పార్కింగ్‌ ఫీజుపై పెనాల్టీ..!

ABN , First Publish Date - 2021-02-26T19:20:15+05:30 IST

వ్యాపార, వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ రుసుము వసూలు...

పార్కింగ్‌ ఫీజుపై పెనాల్టీ..!

  • ఉత్తర్వులను ఉల్లంఘిస్తే వాతే
  • రూ.50 వేల వరకు జరిమానా
  • నేటి నుంచి ఈవీడీఎం నోటీసులు
  • మాల్స్‌, మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సంస్థలపై నజర్‌
  • ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి జీహెచ్‌ఎంసీ
  • 2018లోనే ఉచిత పార్కింగ్‌ ఉత్తర్వులు
  • అయినా అమలు కాని వైనం
  • ఈ నేపథ్యంలో తాజా చర్యలు

హైదరాబాద్‌ : వ్యాపార, వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్‌ రుసుము వసూలు నియంత్రణపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది. పార్కింగ్‌ ఫీ వసూలుకు సంబంధించి గతంలో విదివిధానాలు విడుదల చేసినా పలు ప్రాంతాల్లోని వ్యాపార సంస్థల్లో అమలు కావడం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టానికి రుసుము వసూలు చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలో సర్కారు జీహెచ్‌ఎంసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మార్చి 20, 2018న జారీ చేసిన ఉత్తర్వుల నిక్కచ్చి అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది దీంతో ఈవీడీఎం అధికారులు రంగంలోకి దిగారు. జీఓలో ఉన్న విధివిధానాలు, వ్యాపార సంస్థలు ఏం చేయాలన్నది వివరిస్తు గ్రేటర్‌లోని వ్యాపార, వాణిజ్య సంస్థలకు శుక్రవారం నుంచి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. 


నోటీసులు అందిన నాటి నుంచి 15 రోజుల్లో ఈవీడీఎం చేసిన సూచనలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి లేని పక్షంలో అనంతరం తనిఖీలు నిర్వహించి రూ.50 వేల వరకు పెనాల్టీ విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏవైనా వ్యాపార సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేసినట్టు తగిన ఆధారాలతో సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌కు ట్విట్టర్‌ ఖాతాకు షేర్‌ చేస్తే చర్యలు తీసుకుంటారు.  భవన నిర్మాణ నిబంధనల ప్రకారం భవన ప్రాంగణంలోనే తగిన పార్కింగ్‌ సదుపాయం ఉండాలి. ఈ నేపథ్యంలో పార్కింగ్‌ వసతి కల్పించని వాణిజ్య సంస్థలపైనా చర్యలు తీసుకోనున్నారు. పార్కింగ్‌ రశీదు ఎలా ఉండాలి..? అందులో ఉండాల్సిన వివరాలు..? నిబంధనలు తదితర అంశాలను వివరిస్తు నోటీసులు ఇవ్వనున్నారు. పార్కింగ్‌ టికెట్‌ నమూనాను నోటీసుల్లో పొందుపరుస్తారు. దాని ప్రకారం ఏజెన్సీలు ముద్రించుకోవాలి.


  • పార్కింగ్‌ టికెట్‌పై నిర్వహణ ఏజెన్సీ పేరు, ఫోన్‌ నెంబర్‌, చిరునామా ఉండాలి. 
  • మొదటి అరగంట ఉచిత పార్కింగ్‌కు అవకాశమున్నందున వారికి కూడా రశీదు ఇవ్వాలి. దానిపై మినహాయింపు అని స్టాంప్‌ వేయాలి. 
  • ఫీజు వసూలు చేసిన పక్షంలో పెయిడ్‌ అనే ముద్ర ఉండాలి. 
  • రశీదుపై పార్కింగ్‌ ఇన్‌చార్జి సంతకం ఉండాలి. వాహనాలు పార్క్‌ చేసిన వారందరికీ రశీదు ఇవ్వాలి. 
  • టికెట్‌పై వాహనం నెంబర్‌, వచ్చిన, తిరిగి వెళ్లే సమయం ఉండాలి. ఇందుకోసం 30 నిమిషాలు, 30 ని. నుంచి గంట, గంటకుపైగా అని ఉండే చోట పక్కన ఉన్న బాక్సులో టిక్‌ చేయాలి. 

ఇవీ నిబంధనలు...

30నిమిషాల వరకు అన్ని వాహనాల పార్కింగ్‌ ఉచితం. 

31 నిమిషాల నుంచి గంట వరకు షాపులో ఏదైనా కొనుగోలు చేసినట్టు బిల్లు చూపితే పార్కింగ్‌ రుసుము వసూలు చేయవద్దు. 

గంట అంతకంటే ఎక్కువ సమయం పార్కింగ్‌ చేస్తే.. పార్కింగ్‌ రుసుము కంటే కొనుగోలు చేసిన మొత్తం ఎక్కువ ఉంటే ఫీజు వసూలు చేయకూడదు. 

టికెట్‌కు వెనక వైపు ఈ నిబంధనలు ముద్రించాలి. 

Updated Date - 2021-02-26T19:20:15+05:30 IST