సర్వర్‌ డౌన్‌.. సమస్య హై

ABN , First Publish Date - 2022-08-10T06:20:12+05:30 IST

సాంకేతికత రైతులకు పెద్ద అవరోధంగా మారింది.. సకాలంలో పాస్‌ పుస్తకాలు మంజూరు కాక రైతులు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

సర్వర్‌ డౌన్‌.. సమస్య హై

పాస్‌ పుస్తకాల మంజూరులో జాప్యం

వెన్నాడుతున్న సాంకేతిక సమస్య

నెలల తరబడి వేచి చూస్తున్న రైతాంగం

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

సమస్య చెప్పని సిబ్బంది

ఒక్కో మండలంలో 30 వరకూ పెండింగ్‌

 దరఖాస్తుదారులకు దిక్కుతోచని వైనం


సాంకేతికత రైతులకు పెద్ద అవరోధంగా మారింది.. సకాలంలో పాస్‌ పుస్తకాలు మంజూరు కాక రైతులు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఒక్కో మండలంలో దాదాపు 30 వరకూ దరఖాస్తులు పలు సమస్యలతో ఆన్‌లైన్‌ కాకపోవడంతో పెండింగ్‌ పడిపోయాయి. అయితే రైతులకు ఏం చేయాలో తోచక.. మరో పక్క ప్రభుత్వ పథకాలు అందక కార్యాలయాల చుట్టూనే తిరుగుతున్నారు. సిబ్బంది సమస్యను చెప్పకపోవడంతో                     నెలల తరబడి మంజూరు కాకుండానే ఉండిపోతున్నాయి.


సీతానగరం, ఆగస్టు 9 : పాస్‌ పుస్తకం.. ఇదొక పెద్ద ప్రహసనం.. పొలం కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే తరువాత పాస్‌ పుస్తకం మంజూరు కావ డం మరొక ఎత్తు..ఒకప్పుడు అంతా మాన్యువల్‌.. ఎవరు డబ్బులిస్తే వారికి ముందు పనైపోయేది..ఆ తరువాత ఆన్‌లైన్‌.. అన్నీ సక్రమంగా ఉంటేనే దర ఖాస్తు ముందుకు కదులుతోంది. లేదంటే అంతే. ప్రస్తుతం రైతాంగం ఇబ్బందు లకు గురవుతున్నారు. దరఖాస్తు చేయడం దగ్గర నుంచి మంజూరు వరకూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతు న్నారు.పాస్‌ బుక్‌ ఎందుకు మం జూరు కాలేదో...ఎందుకు తిరస్కరించారో తెలియక అయోమయానికి గురవుతు న్నారు.దీంతో ప్రతి మండలంలోనూ పదుల సంఖ్యలో పాస్‌ పుస్తకాలు పెం డింగ్‌లో ఉంటున్నాయి.అధికారులను అడిగితే సాంకేతిక సమస్య అంటున్నారు. 


  మంజూరుకు 40 రోజులు గడువు...


పాస్‌ పుస్తకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే 40 రోజుల్లో మంజూరు చేయాలి. అయితే చాలా మండలాల్లో అలా జరగడం లేదు. నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో పాస్‌ పుస్తకాల మంజూరుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాస్‌ పుస్తకం మ్యుటేషన్‌ (దరఖాస్తు) చేసుకోవడానికి సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గతంలో మీ సేవల ద్వారా దరఖాస్తు చేసేవారు. అయితే ప్రస్తుతం మీ-సేవలను సచివాలయాల్లో విలీనం చేశారు. దీంతో సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌ అవగాహన లోపం... సర్వర్లు పనిచేయకపోవడం తదితర సాంకేతిక కారణాల వల్ల సకాలంలో మంజూరు కాక రైతాంగం ఇబ్బందులకు గురవుతున్నారు.


  తప్పుల సవరణకు అవకాశమే లేదు.. 


ఒక వ్యక్తి కొంత భూమిని కొనుగోలు చేసి పాసు పుస్తకానికి దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నెంబర్‌కు అమ్మకందారుడి ఆధార్‌ నెంబర్‌ అనుసంధానమై ఉంటుంది. అయితే అమ్మకందారుడితో పాటు కొనుగోలుదారుడి ఆధార్‌ నెంబర్‌ కూడా సర్వే నెంబర్‌కు ఆన్‌లైన్‌లో అనుసంధానమై ఉండాలి. మ్యుటేషన్‌ ప్రక్రియలో కొనుగోలు అమ్మకందారులు ఇరువురి వద్ద నుంచి కంప్యూటర్‌ ఓటీపీ అడుగుతుంది. ఇది సహజమైన పని కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో మ్యు టేషన్‌ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆన్‌లైన్‌ అడంగళ్‌లో కేవలం పేరు తప్పు మాత్రమే సవరణ చేస్తున్నారు. రికార్డులు తయారీలో జరుగుతున్న తప్పులు అనగా జిరాయతీ భూమి అని రాయాల్సిన చోట కాలువ అని రాయటం, ఆయకట్టు అని ఉన్న చోట పభ్రుత్వ భూమి అని రాయడం.. విస్తీర్ణంలో  తప్పులు సరిచేయ డం లేదు. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

 

వెన్నాడుతున్న సర్వర్‌ కష్టాలు


ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌.. పాస్‌ బుక్‌ కావాలన్నా.. రేషన్‌ కార్డు కావాలన్నా.. పింఛన్‌ కావాలన్నా.. సచివాల యాలకు వెళ్లి ఆన్‌లైన్‌ దరఖాస్తు చేయాల్సిందే. దరఖాస్తు చేసే సమయంలో సర్వర్‌ సక్రమంగా పనిచేస్తే అదృష్టం లేదంటే సచివాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందే. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రైతులను ఇదే సమస్య వెన్నా డుతోంది. సాంకేతిక సమస్య కారణంగా దరఖాస్తులు చేసుకోవడానికే నెలల తరబడి వేచి చూస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌ అయిన దరఖాస్తులు మాత్రం సమయానికి మం జూరవుతుండగా.. ఆన్‌లైన్‌ కాని దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 


పలు మండలాల్లో ఇదీ పరిస్థితి


సీతానగరం : సీతానగరం మం డలంలో గత రెండు నెలల్లో 130 దరఖాస్తులు రాగా 30 దరఖాస్తులు సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్‌లో పడ్డాయి.దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

కడియం : కడియం మండలంలో ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి నేటి వరకు పట్టాదారు పాస్‌ పుస్తకాలకు 306 దరఖాస్తులు రాగా వాటిలో 272 దరఖాస్తులు పరిష్కరించినట్టు తహశీల్దారు సుజాత తెలిపారు. లింక్‌డాక్యుమెంటట్లు లేకపోవడం, సవరణ, పత్రాలు సక్రమంగా లేక పోవడం వంటి  కారణాల వల్ల 30 దరఖాస్తులు తిరస్కరించగా, 4 పరిశీలనలో ఉన్నారు. 

 గోపాలపురం : గోపాలపురం మండల పరిధిలో ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి నేటి వరకు పట్టా దారు పాస్‌పుస్తకాలకు 580 మంది దరఖాస్తు చేసు కున్నారు. వివిధ కారణాల వల్ల 70 మంది రైతులకు సం బంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు తహశీల్దార్‌  డి.వీరేంద్రనాథ్‌ తెలిపారు. 

 బిక్కవోలు : బిక్కవోలు మండలంలో జనవరి నుంచి ఇప్పటి వరకూ 561 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 37 పెండింగ్‌లో ఉన్నాయి. 28 దరఖాస్తులను వివిధ కార ణాల వల్ల తిరస్కరించాం. 

అనపర్తి : అనపర్తి మండలంలో జనవరి నుంచి ఇప్పటి వరకూ 700 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 35 పెండింగ్‌లో ఉన్నాయి.  

రాజానగరం : రాజానగరం మండలంలో జూలై నుంచి ఇప్పటి వరకూ 110 దరఖాస్తులు వచ్చాయి.  వీటిలో 35 పాస్‌ పుస్తకాలు మంజూరు కాగా 75 పెండింగ్‌లో ఉన్నా యి. వీటి మంజూరుకు ఇంకా సమయం ఉంది. 


 ఆన్‌లైన్‌తో ఇబ్బందులు పడుతున్నాం

ఆన్‌లైన్‌ సర్విసులు వల్ల ఏ పనులు సక్రమంగా జర గడంలేదు. కొత్త పాసుపుస్తకాలు మ్యుటేషన్‌ (దరఖాస్తు) పెట్టుకుంటే కొత్త కొత్త రూల్స్‌ చెబుతున్నారు. దరఖాస్తు తిరస్కరిస్తున్నారు. మాకు ఏమి అర్ధకావడం లేదు. ఒక్కో సారి సర్వర్లు పనిచేయడం లేదు. గతంలో మీసేవలో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. ప్రజలు ఇబ్బందులు పడకుండా దరఖాస్తులు స్వీకరించి పాసు పుస్తకాలు మంజూరు చేయాలి.

 - నల్లూరి హరిబాబు, పురుషోత్తపట్నం రైతు


రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ సమస్య..

సర్వర్‌ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీంతో దరఖాస్తులు పెండింగ్‌లో పడుతున్నాయి. సీతానగరం మండలంలోనే సుమారు 30 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సాంకేతిక సమస్యపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వడం జరిగింది. త్వరలోనే సమస్య పరిష్కరిస్తారు. 

- సత్యనారాయణ రాజు, తహశీల్దార్‌, సీతానగరం


Updated Date - 2022-08-10T06:20:12+05:30 IST