పార్కింగ్‌ బాదుడు

ABN , First Publish Date - 2021-04-09T06:29:31+05:30 IST

సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు రైల్లో వెళ్లడానికి చార్జీ ఎంతో తెలుసా? రూ. 365 మాత్రమే.

పార్కింగ్‌ బాదుడు
పార్కింగ్‌ చార్జీల పట్టిక

 సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గంటకు రూ. 15, రోజుకు రూ. 425 

రెజిమెంటల్‌బజార్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు రైల్లో వెళ్లడానికి చార్జీ ఎంతో తెలుసా? రూ. 365 మాత్రమే. కానీ, ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పార్క్‌ చేసి, రెండు రోజులు విజయవాడ వెళ్లి వచ్చాక మొత్తం పార్కింగ్‌ ఫీజు ఎంతో తెలుసా? రూ. 850. దానికి 18ు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అదనం. వామ్మో..! అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడ అంతే..! అడ్డగోలుగా పార్కింగ్‌ ఫీజులు వసూలు చేస్తున్న నిర్వాహకులు.. ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇక్కడ 24 గంటల పార్కింగ్‌ ఫీజు చెల్లించే కంటే.. ఆ మొత్తంతో ఎక్స్‌ప్రెస్‌ రైలులో కర్నూల్‌కు వెళ్లిరావొచ్చు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పార్కింగ్‌ ఫీజులకు అడ్డుకట్ట పడడం లేదు. నిర్వాహకులు గంటకు రూ. 15 చొప్పున వసూలు చేస్తున్నారు. దీనికి 18ు జీఎస్టీ అదనం. అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని రైల్వేస్టేషన్‌లో పార్క్‌ చేసేవారికి రైలు టికెట్‌ ధర కంటే పార్కింగ్‌ చార్జీ తడిసి మోపెడవుతోంది. వాహనాన్ని పార్కింగ్‌లో పెట్టి 24 గంటలు దాటితే రూ. 425 చెల్లించక తప్పదు. పార్కింగ్‌ టెండర్‌ కాంట్రాక్టు ఖరీదు తక్కువగా ఉంటే..పార్కింగ్‌ చార్జీలు తక్కువ ఉండే అవకాశం ఉంది.  

ఒకటి, రెండు గంటలకు ఫర్వాలేదు

పార్కింగ్‌ లాట్‌లలో వాహనాలకు భద్రత ఉంటుంది. గంట నుంచి రెండు గంటలు పెట్టే వారికి పార్కింగ్‌ చార్జీలు భారం కాదు. 24 గంటల కంటే ఎక్కువసేపు పార్క్‌ చేసేవారికి పార్కింగ్‌ చార్జీలు తడిసి మోపెడవుతాయి. అలా ఎక్కువసేపు పార్క్‌ చేసేవారికి చార్జీలను తగ్గించాలి.

- అరుణ్‌ గుప్తా, హయత్‌నగర్‌

రైలు ప్రయాణం కంటే పార్కింగ్‌ చార్జీలే అధికం

రైలు టికెట్‌ కంటే పార్కింగ్‌ చార్జీలే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై రైల్వే శాఖ దృష్టి సారించాలి. ప్రయాణికులకు తక్కువ ధరకు పార్కింగ్‌ వసతి కల్పించాలి.

- మణి, మెహిదీపట్నం

నిబంధనల ప్రకారమే చార్జీలు

నిబంధనల ప్రకారమే పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నాం. కాంట్రాక్టు ఫీజు తగ్గిస్తే.. చార్జీలు తగ్గుతాయి. పార్కింగ్‌ కాంట్రాక్టర్‌లు దోచుకుంటున్నట్లు వాహనదారులు భావిస్తున్నారు. రైల్వే శాఖదే ఆ పాపం. పార్క్‌ చేసిన వాహనాన్ని తిరిగి ఇచ్చే వరకు కాపాడే బాధ్యత మాది. 

- పార్కింగ్‌ కాంట్రాక్టర్‌


Updated Date - 2021-04-09T06:29:31+05:30 IST