మెడికల్‌ షాపుల్లో.. మందుల కొరత

ABN , First Publish Date - 2020-04-02T10:55:47+05:30 IST

లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న ఆందోళనతో రోగులు రెండునుంచి మూడు నెలలకు సరిపోయే మందులను

మెడికల్‌ షాపుల్లో.. మందుల కొరత

లాక్‌డౌన్‌ భయంతో అవసరానికి మించి కొనుగోలు

దుకాణాల ముందు జనం రద్దీ

ఆర్థిక సంవత్సరం పేరుతో ఆర్డర్లు ఇవ్వని బడా డీలర్లు.. రవాణా ఇబ్బందులతో రిటైలర్ల గగ్గోలు

మాస్కులు, శానిటైజర్ల ఊసే కరువు


కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించి ఎనిమిది రోజులు గడిచినా జిల్లాలో మెడికల్‌ షాపుల ముందు జనం తోపులాట ఆగడంలేదు. ఓవైపు బడా డీలర్ల నిర్వహణాలోపం, మరోవైపు హైదరాబాద్‌ నుంచి సరుకులు తెచ్చుకునేందుకు వాహన అనుమతుల్లో ఇబ్బందులు, మార్చి ఆర్థిక సంవత్సరం పేరుతో బడా డీలర్లు ఆర్డర్లు ఇవ్వడంలేదు. మరోవైపు లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న భయంతో జనం అవసరానికి మించి కొనుగోలు చేస్తుండడంతో మెడికల్‌ షాపుల్లో మందుల కొరత ఏర్పడింది. రిటైలర్లు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. 


నల్లగొండ, ఏప్రిల్‌ 1 : (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న ఆందోళనతో రోగులు రెండునుంచి మూడు నెలలకు సరిపోయే మందులను ఒకేసారి కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా బీపీ, షుగర్‌కు సంబంధించిన మందులను ఒకేసారి కొనుగోలు చేయడంతో దుకాణాల్లో స్టాక్‌ అడుగంటింది. రోగులు కోరిన కంపెనీలను కాకుండా అదే ఫార్ములాతో ఉన్న ఇతర కంపెనీల ఔషధాలను తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో జలుబు, దగ్గు మందులు సైతం జనం పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి పెట్టుకున్నారు. కరోనాకు హైడ్రాక్లిన్‌ క్లోరికిన్‌, అజిత్రోమైసిన్‌ అనే యాంటీబయాటిక్‌ మందులు పనిచేస్తాయని మీడియాలో రావడంతో మొదట్లో ఆ మందులను సామాన్యులు కొనుగోలుచేసి పెట్టుకున్నారు.


సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం 20 శాతం విక్రయాలు పెరిగాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. ఇదో భాగమైతే ఆర్థిక సంవత్సరం మార్చితో మొదలవుతుంది. దీంతో ఫిబ్రవరి, మార్చిలో బడా డీలర్లు ఆర్థిక లావాదేవీలను సర్ధుబాటు చేసుకునేందుకు హైదరాబాద్‌లో ఆర్డర్లు తక్కువగా పెట్టారు. ఇది ప్రతి ఆర్థిక సంవత్సరంలో సర్వసాధారణంగా జరిగేది. అయితే ఇదే సమయంలో కరోనా వైరస్‌ వెలుగుచూడటంతో అవసరాలమేరకు జిల్లాకు మందులురాక ఇబ్బందులు తలెత్తాయి. ఇదిలా ఉంటే బడా డీలర్లు జిల్లాలోని రిటైల్‌ వ్యాపారులకు 15నుంచి 30 రోజుల వెసులుబాటుతో సరుకువేస్తారు. అయితే స్థానికంగా ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు నగదుచెల్లించి సరుకు తీసుకెళ్లాలంటూ బడా డీలర్లు నిబంధనలు పెట్టడంతో ఇబ్బందులు తలెత్తాయని రిటైలర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 


వాహనాలకు అనుమతుల విషయంలో

మరోవైపు వాహనాలకు అనుమతుల విషయంలో మెడికల్‌ షాపుల నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికంగా డాక్టర్లు రాసే మందులు మాత్రమే హైదరాబాద్‌లో ఆర్డర్‌ పెట్టుకొని స్థానిక వ్యాపారులు ఆ మందులను తెప్పించుకుంటారు. దీంతో ఇబ్బందులు ఉండవు. కరోనా వైరస్‌ నేపథ్యంలో రవాణా నిలిచిపోవడంతో రిటైలర్లు హైదరాబాద్‌ వెళ్లలేకపోవడం, అక్కడి బడా వ్యాపారులు హైదరాబాద్‌ కార్పొరేట్‌ డాక్టర్లు రాసే మందులనే జిల్లాకు పంపడం, వాటిని స్థానికులు కొనుగోలు చేయకపోవడం సంక్షోభానికి ఓ కారణమైంది.


పోలీసులు తమ డ్రగ్‌ లైసెన్సును చూసి కనీసం 15 రోజుల వ్యవధితో హైదరాబాద్‌కు, జిల్లాలోని పలు ప్రాంతాలకు ప్రయాణించేందుకు అనుమతులిస్తే తమకు అవసరమైన మందులు కొనుగోలుచేసి వినియోగదారుల ఇబ్బందులు తొలగించే అవకాశం ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. ఇక మాస్కులు, శానిటైజర్ల ఉత్పత్తులు జిల్లాలోని మెడిక ల్‌ షాపులకు రావడంలేదు. అవి జిల్లాకు ఎలా వస్తున్నాయో, ఎక్కడ అమ్ముతున్నారో తమకు అర్థం కావడం లేదని రిటైలర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో తప్పితే జనం ఆందోళనతో మెడికల్‌ షాపుల్లో పోటెత్తుతున్నారు. ఇక్కడ భౌతిక దూరం నిబంధనకు నీళ్లొదులుతున్నారు. నల్లగొండ పట్టణంలోని ప్రకాశంబజారులో పెద్దఎత్తున వచ్చే వాహనాలను మందుల దుకాణాలకు దూరంగా పార్కింగ్‌ చేయిస్తే భౌతిక దూరానికి ఇబ్బంది ఉండదన్న స్థానికులు సూచిస్తున్నారు. 


వలిగొండలో అధిక ధరలకు మాస్క్‌లు, శానిటైజర్లు విక్రయిస్తున్న దుకాణదారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.


వాహనాలకు అనుమతివ్వాలి

పోలీసులు మా వాహనాలకు 15 రోజుల వ్యవధితో రవాణాకు అనుమతిస్తే కావాల్సినంత సరుకు కొనుగోలు చేసుకొని వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడగలుగుతాం. మాస్కులు, శానిటైజర్ల సరఫరా పూర్తిగా నిలిచింది.  ప్రజలకు ఎంత చెప్పినా నెట్టుకొని దుకాణంలోకి వస్తున్నారు. 

శ్రీనివాస్‌, మెడికల్‌ షాపు యజమాని, నల్లగొండ


సర్ధుబాటు అవుతుంది

అత్యవసర మందులకు ఇబ్బందిలేదు. శానిటైజర్లకు సంబంధించి ప్రభుత్వం ధరల నియంత్రణ పెట్టింది. గతంలో రూ.135కు 100 ఎంఎల్‌ దొరికేది. ప్రభుత్వం ధరల నియంత్రణతో రూ.100కే 200 ఎంఎల్‌ విక్రయించాల్సి వస్తుంది. దీంతో బాటిళ్లపై రేట్లు రీప్రింట్‌ చేయాల్సి రావడంతో సమయం పట్టింది. తాజాగా ఇబ్బందులు ఏర్పడటంతో పోలీ్‌సశాఖ నుంచి కంటైనర్‌ రవాణాకు అమనుతులు తెచ్చాం. 

చిలుకూరు పరమాత్మ, డ్రగ్గిస్టు జిల్లాశాఖ ప్రధాన కార్యదర్శి 


Updated Date - 2020-04-02T10:55:47+05:30 IST