పతులదే పెత్తనం!

ABN , First Publish Date - 2022-08-05T06:50:13+05:30 IST

పతులదే పెత్తనం!

పతులదే పెత్తనం!

కార్పొరేషన్‌లో చక్రం తిప్పుతున్న కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు

కబ్జాలు, సెటిల్‌మెంట్లతో కాసుల వేట

ఖమ్మం కార్పొరేషన, ఆగస్టు 4: మహిళా సాధికారిత.. ఉపన్యాసాలకే పరిమితమవుతోందనడానికి ఖమ్మంలోని కొందరు మహిళా కార్పొరేటర్ల పరిస్థితే ఉదాహరణ. ప్రజలు వీరికి అధికారాన్నిస్తే.. వారి భర్తలో లేదంటే తండ్రులో పెత్తనం చెలాయిస్తున్నారు. ఇలాంటి షాడో పెత్తనం ఖమ్మంలో పతాకస్థాయికి చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు డివిజన్లలో తామే కార్పొరేటర్లుగా చెలామణి అవుతూ దందాలు చేస్తుండగా.. ఇంకొందరు ఏకంగా అధికారిక కార్యకలాపాలు కూడా కొనసాగిస్తుండడం గమనార్హం. 


కన్ను పడితే కబ్జా.. 

నగరంలోని కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు కబ్జా లో ఆరితేరినట్లు ఆరోపణలున్నాయి. ‘కన్ను పడితే కబ్జా’ అన్న తీరున వారి వ్యవహార  శైలి ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓ మహిళా కార్పొరేటర్‌ భర్త ప్రభుత్వ స్థలా న్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతుండగా అప్పటి తహసీల్దార్‌ వాటిని నిలిపివేశారు. అయినా షెడ్డు పూర్తి చేయ టం గమనార్హం. విలువైన ఆ స్థలంలో నిర్మాణాలు ఎవరు చేపడుతున్నారో అందరికీ తెలిసినా అధికారులపై ఒత్తిడి ఉండటంతో ఏమీ చేయలేకపోతున్నారు. గత పాలకవర్గంలో కార్పొరేటర్‌గా పనిచేసిన సదరు ‘మాజీ’ తన హ యాంలో  అతడి వ్యవహార శైలి, కబ్జాల వ్యవహారం వివాదాస్పదమైంది.అంతేకాంకుడా నగరంలోని అధికార పార్టీలో అంతా తానే అన్నట్లు వ్యవహరించటంపై మంత్రి కూడా అప్పట్లోనే అతడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడిపై ఉన్న ఆరోపణలతో కార్పొరేటర్‌గా మళ్లీ ఆయనకు అవకాశం ఇవ్వరనే ప్రచారం కూడా జరిగింది. అయితే సామాజిక సమీకరణలతోపాటు డివిజన్లకు సంబంధించి రిజర్వేషన్లు మారటంతో అనూహ్యంగా అతడి భార్యకు టిక్కెట్‌ దక్కడం, ఆమె గెలవడంతో అతడికి నగర టీఆర్‌ఎ్‌సలో కీలక పదవి దక్కడం గమనార్హం. ఇక మరో మహిళా కార్పొరేటర్‌ భర్తపై కూడా తీవ్ర ఆరోపణలున్నాయి. డివిజన మారినా అతడి భార్య గెలవటంతో కబ్జాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. గతంలో ఆయన భార్య కార్పొరేటర్‌గా ఉన్నప్పటినుంచే కబ్జాలు ప్రారంభించి, విలువైన స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా పక్క డివిజనకు చెందిన మరో మహిళా కార్పొరేటర్‌ భర్తతో కలిసి స్థలాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇక గతంలో కార్పొరేటర్‌గా పనిచేసి రిజర్వేషన్లు మారుటంతో తన భార్యకు టిక్కెట్టు తెచ్చుకొని గెలిపించుకున్న ఒక మాజీ కార్పొరేటర్‌ ఏకంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం విమర్శలకు దారితీస్తోంది. పట్టణ ప్రగతిపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నిర్వహించిన సమావేశానికి కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు హాజరై సమావేశంలో మాట్లాడుతుండగా మంత్రి పువ్వాడ వారిపై సీరియస్‌ కావటం గమనార్హం. ఇలా భార్యల పదవిని అడ్డం పెట్టుకొని పలువురు మాజీలు దందాలు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.


ఇల్లు కట్టుకోవాలంటే సొమ్ము చెల్లించాల్సిందే 

మహిళా కార్పొరేటర్ల భర్తల పరిస్థితి ఇలా ఉంటే.. నేరుగా రెండోసారి గెలిచిన కొందరు కార్పొరేటర్లు దందాలతో రెచ్చిపోతున్నట్టు ఆరోపణలున్నాయి. సెటిల్‌మెంట్లతో పాటు సొంత వ్యాపారాలు చూసుకుంటూ అధికారులనే బెదిరించే స్థాయికి చేరినట్లు ఇటీవలి పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి. డివిజనలో ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలంటే సదరు కార్పొరేటర్‌కు సొమ్ములు చెల్లించుకోవాల్సిందేనన్నది బహిరంగ రహస్యమే. భూవివాదాలు వస్తే వారికి పండుగే. లిక్కర్‌ నుంచి రియల్‌ఎస్టేట్‌ వరకు వారే ముందుంటారనే విమర్శలున్నాయి. ఒక కార్పొరేటర్‌ లిక్కర్‌ షాపుల దందా చేస్తూ తనకు అనుకూలంగా లేని బెల్ట్‌షాపుల నిర్వాహకులపై అధికారులతో దాడులు చేయించటం, వారిపై కేసులు పెట్టించటం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక కార్పొరేటర్‌ అయితే ఏకంగా విపక్ష మహిళా కార్పొరేటర్‌ భర్తకు చెందిన స్థలాన్ని కబ్జా చేయటం అతడి తెగింపునకు అద్దం పడుతోంది. డివిజనలోని ప్రజలకు సేవ చేస్తామని చెప్పి గెలిచిన కార్పొరేటర్లు తాము ఆర్థికంగా ఎదిగేందుకు దందాలు, సెటిల్‌మెంట్లు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-08-05T06:50:13+05:30 IST