేయాలని ఎన్‌బీఏ(న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌)సుప్రీంకోర్టుకు సూచించింది...

‘నైతిక నియమావళి’కి చట్టబద్ధత కల్పించాలి

  • కేబుల్‌ టీవీ నిబంధనల్లో భాగం చేయాలి
  • సుప్రీంకోర్టులో ఎన్‌బీఏ అఫిడవిట్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ఎన్‌బీఏ అనుసరిస్తున్న నైతిక నియమావళి (కోడ్‌ ఆఫ్‌ ఎథిక్స్‌)కి చట్టబద్ధత కల్పిస్తూ.. దాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కేబుల్‌ టీవీ నిబంధనల్లో భాగంగా చేయాలని ఎన్‌బీఏ(న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌)సుప్రీంకోర్టుకు సూచించింది. అలా చేయడం తద్వారా సభ్యత్వం లేని న్యూస్‌ చానెళ్ల ప్రసారాలను కూడా నియంత్రించడం తమకు సాధ్యమవుతుందని విన్నవించింది. సుదర్శన్‌ టీవీకి ఎన్‌బీఏలో సభ్యత్వం లేదని తెలిపింది. మతపరమైన వివాదాస్పద కార్యక్రమాల ప్రసారాలను నియంత్రించే విషయంలో ఎన్‌బీఏ బలహీనంగా ఉందని, దానికి స్వీయ నియంత్రణ అధికారాలను కట్టబెడుతూ బలోపేతం చేసే దిశగా తగు సూచనలు చేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయవలసిందిగా సుప్రీంకోర్టు ఈ నెల 18న ఎన్‌బీఏతో సహా కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఎన్‌బీఏ ప్రధాన కార్యదర్శి అన్నీ జోసెఫ్‌ ఈ అఫిడవిట్‌ దాఖలు చేశారు. సుదర్శన్‌ టీవీలో ప్రసారమవుతున్న ‘బిందాస్‌ బోల్‌’  కార్యక్రమాన్ని నిలిపివేయాలని, ‘యూపీఎ్‌సఈ జిహాద్‌’ పేరుతో ప్రసారమైన ప్రోమోలో ‘ముస్లింలు దేశ ప్రజాస్వామిక వ్యవస్థలో కుట్రపూరితంగా చొరబడ్డారని’ ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ పిల్‌ దాఖలైంది. ఈ కార్యక్రమం ప్రసారం కాకుండా నిలిపివేయాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై జస్టిస్‌ డీవై చంద్రచుడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి స్టే విధించింది.


న్యూస్‌ చానెళ్ల నియంత్రణ సుప్రీంకోర్టు పనికాదని, ఆ పని ఎన్‌బీఏ ఎందుకు చేయలేకపోతోందని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఈ క్రమంలో ఎన్‌బీఏ బలోపేతానికి సూచనలు చేయవలసిందిగా కేంద్రాన్ని, ఎన్‌బీఏను ఆదేశించింది. కాగా, బిందాస్‌ బోల్‌ కార్యక్రమంపై విధించిన స్టేను ఎత్తివేయాలని సుదర్శన్‌ టీవీ సుప్రీంను కోరింది. దీనిపై స్పందించిన కోర్టు.. సోమవారం పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. విచారణ సోమవారం కూడా కొనసాగనుంది.


Updated Date - 2020-09-21T08:27:51+05:30 IST