ఇది సరికాదు

ABN , First Publish Date - 2021-12-04T06:09:26+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడిగా సాగుతాయని ఊహించిందే కానీ, మరీ ఇంత గతితప్పుతాయనుకోలేదు. గత సమావేశాల్లో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్న పన్నెండుమంది విపక్ష ఎంపీలూ ధర్నాకు.....

ఇది సరికాదు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడిగా సాగుతాయని ఊహించిందే కానీ, మరీ ఇంత గతితప్పుతాయనుకోలేదు. గత సమావేశాల్లో చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్న పన్నెండుమంది విపక్ష ఎంపీలూ ధర్నాకు కూచున్న గాంధీ విగ్రహం దగ్గరకు శుక్రవారం బీజేపీ సభ్యులు కొందరు పోయి నినాదాలు చేసొచ్చారు. ఈ రకమైన చేష్టలద్వారా సదరు ఎంపీలు పార్టీ పెద్దల అనుగ్రహం సంపాదిస్తారేమో తెలియదు కానీ, సమావేశాలు మొదలైన నాటినుంచీ అధికారపక్షం నిరంకుశంగానే వ్యవహరిస్తున్నదన్న అప్రదిష్ట మరింత పెరగడానికి ఇవి దోహదం చేస్తాయి. రాజ్యాంగ, పార్లమెంటరీ విలువలను విపక్షాలు పాటించాలన్నది గుర్తుచేయడానికే తాము ఈ పనిచేశామని బీజేపీ సభ్యులు చెప్పుకుంటున్నారు. 


సభ సజావుగా సాగేందుకు ఏం చేయాలో అందరూ కలసికట్టుగా నిర్ణయించాలని రాజ్యసభాపతి అనడమూ, ఎదుటివారిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనబడనప్పుడు మనం మాత్రం ఏమిచేయగలమని మంత్రివర్యులు వాపోవడం విచిత్రంగా కనిపిస్తున్నాయి. డజనుమంది ఎంపీల సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నది ప్రతిపక్షాల వాదన. క్షమాపణ చెప్పేదిలేదన్న తమ నిర్ణయానికి దన్నుగా వారు ఈ అస్త్రాన్ని ప్రయోగించి కూడా ఉండవచ్చు. కానీ, ఆగస్టు 11న ఆందోళన చేసిన వారి జాబితాలో పేరులేనివారు, సభలో లేనివారు, చైర్మన్ ప్రస్తావించనివారినీ సస్పెండ్ చేశారంటూ ఏవో కొన్ని వాదనలైతే ఉన్నందున వాటిని గమనంలోకి తీసుకోవడం అవసరం. విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తిన అభ్యంతరాలను బేఖాతరుచేశారనీ, కనీసం మాట్లాడనీయలేదనీ అంటున్నారు కనుక వీటినీ సవరించి, వివరించవలసిన అవసరం ఉన్నది. సభను స్తంభింపచేయడం, హద్దులు దాటి అల్లరి చేయడం గతంలోనూ ఉన్నదే. ప్రతిపక్షానికి తాము అనుకున్నది సాధించడానికి ఇంతకుమించిన మంచిమార్గం లేదని అరుణ్ జైట్లీ అప్పట్లో ఓ మాటన్నారు. కానీ, ఎవరు అధికారంలో ఉన్నా సభను దారికి తెచ్చేందుకు ఎప్పటికప్పుడు ఒక ప్రయత్నం సాగుతూనే ఉండాలి.


ప్రజాస్వామ్యానికి ఇది అత్యంత ముఖ్యం. ఆగస్టులో జరిగిన ఘటనకు ఇప్పుడు శిక్షవేయడమేమిటని సామాన్యుడు సైతం ఆశ్చర్యపోతున్నాడు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు చర్చకు పట్టుబట్టిన అంశాలు అత్యంత కీలకమైనవి.  దేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ విషయంలో ప్రభుత్వం అస్పష్టమైన, అప్రజాస్వామికమైన వైఖరి అనుసరించడంతో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించిన మాట నిజం. కొత్త వ్యవసాయ చట్టాలమీద కూడా అప్పట్లో విపక్షాలు చర్చకు గట్టిగా పట్టుబట్టాయి. ఈ రెండు అంశాల్లోనూ ప్రభుత్వం ప్రతిపక్షాల విజ్ఞప్తిని బేఖాతరుచేయడంతో వర్షాకాల సమావేశాల్లో అగ్గిరేగింది. విపక్షాలు చర్చకోరిన పెగాసస్ అంశాన్ని సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా తీసుకుంది. వ్యవసాయచట్టాలను మోదీ ప్రభుత్వం రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉపసంహరించుకున్నది. వాటిని గతంలో తాము దేశం నెత్తిన రుద్దినప్పుడూ, ఇప్పుడు రాజకీయ కారణాలవల్ల వద్దనుకున్నప్పుడూ కూడా చర్చకు తావులేదనీ, అంతా ఏకపక్షమేననీ అంటున్నది.


ఆగస్టులో నిండుసభలో ప్రజాస్వామ్యాన్ని ఎవరు అవమానించారన్నది కొన్ని దృశ్యాల, పరస్పర ఆరోపణల ఆధారంగా నిర్థారించలేం కానీ, అప్పటి పరిణామాలు కచ్చితంగా అవాంఛనీయమైనవే. నీలంరంగు దుస్తులేసుకున్న కొందరు ప్రైవేటు వ్యక్తులు సభలోకి వచ్చి తమ మీద దాడిచేశారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం, విపక్షనేతలు కొందరు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు మార్షల్స్ అనుచిత ప్రవర్తనపై ఫిర్యాదు చేయడం తెలిసినవే. ప్రజలను కుదిపేస్తున్న అనేక సమస్యల కంటే తమదే పై చేయి కావాలన్న ఉభయపక్షాల ప్రయత్నంలో విలువైన సభాసమయం అప్పుడూ ఇప్పుడూ కూడా వృథా అవుతున్నది. గత సంఘటనలపై ఇప్పుడు శిక్షలు వేయడంకంటే, ప్రస్తుతం సభను సజావుగా నడపడం మరింత ముఖ్యం. ఏ అంశాన్నీ చర్చించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎన్నడూ లేనందునే ప్రతీ సమావేశంలోనూ ఏదో ఒక వివాదం సృష్టించి, తమకు అవసరమైన బిల్లులు మాత్రం దాటించేస్తున్నదన్న ఆరోపణలకు ఏమాత్రం తావివ్వకూడదు.

Updated Date - 2021-12-04T06:09:26+05:30 IST