రావత్ పేరిట స్మారకం..మోదీకి COONOOR గ్రామస్తులు లేఖ

ABN , First Publish Date - 2021-12-13T22:34:40+05:30 IST

హెలికాప్టర్ ప్రమాదంలో అశువులు బాసిన దేశ తొలి సీడీఎస్ జనరల్ రావత్, ఇతర సైనికుల పేరిట..

రావత్ పేరిట స్మారకం..మోదీకి COONOOR గ్రామస్తులు లేఖ

ఉగదమండలం: హెలికాప్టర్ ప్రమాదంలో అశువులు బాసిన దేశ తొలి సీడీఎస్ జనరల్ రావత్, ఇతర సైనికుల పేరిట ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నీలగిరి జిల్లాలోని కూనూరు వెల్లింగ్టన్ కంటోన్మెంట్ వాసులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. తమ విజ్ఞప్తితో కూడిన లేఖలను ప్రధాని మోదీకి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు పంపారు.


కూనూరు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన తమను విచారంలో ముంచెత్తిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. అమరవీరుల పట్ల ప్రజలకున్న ఆరాధానాభావాన్ని చాటుకునేందుకు తమిళనాడు రెవన్యూ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రాంతంలో స్మారక నిర్మాణం చేపట్టాలని, తద్వారా ప్రజలు నివాళులర్పించేందుకు వీలుంటుందని కూనూరు గ్రామస్తులు పేర్కొన్నారు. మెట్టుపాలయం-ఊటీ (ఉదగమండలం) లైన్‌పై ఉన్న కట్టేరీ పార్క్, రన్నయ్‌మేడు రైల్వే స్టేషన్లకు జనరల్ రావత్ పేరు పెడితే చారిత్రక గుర్తింపుతో పాటు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమవుతాయని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఈనెల 8న కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, మరో పది మంది అశువులు బాసారు.

Updated Date - 2021-12-13T22:34:40+05:30 IST