మనలో సగం మంది చేతులు కడుక్కోరు

ABN , First Publish Date - 2020-03-27T06:31:25+05:30 IST

కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు ప్రధానంగా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు..

మనలో సగం మంది చేతులు కడుక్కోరు

  • వరెస్ట్‌ హ్యాండ్‌ వాషింగ్‌ కల్చర్‌ 
  • దేశాల్లో భారత్‌కు పదో స్థానం

న్యూఢిల్లీ, మార్చి 26: కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు ప్రధానంగా చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. జనాలూ దీన్ని పాటిస్తున్నారు. పరిశుభ్రత చర్యల్లో భాగంగా సబ్బుతోనో.. శానిటైజర్‌తోనో చేతులను గంటకో గంటన్నరకో ఒకసారి శుభ్రం చేసుకుంటున్నారు. సాధారణంగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. దిగ్ర్భాంతి కలిగించే విషయం ఏమిటంటే మన దేశంలో సగం మందికి చేతులను శుభ్రం చేసుకునే అలవాటు లేదు. 63 దేశాల్లో ‘వరెస్ట్‌ హ్యాండ్‌ వాషింగ్‌ కల్చర్‌’ పేరుతో ఓ అంతర్జాతీయ సంస్థ సర్వేచేసి ఆ దేశాల జాబితాను ప్రకటించింది. భారత జనాభాలో 50 శాతం మంది చేతులను శుభ్రం చేసుకోవడం లేదని తేల్చి మన దేశానికి 10వ స్థానాన్ని కట్టబెట్టింది. 


చిత్రం ఏమిటంటే.. ఈ సర్వే ప్రకారం అభివృద్ధి పరంగా మన దేశం కన్నా ఎంతోముందున్న దేశాల్లోని ప్రజలకు కూడా శుభ్రతపై అవగాహన తక్కువేనని తేలింది. ‘వరెస్ట్‌ హ్యాండ్‌ వాషింగ్‌ కల్చర్‌’లో టాప్‌గా ఉన్న దేశం ఏదనుకుంటున్నారు? కరోనా వైరస్‌ పుట్టిన చైనానే! ఆ దేశంలో 77శాతం మందికి చేతులను కడుక్కునే అలవాటే లేదట. చైనా తర్వాత జపాన్‌, దక్షిణ కొరియాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచి ‘మురికి’ రికార్డును మూటగట్టుకున్నాయి. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో సౌదీ అరేబియా వాసులే ప్రపంచానికి ఆదర్శమని ఈ సర్వే తేల్చింది. 

Updated Date - 2020-03-27T06:31:25+05:30 IST