పశుగ్రాస ఉత్పత్తి పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహ ం

ABN , First Publish Date - 2021-06-14T04:43:28+05:30 IST

వేసవి కాలంలో పశువులకు సరైన మేత దొరక్క పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో దూడల ఎదుగుదల దెబ్బతినడానికి దారితీస్తోంది.

పశుగ్రాస ఉత్పత్తి పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహ ం
ఏపుగా పెరిగిన పశుగ్రాసం (ఫైల్‌)

పొదలకూరు, జూన్‌ 13 : వేసవి కాలంలో పశువులకు సరైన మేత దొరక్క పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో దూడల ఎదుగుదల దెబ్బతినడానికి దారితీస్తోంది. వేసవిలో కూడా పశువులకు బలమైన ఆహారాన్ని అందించడానికి పచ్చగడ్డి దొరకని సమయంలో రైతన్నలు ప్రత్యామ్నాయంగా పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేసి పశువులకు ఆహారంగా అందించడానికి ప్రభుత్వం నూతనంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బహువార్షిక పశుగ్రాసాల సాగు చేసుకునే అవకాశాన్ని రైతన్నలకు కల్పించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు రెండు సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి రూ.83,654 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం కల్పించింది. మొదటి సంవత్సరం ఖర్చు కింద రూ.51,301, రెండో ఏడాదికి రూ.32,353లు అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకానికి సొంత భూమి ఉన్న వారితోపాటు కౌలు రైతులు కూడా అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్క రైతుకు రూ.0.25 ఎకరాల నుంచి 2.5 ఎకరాల వరకు సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అదే క్రమంలో రైతులు సమూహంగా ఏర్పడి ఐదు ఎకరాల వరకు అర్హత పొందే అవకాశాన్ని కల్పించింది. ఉపాధిహామీ పథకం కింద ఎకరాకు కూలీలకు రూ.45,030, మెటీరియల్‌ కాంపౌండ్‌ కింద రూ.38,624 చెల్లించనుంది. 


పథకానికి కావాల్సిన పత్రాలు..

మండలంలో 100 ఎకరాలకు ఈ పథకం కింద అర్హత పొందడానికి రైతులు అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంది. అవి ఉపాధిహామీ జాబ్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జెరాక్స్‌లను వారికి అందుబాటులో ఉన్న పశువైద్య అధికారులను లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సమర్పించాలి. అక్కడి అధికారులు అర్హులను ఎంపిక చేస్తారని జిల్లా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏడీఏ శ్రీహరి, పొదలకూరు వెటర్నరీ ఏడీ కృష్ణమూర్తి తెలిపారు. వివరాల కోసం పశువైద్యశాలను లేదా రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2021-06-14T04:43:28+05:30 IST