Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్యదర్శుల పర్యవేక్షణలో క్షేత్రసహాయకులు

గ్రామ సచివాలయాల్లోనే ఉపాధి రికార్డులు

అక్కడి నుంచే నిర్వహణ


సంగం, అక్టోబరు 17 : ఉపాధి హామీ పథకంలో పనిచేసే క్షేత్రసహాయకులు (ఎఫ్‌ఏ) ఇక నుంచి గ్రామ సచివాలయ కార్యదర్శుల ప్రత్యక్ష పర్యవేక్షణలోకి రానున్నారు. రోజువారీ విధుల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో కార్యదర్శికి జవాబుదారీగా ఉండటంతోపాటు, గ్రామ సచివాలయం నుంచే వారు విధులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నిర్మంచే గ్రామ సచివాలయాల్లో వారి కోసం ప్రత్యేక గది కూడా ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. అక్కడే ఉపాధి పనులకు సంబంధించిన అన్ని రికార్డులు భద్రపరచాల్సి ఉంటుంది. ఉపాధి పథకం పనుల నిర్వహణ, కూలీల హాజరు ఇతరత్రా వాటిలో గ్రామస్థాయిలో క్షేత్రసహాయకులు కీలకపాత్ర వహిస్తారు. ఆ మేరకు నాలుగు రోజుల కిందట మండలస్థాయిలో అటు ఉపాధి హామీ క్షేత్రసహాయకులు, ఇటు సచివాలయ కార్యదర్శులను సమన్వయం పరిసేందుకు ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.


ఎఫ్‌ఏ ఇళ్లలో లేక మండల కేంద్రాల్లో..


గతంలో ఉపాధి పనులకు సంబంధించిన రికార్డులు ఎఫ్‌ఏల ఇళ్లలో లేదా మండల కేంద్రాల్లో ఉండేవి. దీనివల్ల అవసరమైన సమయంలో వాటిని అందుబాటులో ఉంచడం లేదు. సచివాలయాల ఏర్పాటు తర్వాత కూడా ఎఫ్‌ఏలు మండల అధికారుల పర్యవేక్షణలోనే ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు గుర్తించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ కోటా నిధులతో గ్రామాల్లో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లీనిక్‌లు, డిజిటల్‌ గ్రంథాలయాలు వంటి భవన నిర్మాణాలు చేస్తూ కీలకమైన ఎఫ్‌ఏలు కూర్చొనేందుకు, రికార్డులను భద్రపర్చేందుకు చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉండే ఎఫ్‌ఏలను ఇక నుంచి సచివాలయ కార్యదర్శి పర్యవేక్షణలో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం సచివాలయాల్లో గోడౌన్‌ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న గదిని అందుకు కేటాయించాలని, అలాంటివి లేనిచోట నిర్మించాలని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఉపాఽధి డ్వామా అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో త్వరలో ఉపాధి క్షేత్రసహాయకులపై కార్యదర్శుల అజమాయిషీ ఏర్పడనుంది. గతంలో ఉపాధి హామీ పథకం ప్రారంభ సమయంలో కార్యదర్శుల పర్యవేక్షణలో క్షేత్రసహాయకులు ఉండేవారు. వారి పర్యవేక్షణలోనే ఉపాధి పనులు జరుగుతుండేవి. అదే తరహా పరిస్థితి త్వరలో రానుంది. ఈ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలయితే ఉపాధి పనులపై గ్రామస్థాయిలోనే పర్యవేక్షణ ఏర్పడుతుంది.


ఆదేశాలు అందాయి..


ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయిలో పనిచేసే క్షేత్రసహాయకులను కార్యదర్శులకు జవాబుదారీగా ఉండేటట్లు జిల్లా కలెక్టర్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. ఇక నుంచి సచివాలయ కార్యదర్శి పర్యవేక్షణలో పనులు జరుగుతాయి. అందుకు సంబంధించిన రికార్డులు కూడా సచివాలయంలోనే అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు సమన్వయం కోసం కార్యదర్శులు, క్షేత్రసహాయకులు, సచివాలయ అసిస్టెంట్‌ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాం.

- నాగేంద్రబాబు, ఎంపీడీవో, సంగం


Advertisement
Advertisement