పార్లపల్లిలో అమ్మకానికి ఆలయ భూమి

ABN , First Publish Date - 2021-06-22T04:29:34+05:30 IST

మండలంలోని పార్లపల్లి గ్రామంలో కౌలాసనాథస్వామి దేవాలయానికి చెందిన భూమి అమ్మకానికి పెట్టిన ఉదాంతం సోమవారం వెలుగులోనికి వచ్చింది.

పార్లపల్లిలో అమ్మకానికి ఆలయ భూమి
పార్లపల్లి పంచాయతీ ఎదుట ఉన్న దేవాలయానికి చెందిన భూమి

రెవెన్యూ రికార్డులు తారుమారు 

అధికారులకు ఫిర్యాదు చేసిన స్థానికులు


విడవలూరు, జూన్‌ 21: మండలంలోని పార్లపల్లి గ్రామంలో కౌలాసనాథస్వామి దేవాలయానికి  చెందిన భూమి అమ్మకానికి పెట్టిన ఉదాంతం సోమవారం వెలుగులోనికి వచ్చింది. దేవాలయానికి భక్తులు అనుభవం కింద ఇచ్చిన భూమిని తన పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో మార్చుకుని ఇతరులకు అమ్మేయాలని ప్రయత్నించాడు ఓ వ్యక్తి. ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మునుముడి రామలక్ష్మమ్మ పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న సర్వేనెం 450సీ గల 53సెంట్ల  భూమిని కైలాసనాథస్వామి ఆలయానికి 120 ఏళ్ల క్రితం రాసి ఇచ్చినట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు. అ భూమిలో జంగందేవర్లు పూలతోటలను సాగుచేసి, పూసిన పూలను కైలాసనాథస్వామి, అలఘనాథస్వామి ఆలయాల్లోని స్వామి, అమ్మవార్ల కైంకర్యాలకు అందజేయాలని, అలాగే భూమిని అనుభవించాలనే కానీ అమ్మకాలు జరపకూడదని వీలునామాలో పేర్కొన్నట్లు సమాచారం. అప్పటి నుంచి జంగందేవర్ల వంశీకులు ఆ భూమిలో పూలతోట సాగు చేసిన పూలను రెండు దేవాలయాల్లోని స్వామి, అమ్మవార్లకు ఇచ్చేవారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన గత కొద్ది కాలంగా జంగం దేవర్ల కుటుంబీకులు ఆ భూమిలో పూల సాగుని నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ భూమి నిరుపయోగంగా మారింది. దీంతో జంగం దేవర్ల కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి  భూమిపై కన్నేశాడు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో తన పేరు ఎక్కించుకుని పాస్‌బుక్‌ తీసుకున్నాడు. ఈ క్రమంలో భూమిని సదను చేసి  అంకణం రూ.20వేల చొప్పున అమ్మకానికి పెట్టాడు. కొందరు రోడ్డు పక్కన స్థలం ఉండటంతో అతనికి అడ్వాన్స్‌లు కూడా ఇచ్చినట్లు తెలిసింది.. దీంతో భూమి అమ్మకం విషయం గ్రామంలో దావాలనంగా వ్యాపించింది. దేవాలయానికి చెందిన భూమిని ఎలా అమ్ముతారని  రెవెన్యూ అఽధికారులకు ఫిర్యాదు చేశారు.   


విచారణ చేసి చర్యలు తీసుకుంటాం

పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న భూమికి సంబందించి ఫిర్యాదులు అందాయి. ఆ భూమి దేవాలయానికి చెందిందా లేక ఇంకెవ్వరికైనా చెందిందా అన్న విషయాన్ని రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.

- చంద్రశేఖర్‌, తహసీల్దారు

 

Updated Date - 2021-06-22T04:29:34+05:30 IST