అథెంటికేషన్‌లో.. అక్రమాలు

ABN , First Publish Date - 2020-04-07T09:58:59+05:30 IST

రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభమై ఎనిమిది రోజులు పూర్తి అయినా..

అథెంటికేషన్‌లో.. అక్రమాలు

ఎనిమిది రోజులైనా రేషన్‌ క్యూల్లో జనం 

ఇప్పటికే 82.98 శాతం సరుకుల పంపిణీ పూర్తి

గత కొన్ని నెలల సగటు చూస్తే 84.60 శాతమే 

నిబంధనల సడలింపుతో అక్రమాలకు అవకాశాలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభమై ఎనిమిది రోజులు పూర్తి అయినా ఇంకా షాపుల వద్ద రద్దీ తగ్గలేదు. నిత్యం ఉదయం ఆరు గంటలకు మొదలుకుని మధ్యాహ్నం వరకు చాలా షాపులు రద్దీగానే ఉంటున్నాయి. జిల్లాలో సగటున నెలకు జరిగే పంపిణీ శాతానికి దాదాపుగా చేరుకున్నప్పటికీ ఇంకా రద్దీ తగ్గకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ-పోస్‌ సర్వర్‌ సమస్యలు కారణంగా తొలుత మాన్యువల్‌గా సరుకులు ఇచ్చేసి ఆ తర్వాత వార్డు సెక్రెటరీలతో అథెంటికేషన్‌ చేస్తోండటంతో అక్రమాలకు గేట్లు తెరుచుకున్నాయన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.


జిల్లాలో మొత్తం 14 లక్షల 89 వేల 439 కుటుంబాలకు ఈ-పోస్‌ ద్వారా రేషన్‌ సరుకులు పంపిణీ జరగాలి. అయితే జనవరిలో 84.73, ఫిబ్రవరిలో 84.81, మార్చిలో 84.67 శాతం మాత్రమే రేషన్‌ పంపిణీగా నమోదైంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ప్రతీ నెలా 15 శాతం రేషన్‌కార్డుదారులు సరుకులు తీసుకోవడం లేదు. ప్రతీ నెలా 12.60 లక్షల వరకు జిల్లాలో సరుకులు తీసుకొంటోన్నట్లు పౌరసరఫరాల శాఖ లెక్కలు చెబుతోన్నాయి. ఈ నెల ఇప్పటికే 12.36 లక్షలు(82.98 శాతం) మంది సరుకులు తీసుకెళ్లారు. లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది వేరే ఊళ్లలో ఉండిపోయారు. అయినప్పటికీ రేషన్‌షాపుల వద్ద రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ దఫా కార్డుదారుల వేలిముద్రలు సేకరించొద్దని ప్రభుత్వం ఆదేశించింది.


వారికి బదులుగా వార్డు/పంచాయతీ సెక్రెటరీలతో వేలిముద్ర వేయించాలని స్పష్టం చేసింది. అయితే ప్రారంభంలో సర్వర్‌ మొరాయించడంతో తన కార్డు ఉన్న షాపులో సరుకులు తీసుకోవడానికి వస్తే ఈ-పోస్‌ అథెంటికేషన్‌తో సంబంధం లేకుండా ఇచ్చేయాలని, సర్వర్‌ వచ్చిన తర్వాత సెక్రెటరీతో ఆయా కార్డులకు వేలిముద్ర వేసే వెసులుబాటు కల్పించారు. ఈ చిన్ని లూప్‌హోల్‌ని కొంతమంది డీలర్లు అక్రమాలకు పాల్పడేందుకు వినియోగిస్తోన్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతోన్నాయి. తమ షాపులకు కేటాయించిన సెక్రెటరీలను దారిలోకి తెచ్చుకుని సాయంత్రానికి పెద్దలిస్టు ఇచ్చి వీరందరికీ రేషన్‌ పంపిణీ చేశామని చెబుతూ ఈ-పోస్‌లో అథెంటికేషన్‌ చేయిస్తోన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి.


గుంటూరు పశ్చిమలో ఓ మహిళా సెక్రెటరీతో ఇలానే ఈ-పోస్‌ అథెంటికేషన్‌ చేయించేందుకు ఓ డీలర్‌ ప్రయత్నించారు. అందుకు ఆ సెక్రెటరీ అంగీకరించకపోవడంతో మీకన్నా ముందు మా షాపునకు కేటాయించిన కార్యదర్శులు ఈ-పోస్‌లో వేలిముద్రలు వేశారు మీరెందుకు వేయరంటూ ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. దీనిపై ఆ మహిళా సెక్రెటరీ అడ్మిన్‌ సెక్రెటరీకి ఫిర్యాదు కూడా చేశారు.  ఈ క్రమంలో రేషన్‌ పంపిణీలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై జాయింట్‌ కలెక్టర్‌ దీనిపై దృష్టి పెట్టకపోతే ప్రభుత్వం కేటాయించిన ఉచిత బియ్యం, కందిపప్పు పక్కదారి పట్టడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.  


రేషన్‌ బియ్యం స్వాధీనం

వినుకొండ: రేషన్‌షాపుల ద్వారా పంపిణీ కావాల్సిన సబ్సిడీబియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోతుంది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున తరలిపోతున్న 15 టన్నుల రేషన్‌ బియ్యాన్ని ఎస్సీ కాలనీవాసులు పట్టుకున్నారు. వాటిని తరలిస్తున్న డీలరు పారిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు గ్రామంలోని మూడు రేషన్‌షాపులను తనిఖీ చేయగా స్టాక్‌ రిజిష్టర్‌లోని బియ్యం సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. అయితే పట్టుబడిన బియ్యం ఏ రేషన్‌ షాపు నుంచి తరలిస్తున్నారన్నది అధికారులకు అర్ధం కాని పరిస్థితి. ఈ విషయంపై తహసీల్దార్‌ వెంకటేశ్వర్లును వివరణ కోరగా వైసీపీ నాయకుల మధ్య విభేదాలతో బియ్యం తరలింపు వెలుగుచూసిందన్నారు. 

 

అంగన్‌వాడీ కేంద్రం నుంచి..

మండలం రేగులవరం తండాలో అంగన్‌ వాడీ కేంద్రం నుంచి 5 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని తరలించేందుకు కార్యకర్త యత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వాహనంలో ఎక్కించిన బియ్యంతో సహా వాహనాన్ని వదిలిపెట్టారు. సమాచారం తెలుసుకున్న సీడీపీవో మణియమ్మ, సూపర్‌వైజర్‌ లీలావతిని దర్యాప్తునకు గ్రామానికి పంపారు. అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకొని బియ్యం, కోడిగుడ్లను తనిఖీ చేశారు. 

 

పంచదార పక్కదారి

మండలంలోని చౌక దుకాణాలకు వచ్చిన పంచదారను కొంత మంది చౌక డీలర్లు పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. కొందరు డీలర్లు కందిపప్పు, బియ్యం మాత్రమే ఇచ్చి పంచదారను పంపిణీ చేయలేదు. వీఆర్‌వోల పర్యవేక్షణలో వారి వేలి ముద్రలు వేసి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. అయినా రేషన్‌ సరుకులు పక్కదారి పట్టాయంటే దీనికి అధికారుల పాత్ర కూడా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ ఎన్‌వీ ప్రసాదును వివరణ కోరగా ప్రస్తుతం పంచదార తీసుకోని వారు ఈ నెల 15వ తేదీ నుంచి ఇచ్చే వాటిలో ఇప్పిస్తామన్నారు. 


Updated Date - 2020-04-07T09:58:59+05:30 IST