పెన్నా నదిని కుళ్లబొడుస్తున్నారు..

ABN , First Publish Date - 2021-07-26T05:07:05+05:30 IST

నెల్లూరుకు కూతవేటు దూరంలో ఉన్న మినగల్లు రీచ్‌ వద్దకు వెళ్లి ఇసుక తవ్వకాల కోసం తీసిన గోతులు చూస్తే కళ్లు తిరుగుతాయి.

పెన్నా నదిని కుళ్లబొడుస్తున్నారు..
బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు ఇసుక రీచ్‌లో తవ్వకాలు జరిపిన చోట చేరిన నీరు

అనుమతి మాత్రం 3 అడుగులే...

తవ్వేది 15 నుంచి 20 అడుగులు లోతుకు..

ఎంత తవ్వుతున్నారో.. ఎంత తోలుతున్నారో లెక్కపక్కా లేదు. 

తవ్వకాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఒక్కరోజు లెక్క చెప్పని జెపీ కంపెనీ

అటువైపుగా వెళ్లాలంటేనే హడలుతున్న అధికారులు


అధికారుల తీరు చూస్తుంటే పెన్నా నదిని.. జిల్లా పరిధిలోని ఇతర ఇసుక రీచ్‌లను జెపీ కంపెనీకి శాశ్వతంగా ధారాదత్తం చేసినట్లు ఉంది. ఆ కంపెనీకి రెండేళ్లకు లీజుకు కాకుండా పెన్నానది మొత్తాన్ని ఏకంగా విక్రయించేసినట్లు కనిపిస్తోంది. జిల్లా పరిధిలోని ఇసుక రీచ్‌ల వద్ద నిబంధనలు అమలు కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ కూడా లేదు. అసలు ఎంత తవ్వుతున్నారో.. ఎంత అమ్ముతున్నారో... ఎంతకు అమ్ముతున్నారో...జిల్లా ఇసుక ఎక్కడికి తోలుతున్నారో...? ఈ వివరాలేవి అధికారులకు తెలియదు.  మైనింగ్‌ శాఖ కాని, ఈ శాఖపై పర్యవేక్షణాధికారం కలిగిన ఉన్నతాధికారులు కాని జిల్లాలో ఇసుక రీచ్‌లంటూ కొన్ని ఉన్నాయనే విషయాన్నే మరచిపోయారు. కాదు.. కాదు...అలా మరచిపోయేలా ప్రభుత్వ పెద్దలు వీరికి శాపం పెట్టినట్లు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పెన్నానదిలో గచ్చు బయటపడేటం త లోతుకు ఇసుక లోడేస్తున్నా, రోజు వందలాది టిప్పర్లు, భారీలారీలలో ఇసుక తరలిపోతున్నా ఆ లెక్కపక్కా చూసుకోకుండా చేతులెత్తేశారంటే ఏమనాలి.?? ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం కళ్లుమూసుకొని కూర్చుందని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు  ఆరోపిస్తున్నారు. జేపీ కంపెనీ జిల్లాలో మే19వ తేదీన ఇసుక తవ్వకాలు మొదలు పెట్టింది. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కంపెనీ ఎంత ఇసుక తవ్వకాలు జరిపిందో ఆ వివరాలు జిల్లా మైనింగ్‌ శాఖ వద్ద లేవంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 


 నెల్లూరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): నెల్లూరుకు కూతవేటు దూరంలో ఉన్న మినగల్లు రీచ్‌ వద్దకు వెళ్లి ఇసుక తవ్వకాల కోసం తీసిన గోతులు చూస్తే కళ్లు తిరుగుతాయి. నిబంధనల ప్రకారం మీటరు లోతు (మూడు అడుగులు) మాత్రమే ఇసుక తీయాలి. అంతకు మించిలోతు తీయడానికి వీలు లేదు. కాని ఈ రీచ్‌లో ఐదు నుంచి ఆరు మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వి తరలిం చేస్తున్నారు. ఎక్కడ చూసినా 15 నుంచి 20 అడుగుల లోతుకు తీసిన భారీ గుంతలే కనిపిస్తాయి. రీచ్‌కు నాలుగు వైపులా ఐదు భారీ ఎక్స్‌కవేటర్లు ఎంత దూరం ఇసుక పొరలు అంటే అంత లోతుకు తవ్వి లారీలకు, టిప్పర్లకు లోడ్‌ చేసి పంపుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం మీటరు లోతుకు మించి ఇసుక తీయడం నేరం. ఏ ప్రాంతంలో ఎంత ఇసుక ఉందో, భూగర్భ జలాలు దెబ్బతినకుండా అందులో ఎంత లోతు వరకు ఇసుక తీయవచ్చో డిస్టిట్‌ లెవల్‌ శ్యాండ్‌ కమిటీ(డీఎల్‌ఎస్‌సీ) నిర్థారిస్తుంది. కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో 13 శాఖలకు చెందిన అధికారుల బృందం సభ్యులుగా ఉంటారు. సమగ్ర అధ్యయనం తరువాత ఈ కమిటీ ఏ రీచ్‌లో ఎంత మేర ఇసుక తీయవచ్చో నిర్ధారిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని రీచ్‌లో 6 నుంచి 7 మీటర్ల లోతు వరకు ఇసుక ఉంటుంది. ఇందులో  మీటరు లోతు వరకు ఇసుక తరలిస్తే భూగర్బ జలాలకు ఇబ్బంది ఉండదు కాబట్టి ఆ మేరకు అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రీచ్‌లోనూ మీటరు లోతుకు మించి ఇసుక తవ్వకాలు జరగకూడదని డీఎల్‌ఎస్‌సీ నిర్థారించింది. కాని మినగల్లు రీచ్‌లో ఆరేడు మీటర్ల లోతు వరకు తవ్వి తరలిస్తున్నారు. ఈ ఒక్క రీచ్‌లోనే కాదు జిల్లా వ్యాప్తంగా అన్ని రీచ్‌లోనూ ఇదే పరిస్థితి. ఇసుక తవ్వకాలను పర్యవేక్షించి, చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్‌ శాఖ సిబ్బంది లేరనే సాకుతో రీచ్‌ల వైపు వెళ్లడమే మానేసింది.ఇసుక ఏడెనిమిది మీటర్ల లోతుకు తవ్వేస్తున్నారు, దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని ప్రధాన ప్రతిపక్షాలు గొంతు చించుకుంటున్నా, ఉన్నతాధికారులు మాత్రం జిల్లా ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి క్షణం ఆలోచించడం లేదు. 


రీచ్‌లను గాలికి వదిలేశారు.. 

జిల్లాపరిధిలో 40లక్షల టన్నుల ఇసుక నిక్షేపాలను జెపీ కంపెనీకి స్వాధీనం చేశారు. ఇందులో ఎంత ఇసుక తరలించారో రోజువారీ వివరాలను ఆ కంపెనీ మైనింగ్‌ శాఖకు ఇవ్వాలి. విచిత్రం ఏమంటే ఈ కంపెనీ మే19వ తేదీ నుంచి తవ్వకాలు మొదలు పెట్టింది. ఈ మధ్య కాలంలో ఒక్క రోజు కూడా ఆ కంపెనీ అధికారులకు రోజువారి విక్రయాల వివరాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని వీరు సదరు కాంట్రాక్టు సంస్థను గట్టిగా అడగలేదు. ఆ వివరాల కోసం ఆంధ్రజ్యోతి జిల్లా మైనింగ్‌ శాఖ అధికారులను సంప్రదించగా ఆ వివరాలు తమ వద్ద లేవన్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌ తమకు ఆ వివరాలు ఇవ్వలేదన్నారు. ఇవ్వకపోతే మీరు అడగాలి కదా అనే ప్రశ్నకు హెడ్‌ ఆఫీసుకు తెలియజేశామం టూ..మాట దాటవేశారు. రోజు వారి ఎంత ఇసుక తరలిస్తున్నారో తెలిస్తే కదా..? జిల్లాలో ఇసుక నిల్వలు ఎంత ఖర్చయ్యాయి, ఎంత మిగిలాయి అనే లెక్క తేలుతుంది. ఈ లెక్కలు ఇవ్వకుండా తవ్వుకుపోతున్నారు అంటే ఏడాది కాలంలోనే జిల్లాలోని ఇసుక నిక్షేపాలన్నీ సదరు కంపెనీ ఖాళీ చేసుకొని వెళ్లే ప్రమాదం లేకపోలేదని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మినగల్లు రీచ్‌లో రోజుకు రెండు వందలకు పైగా లారీలు, మూడువందలకు పైగా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నట్లు అంచనా. సంగం బ్యారేజ్‌ వద్ద రేయింబవళ్లు తేడా లేకుండా తిరుమల కొండకు ఆర్టీసీ బస్సులు తిరిగినట్లు భారీ టిప్పర్లు, లారీలు తిరుగుతూ ఇసుకను తరలిస్తున్నాయి. వచ్చేవి వస్తుంటే... 30 నుంచి 40 టన్నుల బరువుతో వెళ్లే లారీలు వెళుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రీచ్‌ల వద్ద ఇదే పరిస్థితి. ఎంత లోడు వేసుకొని ఎక్కడికి వెళుతున్నా అడిగేవారు లేకపోవడంతో పక్క రాష్ట్రాలకు ఇసుక తరలింపు ఊపందుకుంది. ఇదే వేగంతో ఇసుక తవ్వకాలు కొనసాగిస్తే ఏడాది కాలానికి జిల్లాలో ఉన్న ఇసుక నిక్షేపాలన్నీ ఖాళీ అయ్యే ప్రమాదం లేకపోలేదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో ఆలోచించాల్సి ఉంది.   



Updated Date - 2021-07-26T05:07:05+05:30 IST