ఆంధ్రజ్యోతి(03-02-2021)
చాలామంది మహిళల్లో హార్మోన్ల హెచ్చు తగ్గుల వల్ల ఒక్కోసారి నెలసరి సమయానికి రాదు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మందులు వాడవచ్చు. అయితే జౌషధ గుణాలున్న హెర్బల్ టీలతో నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చూసుకోవచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్ట్ శ్వేతా షాహ్. పలు రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో ఇవి సమర్థంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారామె.
దాల్చిన చెక్క టీ: అంగుళం పొడవున్న దాల్చిన చెక్కను నీళ్లలో మరిగించాలి. తరువాత ఆ నీటిని వడబోసి ఉదయాన్నే పరగడపున తాగాలి. నెల రోజులు దాల్చిన చెక్క టీ తాగితే నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. మహిళల్లో సంతాన సాఫల్యాన్ని పెంచుతుంది. పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, బరువు తగ్గడం, రుతుచక్రాన్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క టీ చక్కగా పనిచేస్తుంది.
అల్లం, తులసి టీ: సగం అగుళం అల్లం, నాలుగు తులసి ఆకులను కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. ఈ టీని పరగడపునే తాగాలి. తులసి ఆండ్రోజన్, ఇన్సులిన్ హార్మోన్ విడుదలను నియంత్రిస్తాయి. అల్లం ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు సమపాళ్లలో విడుదలయ్యేలా చేస్తుంది. నెలసరి ఆరంభంలో తలనొప్పి, వికారం వంటి సమస్యలకు కారణమయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది.