జనం బారులు.. కరోనాకు దారులు..!

ABN , First Publish Date - 2022-01-13T05:30:00+05:30 IST

కరోనా మహమ్మారి మూడవ దశ రూపంలో తరుముకొస్తోంది. వారం రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య పెరిగింది. బుధవారం 42 కేసులు నమోదు కాగా గురువారం ఒక్క రోజులోనే 174 కేసులు నమోదయ్యాయి. 3,800 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 174 మందికి నిర్ధారణ అయింది. పాజిటివ్‌ రేట్‌ 4 శాతంగా నమోదైంది. ఇద్తి వైరస్‌ తీవ్రవ్యాప్తికి అద్దం పడుతోంది. ఒకే చోట కాకుండా ఈ సారి జిల్లా అంతటా మహమ్మారి వ్యాప్తి చెందింది.

జనం బారులు.. కరోనాకు దారులు..!
జనంతో కిటకిటలాడుతున్న వైవీస్ర్టీట్‌

ఒక్క రోజులో 174 కేసులు నమోదు 

జిల్లా అంతటా పాజిటివ్‌ కేసులు 

జనంలో కనిపించని భయం !

విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్న వైనం 

మాస్కు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కడప నేతలు

జాగ్రత్తలు పాటించకపోతే పండగ తరువాత విస్ఫోటనమే 

కడప, జనవరి 13 (ఆంరఽధజ్యోతి): కరోనా మహమ్మారి మూడవ దశ రూపంలో తరుముకొస్తోంది. వారం రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య పెరిగింది. బుధవారం 42 కేసులు నమోదు కాగా గురువారం ఒక్క రోజులోనే 174 కేసులు నమోదయ్యాయి. 3,800 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే 174 మందికి నిర్ధారణ అయింది. పాజిటివ్‌ రేట్‌ 4 శాతంగా నమోదైంది. ఇద్తి వైరస్‌ తీవ్రవ్యాప్తికి అద్దం పడుతోంది. ఒకే చోట కాకుండా ఈ సారి జిల్లా అంతటా మహమ్మారి వ్యాప్తి చెందింది.

కడప నగరంలోనే 52 కేసులు..

బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు నమోదైన 174 కేసులను పరిశీలిస్తే కడపలోనే 52 నమోదయ్యాయి. ఇందులో 7 మంది కార్పొరేషన సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. వివిధ పనుల నిమిత్తం కార్పొరేషనకు వెళ్లిన వారు, ఆ అధికారులను కలిసిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రొద్దుటూరులో 15 నమోదు కాగా, రాయచోటి, రాజంపేటలో 12 చొప్పున నమోదయ్యాయి. ఎర్రగుంట్లలో 8 కేసులు నమోదు కాగా మిగతా చోట్ల 3 నుంచి 8 లోపు కేసులు నమోద య్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు 1,16,578కు చేరుకున్నాయి. 714 మంది మృతిచెందారు. ఆస్పత్రుల్లో 19 మంది, హోం ఐసోలేషనలో 317 మంది చికిత్స పొందుతున్నారు. కోలుకున్న 15 మందిని డిశ్చార్జ్‌ చేయగా రికవరీ సంఖ్య 1,15,427కు చేరింది.

మేలుకోకపోతే...

కరోనా మహమ్మారి ఈ సారి చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. గత ఏడాది రెండో దశ జిల్లాలో ఏప్రిల్‌ నుంచి మొదలై మే చివరి నాటికి పతాక స్థాయికి వెళ్లిపోయింది. అయితే ఈ సారి పండగకు ముందే మహమ్మారి జిల్లాలో తిస్టవేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే మహమ్మారి చాలా చోట్ల వ్యాప్తి చెందింది. పండుగకు హైదరాబాద్‌, బెంగళూరు, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఉంటున్న వారందరూ సొంత ఊర్లకు వస్తుంటారు. ఇప్పటికే ఆ రాష్ర్టాల్లో మహమ్మారి తీవ్రంగా ఉంది. పండగ వేళ అందరూ జాగ్రత్తలు పాటించకుండా గుంపులుగా ఉంటే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. సినిమా థియేటర్లు, జనం గుమికూడే చోట నిబంధనలు అమలు కాకపోతే ఒక్కసారిగా కరోనా విస్ఫోటనంలా పేలే అవకాశం ఉన్నట్లు అధికారురులు చెబుతున్నారు. ఒమైక్రాన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషనలో ఉంచుతున్నారు. డిసెంబర్‌ 1 నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి 7,008 మంది రాగా వారిందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా 40 మందిలో మాత్రం కరోనా నిర్ధారణ అయింది.


నిబంధనలు ఏవీ :

కరోనా మూడవ దశ నేపథ్యంలో ఇటీవల కలెక్టర్‌ విజయరామరాజు సమీక్ష నిర్వహించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని లేకుంటే ఫైన వేయాలని ఆదేశించారు. మాస్కులు ధరించని అధికారులకు కూడా ఫైన వేయాల్సి ఉందని స్పష్టం చేశారు. కడపకు చెందిన నేతలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు, భౌతికదూరం లేకుండా గుంపులు గుంపులుగా అనుచరులను వెంటవేసుకొని తిరుగుతూ ప్రారంభోత్సవాలు, పలు కార్యక్రమాల్లో, సమావేశాల్లో పాల్గొంటున్నారు. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’ అన్న చందంగా నేతలు మాస్కులు ధరించకుండా తిరిగితే వారి అనుచరులు ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. 

దుకాణాలు కిటకిట:

సంక్రాంతి పండుగ కావడంతో వాణిజ్య సముదాయాలాన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. వైవీస్ర్టీట్‌, బీకేఎం స్ర్టీట్‌, ప్రధాన షాపింగ్‌ మాల్స్‌ జనంతో దర్శనమిస్తున్నాయి. గతంలో రెండో దశ పండుగ పూర్తయిన తరువాత వచ్చింది. ఇప్పుడు మూడో దశ పండుగ ముందే రావడంతో సంక్రాంతి తరువాత కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుందని వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మాస్కే కవచం:

వ్యాక్సిన వేసుకున్న వారు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే వారిలో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోంది. బయటకు వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా  మాస్కు ధరించాలి. వీలైనంత వరకు జనం గుమిగూడే చోట్లకు వెళ్లకుండా ఉండడం మంచిది. బయటి నుంచి ఇంటికి వచ్చిన తరువాత చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతిక దూరం పాటించడం, అవసరమైతే తప్ప బయటక రాకుండా ఉండడమే మంచిది. పండుగలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలి. ఎందుకంటే మహమ్మారి ఇప్పటికే మీ ఊరు మీ ప్రాంతం వచ్చేసింది. దానిబారిన పడకుండా ఉండాలంటే స్వీయ రక్షణతో పాటు వ్యాక్సిన వేసుకోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కడప కార్పొరేషనలో కరోనా కలకలం 

కమిషనర్‌కు పాజిటివ్‌ 

కడప(ఎడ్యుకేషన), జనవరి 13: కడప నగరపాలక సంస్థలో కరోనా కలకలం రేపింది. కమిషనర్‌ రంగస్వామికి పాజిటివ్‌గా నిర్థారణైంది. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం క్వారంటైనకు వెళ్లారు. కమీషనర్‌తో పాటు ఆయన పేషిలో పని చేసే సీసీ నాగరాజు, కార్తీక్‌, కార్పొరేషన శానిటరీ ఇనస్పెక్టర్‌ వసుంధర, జనన-మరణాల విభాగంలో పనిచేసే జ్యోతి, మెయిన సెక్షనలో పని చేస్తున్న వాణికి కరోనా పాజిటీవ్‌ వచ్చింది. వీళ్లంతా హోం క్వారంటైనలో ఉన్నారు.   

Updated Date - 2022-01-13T05:30:00+05:30 IST