పాస్‌లు ఇచ్చారు.. బస్‌లు మరిచారు

ABN , First Publish Date - 2022-07-30T05:25:12+05:30 IST

పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి. సరిపడా బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అష్టకష్టాలు పడి పుట్‌బోర్డుపైనే నిలిచి రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

పాస్‌లు ఇచ్చారు.. బస్‌లు మరిచారు
బోరుభద్ర వద్ద బస్సుల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు

విద్యార్థులకు సరిపడా అందుబాటులో లేని బస్సులు
పుట్‌బోర్డుపై నిలిచి రాకపోకలు
ఆందోళనలో తల్లిదండ్రులు
(నరసన్నపేట)

పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రయాణ కష్టాలు వెంటాడుతున్నాయి. సరిపడా బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అష్టకష్టాలు పడి పుట్‌బోర్డుపైనే నిలిచి రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల పరిధిలో విద్యార్థుల అవస్థలు మరింత దారుణంగా ఉన్నాయి. విద్యాలయాలకు వెళ్లి వచ్చే సమయంలో అవసరమైన బస్సులు లేవు. కొన్ని బస్సులు సకాలంలో రాక విద్యార్థులు గంటల తరబడి ఎండలో నిరీక్షిస్తున్నారు. సకాలంలో విద్యాలయాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సు రద్దీగా ఉన్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో పుట్‌బోర్డుపై నిలిచి రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. బస్‌పాస్‌లు మంజూరు చేసిన ప్రజారవాణా వ్యవస్థ(పీటీడీ).. అందుకు తగినన్ని బస్సులు సకాలంలో నడపడం లేదంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరకు విద్యార్థుల కోసం స్టూడెంట్‌ స్పెషల్‌ పేరుతో బస్సులు నడిపేవారు. ఈ ఏడాది  ఇంకా బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పీటీడీ అధికారులు స్పందించి తమకు సరిపడా బస్సులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.

- నరసన్నపేట, టెక్కలి నియోజవర్గాల పరిధిలో 1600 మంది విద్యార్థులు బస్‌పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి తగినంతగా బస్సులు మాత్రం నడపడం లేదు. ఈ నియోజకవర్గాల్లో సుమారు 30 విద్యా సంస్థలు ఉన్నాయి. నరసన్నపేట పట్టణానికి సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పోలాకి, టెక్కలి, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, పాతపట్నం మండలాల నుంచి ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ విద్యార్థులు సుమారు 1500 మంది రోజూ వస్తుంటారు

- నరసన్నపేట నుంచి ఇంజనీరింగ్‌ చదివేందుకు టెక్కలి వైపు సుమారు రోజుకు 200 మంది వెళ్లుతుంటారు. ఇంజనీరింగ్‌ చదివే విద్యార్ధులకు కళాశాల సమయానికి పల్లెవెలుగు బస్సులు లేకపోవడంతో  ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు .

- సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం, వడ్డితాండ్ర, సంతబొమ్మాళి, బోరుభద్ర, పోలాకి మండలం పిన్నింటిపేట, బెలమర జంక్షన్‌, పోలాకి, ఈదులవలస జంక్షన్‌ మీదుగా రోజుకు 300 మంది విద్యార్ధులు నరసన్నపేట విద్యాలయాలకు వస్తున్నారు. ఉదయం ఏడుగంటలు సమయంలో టెక్కలి నుంచి వయా బోరుభద్ర మీదుగా ప్రయాణం చేసే రెండే...రెండు బస్సులు ఉన్నాయి. ఇవి సకాలంలో  రాకపోవడంతో విద్యార్థులు ఉదయం నుంచి రోడ్లుపై పడిగాపులు కాస్తున్నారు.

- సీది జంక్షన్‌, నౌతళ, బూర్జువాడ, సారవకోట, అలుదు, చల్లపేట, శ్రీముఖలింగం, బుడితి, అల్లాడ, తిమడాం, ఉర్లాం తదితర మార్గాల్లో నరసన్నపేటకు సుమారు 400 మంది విద్యార్థులు వస్తున్నారు. వీరు వచ్చే సమయంలో అరకొర బస్సులు ఉండటంతో కిక్కిరిసి ప్రయాణం చేస్తున్నారు. ఆడపిల్లలు బస్సులు ఎక్కేందుకు వీలు లేని పరిస్థితి నెలకొంది.  

1 నుంచి.. నడుపుతాం  
గతేడాది మాదిరి ఈఏడాది విద్యార్థుల కోసం స్టూడెంట్‌ స్పెషల్‌ బస్సులను ఆగస్టు ఒకటో తేది నుంచి నడుపుతాం. ఈ ఏడాది బస్సుపాస్‌లకు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో పరిశీలిస్తాం. పదిహేను రోజులు తరువాత అంచనాకు వచ్చి విద్యార్థులకు సరిపడే విధంగా బస్సులను నడుపుతాం.
- శ్రీనివాసరావు, మేనేజర్‌, టెక్కలి డిపో

 
 

Updated Date - 2022-07-30T05:25:12+05:30 IST