పెన్షన్‌..మళ్లీ టెన్షన్‌

ABN , First Publish Date - 2020-05-26T08:39:30+05:30 IST

జిల్లాలో సామాజిక పింఛన్ల వడపోతకు రంగంసిద్ధమైంది. ‘ఒక రేషన్‌కార్డుపై ఒకే పింఛన్‌’ విధానం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ..

పెన్షన్‌..మళ్లీ టెన్షన్‌

ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : జిల్లాలో సామాజిక పింఛన్ల వడపోతకు రంగంసిద్ధమైంది.  ‘ఒక రేషన్‌కార్డుపై ఒకే పింఛన్‌’ విధానం అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకే రేషన్‌కార్డుపై లేదా ఒకే కుటుంబంలో ఒకరికి మించి సామాజిక పింఛన్‌ పొందుతుంటే రెండో వారిని జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. దీంతో అధికారులు పింఛన్‌ తొలగించే జాబితాలను సిద్ధం చేశారు. ఆయా మండలాలు, పురపాలక సంఘాలు, వార్డులు, పంచాయతీలవారీగా ఒకే కార్డుపై ఇద్దరు, ముగ్గురు పింఛన్‌ రూపంలో లబ్ధి పొందుతుంటే వారి వివరాలను బయటకు లాగారు. ఆ వివరాలు సక్రమమైనవా, కాదా అనే అంశాన్ని పరిశీలించే బాధ్యతను గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులకు అప్పగించారు. అయితే, మానవతా దృక్పథంతో కొన్ని విభాగాల్లోని లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 


ఇంటి యజమాని అభిప్రాయం తీసుకుని తొలగింపు

రేషన్‌కార్డుపై ఒకే కుటుంబంలో ఇద్దరు పింఛన్‌ తీసుకుంటే ఎవరికి పింఛన్‌ రద్దు చేయాలో ఇంటి యజమాని అభిప్రాయం తీసుకుని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో వైఎస్సార్‌ పింఛన్‌ కానుక పథకం ద్వారా 4,80,823 పింఛన్లు అందజేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌కార్డుపై ఒకరికే సామాజిక పింఛన్‌ ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. 2019లో నిర్వహించిన నవశకం సర్వేలో ఒకే రేషన్‌కార్డుపై రెండు.. అంతకన్నా ఎక్కువగా పింఛన్లు పొందుతున్న వారు 35వేల నుంచి 40వేల మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ పింఛన్లు పోతాయని అప్పట్లో ప్రచారం జరగడంతో సర్వే నిర్వహించి పునరుద్ధరించారు. 


ప్రభుత్వం మళ్లీ ఈ తరహా పింఛన్లు రద్దు చేయాలని ఆలోచన చేయడంతో తాజాగా వివరాలను సేకరించారు. వీటిని ఆయా మండలాలు, పురపాలక సంఘాలకు పంపారు. ప్రస్తుతం వీటిపై వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇస్తున్న పింఛన్లలో 10 శాతానికి మించి.. అంటే దాదాపు 40వేల మందికి పైగా పింఛన్లు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. 


జిల్లాలో పింఛన్ల వివరాలు

జిల్లాలో 4,80,823 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. వృద్ధాప్య పింఛన్లు 1,86,080, వితంతు పింఛన్లు 1,87,741, వికలాంగుల పింఛన్లు 57,147, చేనేత పింఛన్లు 5,722, అభయహస్తం పింఛన్లు 9,137, మత్స్యకారుల పింఛన్లు 8,258, ఒంటరి మహిళ పింఛన్లు 13,697, గీత కార్మికుల పింఛన్లు 5,754, ట్రాన్స్‌జెండర్‌ పింఛన్లు 177, కిడ్నీ బాధితులు 659, డప్పు కళాకారులు 2,275, సంప్రదాయ కొబ్బరిపీచు కార్మికులు 2,118, అనారోగ్యం బారిన పడినవారు 2,058 మంది ఉన్నారు.

Updated Date - 2020-05-26T08:39:30+05:30 IST